కార్తీకమాసంలో ఇలా చేస్తే..మీకన్నీ శుభాలే..
మాసాలలో కార్తీకానికి ఉన్నఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాసం సాధారణంగా పరమ శివునికి ప్రీతి పాత్రమైనది. అటు విష్టుమూర్తి ఆరాధనకు కార్తీకం అత్యంత ప్రధానమైనది. శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదు అనేది నానుడి. దీంతో ఈ నెలలో ఇటు శైవ క్షేత్రాలు.. అటు వైష్ణవ క్షేత్రాలు అన్నిటిలోనూ ప్రత్యేక పూజాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి […]
మాసాలలో కార్తీకానికి ఉన్నఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాసం సాధారణంగా పరమ శివునికి ప్రీతి పాత్రమైనది. అటు విష్టుమూర్తి ఆరాధనకు కార్తీకం అత్యంత ప్రధానమైనది. శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదు అనేది నానుడి. దీంతో ఈ నెలలో ఇటు శైవ క్షేత్రాలు.. అటు వైష్ణవ క్షేత్రాలు అన్నిటిలోనూ ప్రత్యేక పూజాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 29 నుంచి ఈ మాసం ప్రారంభమైంది. సూర్యుడు తుల రాశిలో ఉండగా కార్తీక మాసంలో స్నానం, అర్చనం, వ్రతం, ఆరాధనం, దీపారాధనం, దానం మొదలైనవి నియమ నిష్టలతో ఆచరించిన వారికి అక్షయ సంపదలు, సకల శుభాలు కలుగుతాయని పురాణ వాక్యం.
ధాత్రి పూజ:
- ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఒక్కసారైనా ఉసిరిచెట్టుకు 8 దీపాలు ఉంచు అన్నారు పెద్దలు. అంటే ఉసిరిచెట్టుకు 8 దిక్కులయందు 8 దీపాలు పెట్టాలి. అలాగే 8 ప్రదిక్షణలు చెయ్యాలి. అంటే..అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నమస్కరిస్తే..ఆ సమయంలో ఆ తల్లియే అనుగ్రహించినట్టు. ఈ సమయంలో విష్ణు సహస్రనామాలు, లలితా సహస్ర నామావళి వంటి వాటిని పారాయణం చేయాలి.
- ఇకపోతే, కార్తీకమాసంలో శివుడికి పూజ, శివాభిషేకంతో పాటు తోచిన విధంగా దానధర్మాలు కూడా చేయాలి. ఇలా చేయడం వలన పుణ్యం లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కష్టాలు ఉంటే తొలగిపోతాయి. సంపదలు కలుగుతాయి. అంతేకాదు, మరణించాక కైలాసంలో చోటు లభిస్తుంది. అంతే కాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవు నెయ్యితో కార్తీక దీపాన్ని వెలిగించడం మంచిది. విష్ణువు దరిద్రాలను దూరం చేసే దామోదరునిగా అవతరిస్తాడు. కార్తీక పూజలతో పరమాత్ముని తత్వం ప్రాముఖ్యం తెలుస్తుంది. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.
- కార్తీక మాసంలో అందరికి అన్ని రోజులు స్నానాలు, ఉపవాసాలు చేయడం కుదరదు..అలాంటివారు కార్తీక మాసం పర్వదినాలైన సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజులలో స్నానాలు చేసి, ఉపవాసం ఉండి, గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే జన్మజన్మల పుణ్యఫలం వస్తుందని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పాడు. కావున కార్తీకమాసంలో ప్రతి రోజు తెల్లవారుజామున స్నానాలు చేయడం కుదరడం లేదని..బాధపడకండి..కనీసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిధుల రోజులలో తెల్లవారుజామునే కార్తీక స్నానాలు ఆచరించినా..గొప్ప భోగభాగ్యాలను పొందవచ్చు.
- ముఖ్యంగా, కార్తీకమాసంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి విశేష ప్రాధాన్యం ఉంది. అక్కగానీ, చెల్లెలుగానీ వండిన ఆహారం తిని వారికి కానుకలు సమర్పిస్తే సర్వ సంపదలు వరిస్తాయట. అలా వీలుకాకపోతే ఉసిరి చెట్టుకు పూజలు చేసి, వనభోజనాలు చేసినా సరిపోతుందట. మొత్తమ్మీద 30 రోజులు కార్తీక దీక్ష చేపట్టి విజయవంతంగా పూర్తిచేసిన వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుందని మహామునులు చెబుతుంటారు.