Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Vote Majority: ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే.. ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందిన వారు ఉన్నారని మీకు తెలుసా?

ఎన్నికల్లో ఎన్ని ఓట్లు అన్నది కాదు.. గెలిచామా? లేదా? అన్నది ముఖ్యం. ఎందుకంటే ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఒక్కోసారి ఒకే ఓటుతో కూడా నేతల తలరాతలు మారిపోతుంటాయి. ఇండియన్‌ ఎలక్షన్‌ హిస్టరీలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అభ్యర్థులు కూడా చాలా మందే ఉన్నారు.

One Vote Majority: ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే.. ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందిన వారు ఉన్నారని మీకు తెలుసా?
Vote
Follow us
Balaraju Goud

| Edited By: Janardhan Veluru

Updated on: May 13, 2024 | 8:45 AM

ఎన్నికలు అంటేనే ఎన్నో సిత్రాలు. అటు అసెంబ్లీ ఎన్నికలైనా.. ఇటు పార్లమెంట్‌ ఎన్నికలైనా నోటిఫికేషన్‌ మొదలు ఫలితాల విడుదల దాకా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఎన్నికలనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మెజార్టీ. కేవలం ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందిన వారు కూడా ఉన్నారని మీకు తెలుసా? వారెవరో, ఏ ఎన్నికల్లో ఈ ఫీట్‌ సాధించారో తెలుసుకుందాం.

ఎన్నికల్లో ఎన్ని ఓట్లు అన్నది కాదు.. గెలిచామా? లేదా? అన్నది ముఖ్యం. ఎందుకంటే ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఒక్కోసారి ఒకే ఓటుతో కూడా నేతల తలరాతలు మారిపోతుంటాయి. ఇండియన్‌ ఎలక్షన్‌ హిస్టరీలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అభ్యర్థులు కూడా చాలా మందే ఉన్నారు. 2008లో రాజస్థాన్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఓ అభ్యర్థి కేవలం ఒక్కటంటే ఒక్క ఓటుతో ఓడిపోయారు. విచిత్రంగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం.

రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరుఫున సీపీ జోషి పోటీ చేయగా.. ఆయన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి కల్యాణ్‌ సింగ్‌ చౌహాన్‌ నిలబడ్డారు. తీరా, ఓట్లు లెక్కించాక కాంగ్రెస్‌ అభ్యర్థి సీపీ జోషికి 62 వేల 215 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి కల్యాణ్‌ సింగ్‌ చౌహాన్‌కు 62వేల 216 ఓట్లు వచ్చాయి. కేవలం ఒక్క ఓటు తేడాతో కల్యాణ్‌ సింగ్‌ గెలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అయితే కొందరు టెండర్డ్‌ ఓటు వేశారని వాటిని కూడా లెక్కించాలని, కల్యాణ్‌సింగ్‌ చౌహాన్‌ భార్య రెండు చోట్ల ఓటు వేశారని వాటిని రద్దు చేయాలని సీపీ జోషి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడి నుంచి ఈ కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. సుప్రీం ఆదేశంతో ఎన్నికల సంఘం మరోసారి రీకౌంటింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. విచిత్రమేమంటే ఈసారి ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక ఎన్నికల సంఘం డ్రా తీయాల్సి వచ్చింది. అందులోనూ జోషిని దురదృష్టం వెంటాడింది. చివరికి కల్యాణ్‌సింగ్‌ చౌహాన్‌ను విజేతగా ప్రకటించాల్సి వచ్చింది. అయితే, CP జోషి తల్లి, సోదరి, డ్రైవర్ పోలింగ్ రోజున ఆయనకు ఓటు వేయడానికి రాలేకపోవడం విశేషం.

కర్ణాటకలో 2004లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క ఓటు మెజార్టీతో ఓ అభ్యర్థి గెలుపొందారు. రాష్ట్రంలోని సంతేమరహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జెడీఎస్‌ అభ్యర్థి ఏఆర్‌ కృష్ణమూర్తి పోటీ చేయగా.. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆర్‌. ధృవనారాయణ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో జెడీఎస్‌ అభ్యర్థి కృష్ణమూర్తికి 40 వేల 751 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ధృవ్‌నారాయణకు 40వేల 752 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయననే విజేతగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క ఓటుతో నేతల తలరాతలే మారిపోయాయి. యాదృచ్ఛికంగా, కర్ణాటకలో కూడా కృష్ణమూర్తి డ్రైవర్ ఓటు వేయాలనుకున్నాడు, కానీ కృష్ణమూర్తి పోలింగ్ రోజున తన డ్యూటీకి విరామం ఇవ్వకపోవడంతో ఓటు వేయలేకపోయాడు.

2018లో జరిగిన మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు కూడా తాజా ఉదాహరణ. తుయివాల్ (ST) అసెంబ్లీ స్థానంలో, మిజోరాం నేషనల్ ఫ్రంట్ (MNF)కి చెందిన లాల్‌చందమా రాల్టే కేవలం మూడు ఓట్ల తేడాతో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే RL పియాన్మావియాను ఓడించారు. ఈ ఎన్నికల్లో రాల్టేకు 5,207 ఓట్లు రాగా, పియాన్మావియాకు 5,204 ఓట్లు వచ్చాయి. ఫలితంపై అసంతృప్తితో ఉన్న పియాన్మావియా ఓట్లను మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అంగీకరించినప్పటికీ రీకౌంటింగ్ తర్వాత కూడా ఓట్ల తేడాలో మార్పు లేదు.

లోక్‌సభ ఎన్నికలలో కూడా, 1962, 2014 మధ్య కనీసం రెండు సందర్భాల్లో గెలుపు ఓటములను సింగిల్ డిజిట్ ఓట్లతో నిర్ణయించినట్లు భారత ఎన్నికల సంఘం డేటా చూపుతోంది. మొదటిసారి 1989లో కాంగ్రెస్‌కు చెందిన కొణతాల రామకృష్ణ లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి స్థానం నుంచి కేవలం తొమ్మిది అదనపు ఓట్లతో రన్నరప్‌గా గెలిచారు. రెండవ ఉదాహరణ 1998లో బీహార్‌లోని రాజ్‌మహల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోమ్ మరాండీ గెలుపొందారు. కేవలం తొమ్మిది ఓట్ల తేడాతోనే సోమ్ మరాండీ విజయం సాధించారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో, బీజేపీకి చెందిన తుప్‌స్తాన్ ఛెవాంగ్ లడఖ్ నుండి కేవలం 36 సీట్ల తేడాతో విజయం సాధించారు.

మొత్తంగా, 1962 నుండి, ఎనిమిది మంది ఎంపీలు ఇలా అతి తక్కువ మెజార్టీతో లోక్‌సభకు ఎన్నికయ్యారు. వారి గెలుపు మార్జిన్ సింగిల్ లేదా రెండంకెలలో ఉండటం విశేషం.

అందుకే ప్రతి ఒక్క ఓటూ కీలకమే. మనం ఓటు వేయకపోతే ఏం అవుతుందులే అనుకుండా మీరు కూడా వెంటనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…