సీఆర్పీఎఫ్‌పై ఉగ్రవాదుల దాడి.. ఐదుగురికి గాయాలు
జమ్మూ కశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హైవేపై గస్తీ కాస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
జమ్మూ కశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హైవేపై గస్తీ కాస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనగర్ జిల్లా శివార్లలోని పాంపూర్ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) కు చెందిన రోడ్ ఓపెనింగ్ పార్టీ (ఆర్‌ఓపి) పై ఉగ్రవాదులు సోమవారం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. జాతీయ రహదారి 44పై టాంగాన్ బైపాస్ సమీపంలో 110 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆర్ఓపి పార్టీ జవాన్లు పహారా కాస్తున్నారు. ఒక్కసారిగా జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్ సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. గాయపడ్డవారిని చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్ ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన వెంటనే దాడి చేసిన వారిని పట్టుకోవటానికి మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు.