Gold Missing in CBI Custody: సీబీఐ కస్టడీలో 100కేజిల బంగారం మాయం..! విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
అక్రమార్కులకు వణుకుపుట్టించే కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. తమిళనాడులో సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం అదృశ్యమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై..

అక్రమార్కులకు వణుకుపుట్టించే కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. తమిళనాడులో సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం అదృశ్యమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విచారణ జరపాలంటూ మద్రాసు హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. అయితే స్థానిక పోలీసులతో దర్యాప్తు జరిపితే సంస్థ ప్రతిష్ఠ దిగజారుతుందని, ఈ కేసును సీబీ-సీఐడీకి అప్పగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం..
‘ఇది సీబీఐకి అగ్నిపరీక్షే. వారు సీతాదేవీ అంత పవిత్రంగా ఉంటే, వారి చేతులకు ఎలాంటి అవినీతి మరకలు లేకపోతే కేసు నుంచి క్షేమంగా బయటపడతారు. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని పేర్కొంది. అంతేగాక, సీబీఐ స్థానిక పోలీసులతో దర్యాప్తు వద్దనడాన్ని కూడా న్యాయస్థానం తప్పుబట్టింది. పోలీసులంతా నమ్మకస్థులేనని, సీబీఐ ఎక్కువ.. పోలీసులు తక్కువ అని చెప్పడం సరికాదని సూచించింది.
బంగారం ఎలా మాయమైంది..? 2012లో చెన్నైలోని సురాణా కార్పొరేషన్ లిమిటెడ్‌పై నమోదైన ఓ కేసులో సీబీఐ ఆ కంపెనీ నుంచి 400.47కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బిస్కట్లు, ఆభరణాల రూపంలో ఉన్న ఈ పుత్తడిని కంపెనీ వాల్ట్‌లో లాక్ చేసి సీల్ వేసింది. ఈ వాల్ట్ తాళాలను చెన్నైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించింది. కాగా..
2013లో సురాణా కంపెనీపై మరో కేసు నమోదు చేసిన సీబీఐ.. తొలి కేసులో బంగారం స్వాధీనం అవసరం లేదని, దాన్ని రెండో కేసుకు బదలాయించాలని కోర్టును కోరింది. ఇందుకు న్యాయస్థానం అనుమతించింది. అయితే అప్పటికే బంగారం సీబీఐ కస్టడీలో ఉన్నందున భౌతికంగా దాన్ని ముట్టుకోకుండా.. కేసుల పత్రాల్లో మార్పు చేసింది. అయితే 2015లో సురాణా కంపెనీపై ఉన్న రెండో కేసును సరైన సాక్ష్యాలు లేని కారణంగా మూసివేస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించింది. ఇందుకు అంగీకరించిన కోర్టు..
స్వాధీనంలో ఉన్న బంగారాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కు అప్పగించాలని ఆదేశించింది. అయితే దీనిపై సురాణా కంపెనీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో సురాణా కంపెనీ రుణాల ఎగవేతపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు ప్రారంభించింది. ఈ కంపెనీ ఎస్‌బీఐకి రూ.
1,160 కోట్లు చెల్లించాల్సి ఉన్నందున సీబీఐ స్వాధీనంలో ఉన్న బంగారాన్ని తమకు అప్పగించాలని కోరుతూ బ్యాంక్ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఎస్‌బీఐతో పాటు మరికొన్ని బ్యాంకుల్లోనూ సురాణాపై రుణ ఎగవేత ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం తిరిగి తిరిగి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్‌కు చేరింది.
దీనిపై 2019 డిసెంబరులో విచారణ జరిపిన ట్రైబ్యూనల్.. సీబీఐ కస్టడీలో ఉన్న బంగారం మొత్తాన్ని సురాణా కంపెనీ చెల్లించాల్సిన బ్యాంకులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో సీబీఐ వాల్ట్‌లను తెరిచింది.
అందులోని బంగారాన్ని తూకం వేయగా.. 103 కేజీలు తక్కువగా ఉంది. దీంతో అంతా షాకయ్యారు. సురాణా కార్యాలయం నుంచి బంగారాన్ని తూకం వేసే స్వాధీనం చేసుకున్నామని.. అప్పుడు ఆ మొత్తం 400 కేజీలుగా చూపించినట్లు సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
పసిడి మొత్తాన్ని సీల్ చేశామని, అదృశ్యమైన బంగారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. అయితే స్వాధీనం సమయంలో బంగారు చైన్లు అన్నింటినీ కలిపి తూకం వేశారని, ఫిబ్రవరిలో విడివిడిగా తూకం వేశారని.. అందుకే బంగారం తగ్గిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
100 కిలోలకు పైగా ఎలా తగ్గుతుందని ప్రశ్నించింది. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి ఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఆరు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని తమిళనాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.




