తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడవాహనసేవే ప్రత్యేకం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది, నయనానందకరమైనది గరుడవాహన సేవ! స్వామివారు ఎక్కడికి వెళినా గరుడ వాహనంపైనే వెళతారు. ఖగరాజు ఆయన ప్రధాన వాహనం.. అందుకే ఆ పక్షీంద్రుడిని పెరియ తిరువాడి అంటారు.. అంటే ప్రధాన భక్తుడన్నమాట.. స్వామివారికి దాసునిగా, మిత్రునిగా, ఆసనంగా, ధ్వజంగా అనేక విధాలుగా సేవించే గరుడుడు..బ్రహ్మోత్సవాల అయిదో రోజున తన ప్రత్యేకతను చాటుకుంటాడు. అయిదో రోజు రాత్రి జరిగే ఈ సేవకు ఓ ప్రత్యేకత వుంది.. ఏడాదిలో అన్ని రోజులూ ధృవబేరానికి […]

తిరుమల బ్రహ్మోత్సవాలలో  గరుడవాహనసేవే ప్రత్యేకం
Follow us

|

Updated on: Sep 23, 2020 | 12:47 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది, నయనానందకరమైనది గరుడవాహన సేవ! స్వామివారు ఎక్కడికి వెళినా గరుడ వాహనంపైనే వెళతారు. ఖగరాజు ఆయన ప్రధాన వాహనం.. అందుకే ఆ పక్షీంద్రుడిని పెరియ తిరువాడి అంటారు.. అంటే ప్రధాన భక్తుడన్నమాట.. స్వామివారికి దాసునిగా, మిత్రునిగా, ఆసనంగా, ధ్వజంగా అనేక విధాలుగా సేవించే గరుడుడు..బ్రహ్మోత్సవాల అయిదో రోజున తన ప్రత్యేకతను చాటుకుంటాడు.

అయిదో రోజు రాత్రి జరిగే ఈ సేవకు ఓ ప్రత్యేకత వుంది.. ఏడాదిలో అన్ని రోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి..లక్ష్మీహారం..సహస్రనామ మాలలను గరుడ వాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపచేస్తారు.. అలాగే ఆ రోజునే..శ్రీవారి ఆలయానికి ఎదురుగా వున్న బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమర్పించే నూతన వస్త్రాలను స్వామి వారు స్వీకరిస్తారు.. గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు వుండరు.. ఆ రోజు ఉదయం హనుమద్వాహనసేవ జరుగుతుంది.. హనుమంతుడు..శ్రీరాముని నమ్మినబంటు.. త్రేతాయుగంలో తనకు అపార సేవలను అందించిన ఆ భక్తుడిని శ్రీవారు మర్చిపోతారా? అందుకే ఆ బంటుకు మళ్లీ తన సేవా భాగ్యాన్ని అందించింది… ఆ దివ్య దృశ్యాన్ని చూడాలే తప్ప వర్ణించడం వీలు కాదు.. అంతే కాదు.. తాను కూడా ఆ మహా విష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియచెప్పే మధురమైన సన్నివేశమది..

గరుడవాహనం తిరుగాడే ఆ మంగళస్వరూపుడిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు.. ఆ జగదేకమోహనుడి దివ్య స్వరూపాన్ని వీక్షించడమే పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు. జగదానందకారకుడైన వేంకటేశుడు గరుడవాహనంలో మరింత నయనానందకరంగా కనిపిస్తాడు. అయితే కరోనా కారణంగా ఈసారి భక్తుల సందడి లేకుండానే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుమల చరిత్రలో తొలిసారి..ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ..శాస్త్రోక్తంగా, తరతరాల సంప్రదాయాలను అనుసరించి కార్యక్రమాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం! ఇందులో భాగంగానే..గరుడ సేవ కోసం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి మాలలు, చిలుకలు తిరుమలకు చేరుకున్నాయి. గరుడ సేవ రోజున శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు, గరుడ సేవనాడు స్వామివారిని అలంకరించేందుకు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకువచ్చింది హిందూ ధర్మార్థ సమితి! తిరుమలకు చేరుకున్న ఛత్రాలకు టీటీడీ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు.