Rain Alert: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు.. ఇక రైతులకు పండగే
దేశవ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గడిచిన జూన్ నెలలో తీవ్ర ఎండలు, వర్షభావ పరిస్థితులతో అల్లాడిపోయిన ప్రజలకు, దేశ రైతాంగానికి భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాబోయే 15 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు వాతావరణ శాఖ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. రాబోయే 15 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర, మధ్య భారత దేశంలో శరవేగంగా విస్తరిస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని.. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్,ఢిల్లీ, హర్యానా, బీహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ప్రారంభమయ్యాయి.గడిచిన 24 గంటల్లో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉత్తర, పశ్చిమ భారత దేశంలో రుతుపవనాల కదలికలు మరింత వేగవంతమయ్యాయని పేర్కొంది.
జూలై 2 నాటికి రుతుపవనాల ఉత్తర పరిమితి రేఖ (Northern Limit of Monsoon – NLM) ప్రస్తుతం పోర్‌బందర్, వల్లభ్ విద్యానగర్, నీముచ్, టోంక్, భివానీ, భటిండా మీదుగా సాగుతోందని శాస్త్రవేత్తలు మ్యాప్ ద్వారా వెల్లడించారు.రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ స్పష్టం చేసింది.
జంట అల్పపీడనాలతో ముంచెత్తనున్న వర్షాలు
ప్రస్తుతం వాతావరణంలో ఏర్పడిన కొన్ని అరుదైన పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారాయని నిపుణులు చెప్తున్నారు…ఒకే సమయంలో అటు మధ్య భారతదేశంలో, ఇటు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడేందుకు బలమైన అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ జంట అల్పపీడనాలతో పాటు, ఉత్తర భారత్ వైపు విస్తరించిన రుతుపవన ద్రోణి కారణంగా.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటి నుండి భారీగా తేమతో కూడిన గాలులు దేశం లోపలికి దూసుకొస్తున్నాయి.వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందిని తెలిపింది.
125 ఏళ్ల చరిత్రలో జూన్‌లోనే 5వ అత్యల్ప వర్షపాతం
ఈ ఏడాది జూన్ నెల దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన రికార్డును మూటగట్టుకుంది. దేశవ్యాప్తంగా జూన్ నెలలో ఏకంగా 40 శాతం వర్షపాత లోటు నమోదైంది.వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం.. 1901 సంవత్సరం తర్వాత గత 125 ఏళ్లలో నమోదైన ఐదవ అత్యంత పొడి జూన్ నెలగా ఈ ఏడాది జూన్ రికార్డులకెక్కింది. దీనివల్ల ప్రజలు ఉక్కపోత ,వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు..
దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరాలు
దేశ చరిత్రలో 1905, 1926, 2009, 2014, 2026 ఈ ఐదేళ్లలో జూన్ నెలల్లో అత్యంత తక్కువ వర్షపాతం 100మీ.మీ లోపు నమోదైంది.1905లో శతాబ్దం క్రితం జూన్ నెలలో కేవలం 92.3 మీ.మీ వర్షపాతం నమోదు కాగా, 1926 జూన్ లో వర్షపాతం 97.4 మీ.మీ నమోదైంది. ఇక 2009లో తీవ్రమైన ఎల్ నినో ప్రభావం అత్యంత దారుణంగా కేవలం 87.5 మీ.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 2014 జూన్‌లో 93 మీ.మీ వర్షపాతం నమోదుకాగా ఈ ఏడాది జూన్ నెలలో దాదాపు 40 వర్షపాత లోటుతో కేవలం మీ.మీ వర్షపాతం నమోదైంది.
జూన్ నెలల్లో వర్షపాతం తక్కువగా నమోదుకావడానికి పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడే ఎల్ నినో’ పరిస్థితులు ప్రధాన కారణంగా మారాయి. దీని కారణంగా రుతుపవనాలు విస్తరించడం కూడా బలహీన పండింది. కేరళా తీరానికి ఇవి సకాలంలో వచ్చినప్పటికీ దేశం లోపలికి విస్తరించే క్రమంలో మాత్రం 10 నుండి 15 రోజుల పాటు ఒకే చోట స్తంభించిపోయాయి. దీని వల్లే జూన్‌లో వర్షపాతం తగ్గింది. ఇదే కాదు అల్పపీడనాల జాడ లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. జూన్ నెలలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఎలాంటి వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడకపోవడం వల్ల మేఘాలకు కావాల్సిన తేమ అందకపోవడం వల్ల వర్షాలు కురవలేదని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
