గ్రేటర్ ప్రజాక్షేత్రంలో ప్రచారాల హోరు.. అల్లాపూర్‌ చౌరస్తాలో కేటీఆర్ రణభేరి.. అభివృద్ధికే పట్టం కట్టాలని పిలుపు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఇక అసలు సిసలు పోరు మొదలైంది. నామినేషన్ల పర్వం ముగియటంతో.. పార్టీలు ప్రజాక్షేత్రంలో ప్రచారాలు ముమ్మరం చేశాయి.

గ్రేటర్ ప్రజాక్షేత్రంలో ప్రచారాల హోరు.. అల్లాపూర్‌ చౌరస్తాలో కేటీఆర్ రణభేరి.. అభివృద్ధికే పట్టం కట్టాలని పిలుపు
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 21, 2020 | 7:29 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఇక అసలు సిసలు పోరు మొదలైంది. నామినేషన్ల పర్వం ముగియటంతో.. పార్టీలు ప్రజాక్షేత్రంలో ప్రచారాలు ముమ్మరం చేశాయి. మేయర్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు స్టార్ కాంపెయినర్‌లను రంగంలోకి దించుతున్నాయి. ప్రధాన పార్టీల ప్రచార హోరు ఇప్పటికే జోరందుకుంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీ.రామారావు రణభేరి మోగించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో చేపట్టిన రోడ్‌షోతో మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. బోనాలు, డప్పుల దరువులు, బతుకమ్మలతో మహిళలు పెద్దఏత్తున తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..  గ్రేటర్‌ ప్రజల్లో చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు బీజేపీ యత్నిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా కావాలని సూచించారు. వరద సాయాన్ని బీజేపీ నేతలే అడ్డుకున్నారని ఆరోపించారు.  గ్రేటర్ వాసులను ఓట్లడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించామని, అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థులను ఖరారు చేశామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఆర్ఎప్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లలో హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న గొడవ కూడా జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఇది మనందరి హైదరాబాద్.. ఇది అందరి కోసం పనిచేసే ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పేకాట క్లబ్‌లు లేవు.. గుడుంబా వాసన లేదు. శాంతిభద్రతలు పటిష్ఠంగా అమలవుతున్నాయన్నారు. హైదరాబాద్‌ కోసం చేసిన ఒక్కపనైనా చూపే దమ్ము బీజేపీకి ఉందాని కేటీఆర్ ప్రశ్నించారు.

గత గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో 120 డివిజన్లలో 135 చోట్ల ప్రసంగాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ను 360 డిగ్రీల కోణంలో కేటీఆర్‌ చుటివచ్చి 99 చోట్ల జయకేతనం ఎగురవేసి స్వంతంగా మేయర్‌ స్థానాన్ని దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఈసారి గ్రేటర్‌ పోరులో రోడ్‌ షోలను విస్తృతంగా చేపట్టి వందకు పైగా స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ సమరశంఖం పూరించారు.

కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో

కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వరద సాయాన్ని బీజేపీ అడ్డుకుందన్నారు. ఓట్ల కోసం కొత్త బిచ్చగాళ్లు బయల్దేరారని విమర్శించారు. 10 వేలను అడ్డుకున్న వాళ్లు 25 వేలు ఇస్తామంటే నమ్ముతామా? అని ఆయన ప్రశ్నించారు. కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నార. బీజేపీ డ్రామాలు హైదరాబాద్‌లో సాగవన్నారు. 67 వేల కోట్లతో హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు చేశామని గుర్తుచేశారు. అభివృద్ధి కావాలా?.. అరాచకం కావాలా? అని ప్రశ్నించారు.