AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘శరన్నవరాత్రులు’ ఇంతకీ ఆ పేరెలా వచ్చింది..?

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట. నవదుర్గలు : ప్రధమంశైలపుత్రిణి, […]

'శరన్నవరాత్రులు' ఇంతకీ ఆ పేరెలా వచ్చింది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 30, 2019 | 7:07 PM

Share

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

నవదుర్గలు :

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్|| పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

1 శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి): దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

2. బ్రహ్మచారిణి ( గాయత్రి ) : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

3. చంద్రఘంట ( అన్నపూర్ణ ) : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

4. కూష్మాండ ( కామాక్షి ): అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

5. స్కందమాత ( లలిత ): అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

6. కాత్యాయని (లక్ష్మి): దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

7. కాళరాత్రి ( సరస్వతి ): దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ | వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

8. మహాగౌరి ( దుర్గ ) : అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

9. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ): దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.

శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||