Telangana: రచ్చకెక్కిన నిజాం ఆస్తుల వివాదం.. ముకర్రం జా ట్రస్ట్ నుంచి ప్రిన్స్ ఆజం జా తొలగింపు!
ముకర్రం జా మరణం తర్వాత హైదరాబాద్ నిజాం వారసుల మధ్య ఆస్తుల వివాదం రచ్చకెక్కింది. రెండో కొడుకు ఆజం జాకు తండ్రి స్థాపించిన ముకర్రం జా ట్రస్ట్ నుండి తొలగింపు నోటీసు అందింది. తొమ్మిదో నిజాంగా పెద్ద కుమారుడు అజ్మెత్ జా ప్రకటనను ఆజం జా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఆజాం జా కీలక ఆరోపణలు చేశారు.

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ్యంగా వెలిగిన హైదరాబాద్ నిజాం వారసుల మధ్య విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఎనిమిదో నిజాం ముకర్రం జా మరణం తర్వాత ఆయన వారసుల మధ్య మొదలైన ఆస్తుల వివాదం ఇప్పుడు సంస్థల నుండి తొలగింపుల వరకు వెళ్లింది. తాజాగా ముకర్రం జా రెండో కొడుకు అలెగ్జాండర్ ఆజం జాకు ఆయన తండ్రి స్థాపించిన ప్రతిష్టాత్మక ది ముకర్రం జా ట్రస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ నుండి తొలగింపు నోటీసు అందడం కలకలం రేపుతోంది.
వివాదానికి మూలం ఏమిటీ?
2023 జనవరిలో ముకర్రం జా మరణించిన తర్వాత ఆయన మొదటి భార్య ప్రిన్సెస్ ఎస్రా కుమారుడైన అజ్మెత్ జాను తొమ్మిదో నిజాంగా ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియను రెండో కొడుకు ఆజం జా మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు.1971లోనే భారత ప్రభుత్వం రాజభరణాలు, బిరుదులను రద్దు చేసినప్పుడు, తన సోదరుడిని తొమ్మిదో నిజాంగా ఎలా ప్రకటిస్తారని ఆజం జా ప్రశ్నించారు. కుటుంబ ఆస్తులలో తనకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా కోసం ఆయన గత ఏడాది న్యాయపోరాటం కూడా మొదలుపెట్టారు.
పారదర్శకతను అణచివేసే ప్రయత్నమా?
తొలగింపు నోటీసుపై ఆజం జా కార్యాలయం ఘాటుగా స్పందించింది. ట్రస్ట్ వ్యవహారాల్లో పారదర్శకత కోరినందుకే తనను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆజం జా ఆరోపిస్తున్నారు. “ట్రస్ట్ వ్యవహారాలలో జవాబుదారీతనం కోసం నేను చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికే ఈ నోటీసు ఇచ్చారు. ఇది పారదర్శకతను అంతం చేసే కుట్ర” అని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ముకర్రం జా వారసత్వం
హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు. 1967 నుండి 1971 వరకు భారత ప్రభుత్వం చేత నిజాంగా గుర్తింపు పొందారు. ఆజం జా ముకర్రం జా రెండో కుమారుడు కాగా అజ్మెత్ జా ముకర్రం జా పెద్ద కుమారుడు. ప్రస్తుతం తన తండ్రి వారసుడిగా చలామణి అవుతున్నారు. హైదరాబాద్ చారిత్రక కట్టడాలు, వేల కోట్ల ఆస్తులు, విద్యా సంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఈ కుటుంబంలో చీలికలు రావడం ఇప్పుడు పాతబస్తీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కోర్టు మెట్లెక్కిన ఈ రాజరికం వివాదం ముందుముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
