AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబు కాకుండా బీజేపీ ఎందుకు? పవన్ వ్యూహమిదే!

ఒకవైపు వైసీపీ నేతలంతా పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడంటూ విమర్శిస్తుంటే ఆయన మాత్రం ప్రత్యేక రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు చాటుతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. దాదాపు చంద్రబాబు వెర్షన్‌నే పవన్ కల్యాణ్ వినిపించడంతో ఆయన చంద్రబాబుతో జత కడతారని జగన్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆయన చంద్రబాబుతో కలిసి తిరిగిన సందర్భాలను ఉటంకిస్తున్నారు. కానీ, తన రూటు సెపరేటేనని చాటుతున్నారు జనసేనాని. డిసెంబర్ మొదటి వారంలో రాయలసీమలో జరిపిన […]

బాబు కాకుండా బీజేపీ ఎందుకు? పవన్ వ్యూహమిదే!
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 14, 2020 | 1:50 PM

Share

ఒకవైపు వైసీపీ నేతలంతా పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడంటూ విమర్శిస్తుంటే ఆయన మాత్రం ప్రత్యేక రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు చాటుతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. దాదాపు చంద్రబాబు వెర్షన్‌నే పవన్ కల్యాణ్ వినిపించడంతో ఆయన చంద్రబాబుతో జత కడతారని జగన్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆయన చంద్రబాబుతో కలిసి తిరిగిన సందర్భాలను ఉటంకిస్తున్నారు. కానీ, తన రూటు సెపరేటేనని చాటుతున్నారు జనసేనాని.

డిసెంబర్ మొదటి వారంలో రాయలసీమలో జరిపిన పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ బీజేపీకి దగ్గరయ్యే సంకేతాలిచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ స్పూర్తితో సైనిక సంక్షేమ నిధికి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్ళి తానే స్వయంగా విరాళం అందిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఉన్నట్లుండి ఏపీ రాజధాని రగడ మొదలైంది. ఆ క్రమంలో రాజధాని ప్రాంత రైతులకు అండగా రెండు, మూడు సందర్భాలలో రోడ్డెక్కి మరీ పవన్ కల్యాణ్ ఆందోళన చేశారు. పోలీసుల ముళ్ళ కంచెలను దాటుకుని మరీ అమరావతి ప్రాంత ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.

ఈ క్రమంలో ప్రభుత్వ ప్రకటన రాకుండానే ప్రత్యక్ష కార్యాచరణ ఎందుకని పార్టీ వర్గాలకు చెప్పిన పవన్ కల్యాణ్ జనవరి 11వ తేదీన బీజేపీ అధినేతలను కలిసే పని మీద ఢిల్లీ వెళ్ళారు. ఆదివారం అంతా ఖాళీగానే ఢిల్లీలో కూర్చున్నారని కొందరు చెబుతుంటే.. మరి కొందరు మాత్రం పవన్ కల్యాణ్ ఆర్ఎస్ఎస్ నేతలను కలిసి సీఏఏ, ఎన్నార్సీలపై బ్రీఫింగ్ తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం పవన్ కల్యాణ్.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జయ్ ప్రకాశ్ నడ్డాను కలుసుకున్నారు. కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.

యాక్షన్ ప్లాన్ ఇదే

బీజేపీతో కలిసి పనిచేసే విషయంలో బహిరంగ ప్రకటన చేయనప్పటికీ దాదాపు అలాంటి సంకేతాలను ఇచ్చేశారు పవన్ కల్యాణ్. దీనికి గాను క్లియర్ కట్ కార్యాచరణ కూడా రెడీ అయ్యిందని అంటున్నారు. జనవరి 20 తర్వాత ఏ క్షణమైనా ఏపీకి మూడు రాజధానులంటూ జగన్ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశాలుండడం, ఈ నెలాఖరుకు విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో.. అదే సందర్భంలో బీజేపీతో కలిసి జనసేన కూడా ఉద్యమించేందుకు కార్యాచరణ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీతో జత కడితే.. రెండు పార్టీల క్యాడర్‌ రోడ్డెక్కి సత్తా చాటొచ్చన్నది తాత్కాలిక వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో త్వరలో లోకల్ బాడీస్ ఎన్నికలు జరగనున్నాయి. రాజధాని ఉద్యమ ఊపుతోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాలన్నది వ్యూహమని చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ముగిసే సరికి ఏ పార్టీ సత్తా ఎంతో రెండు పార్టీలకు ఒక క్లారిటీ వస్తుందని, ఆ తర్వాత సామాజిక వర్గాల ప్రాతిపదికన రెండు పార్టీలు కలిసి ఎదిగితే.. 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతారన్నది ఒక వ్యూహమని అంటున్నారు. బీజేపీకి ఎలాగో ముఖ్యమంత్రి స్థాయి చరిష్మా వున్న నేతలు లేరు.. సో.. 2024లో రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను ఉభయతారకంగా వుండేలా జనసేన-బీజేపీ మితృత్వ ఫార్ములా రూపొందినట్లు చెప్పుకుంటున్నారు. ఈ ఫార్ములాను సందర్భానుసారం మార్చుకుంటూ వెళ్ళడం ద్వారా ఏపీలో వైసీపీకి బీజేపీ-జనసేన కూటమే ప్రత్యామ్నాయం అనేలా ప్లాన్ రూపొందినట్లు చెబుతున్నారు. చంద్రబాబును బీజేపీ అధినాయకత్వం దగ్గరికి తీసుకునే పరిస్థితి లేకపోవడంతో.. బీజేపీతో జత కట్టడం ద్వారా ఏపీలో ప్రత్యామ్నాయంగా మారాలన్నదే జనసేనాని ‘‘జబర్దస్‘‘ వ్యూహమని తెలుస్తుండగా.. యాక్షన్ ప్లాన్ ‘‘అదిరింది‘‘ అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.