Vaccination: కొత్తగా ఆమోదం పొందిన స్పుత్నిక్ వి టీకాను ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న ఐదు కంపెనీలు..పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేది అప్పుడే..
రష్యాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి భారతదేశం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో ఐదు ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి.
Vaccination: రష్యాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి భారతదేశం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో ఐదు ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. అవి ప్రతి సంవత్సరం 850 మిలియన్ డోసులను సిద్ధం చేస్తాయి. అయితే, ఈ ఏప్రిల్ చివరినాటికి మాత్రం కొద్దిమొత్తంలోనే వ్యాక్సిన్ ఈ ఐదు కంపెనీలు అందచేయగలవు. భారత డ్రగ్స్ రెగ్యులేటర్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ) రష్యన్ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారి రెండో వేవ్ సోమవారం విరుచుకుపడటం.. అనేక రాష్ట్రాలు టీకా కొరతపై ఆందోళన వ్యక్తం చేయడంతో స్పుత్నిక్ వి కి అనుమతి మంజూరు చేసింది కేంద్రం. డాక్టర్ రెడ్డీస్ భారతదేశంలో తయారుచేసిన, స్పుత్నిక్ V వ్యాక్సిన్ మోడరనా మరియు ఫైజర్ షాట్ల తరువాత 91.6 శాతం అత్యధిక ప్రభావాన్ని కలిగి ఉందని చెబుతున్నారు. ఈ టీకా ఇప్పటికే భారతదేశంలో 3 వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ఫిబ్రవరిలో టీకాను అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు ఆమోదం లభించడం పట్ల రష్యా ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అక్కడి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఇప్పుడు మన వ్యాక్సిన్ ను ఆమోదించింది అని పేర్కొంది. అంతే కాకుండా స్పుత్నిక్ V ఉపయోగం కోసం ఆమోదించబడిన దేశాల సంఖ్యా 60కి చేరుకుందని ప్రకటించింది. ఈ దేశాల మొత్తం జనాభా 3 బిలియన్ అంటే ప్రపంచ జనాభాలో 40 శాతం అని ఆ సంస్థ చెప్పింది. .
సంవత్సరానికి 850 మిలియన్లకు పైగా మోతాదుల ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని భారతదేశంలోని ఐదు ఔషధ సంస్థలైన గ్లాండ్ ఫార్మా, హెటెరో బయోఫార్మా, పనాసియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్‌తో రష్యా సంస్థ ఆర్డిఐఎఫ్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి సీఈవో కిరిల్ డిమిత్రివ్ మాట్లాడుతూ ” భారతదేశంలో మొదటి మోతాదు ఏప్రిల్ చివరి నాటికి లేదా మే ప్రారంభం నాటికి పంపిణీ చేసే అవకాశాలున్నాయి. అయితే కచ్చితంగా మే నెలలో ఇండియాకు మా వ్యాక్సిన్ అందుతుంది. ఎందుకంటే మాకు అక్కడ ఐదు పెద్ద సంస్థలతో ఉత్పత్తి ఒప్పందాలు ఉన్నాయి. ఈ కంపెనీలు అన్నీ మంచి ఉత్పాదక సామర్ధ్యం ఉన్నవే. కాకపోతే ఉత్పత్తుల సామర్ధ్యం పెంచడానికి కొద్దీ సమయం పడుతుంది. ఏది ఏమైనా జూన్ నాటికి ఇండియాలో మా వ్యాక్సిన్ కూడా మంచి విజయాలు సాధిస్తుంది. ప్రస్తుతం మేము అక్కడ చాలా తక్కువ మార్కెట్ వాటా కలిగి ఉన్నాము కానీ, భవిష్యత్ లో మంచి స్థాయికి చేరతాము” అని ధీమా వ్యక్తం చేశారు.
ఇండియాలో ప్రతి ఏటా 850 మిలియన్ మోతాదుల స్పుత్నిక్ V ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళుతున్నాము. ప్రపంచ వ్యక్తంగా 425 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలనేది మా ఆలోచన. అంటూ డిమిత్రివ్ చెప్పారు. అంతేకాకుండా, ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు రష్యా టీకాను ప్రధానమైన టీకాగా ఒప్పుకున్నారు అని ఆయన చెప్పారు. దీనిని బట్టి స్పుత్నిక్ V మన దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేది సుమారుగా మే మొదటి వారం నుంచే అనే విషయం స్పష్టం అవుతోంది.
Also Read: Pfizer vaccine: పిల్లలకూ కరోనా వ్యాక్సిన్.. దరఖాస్తు చేసుకున్న ఫైజర్.. ఎక్కడంటే..?
Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ఉచితంగా బీర్ .. మందు బాబులకు అదిరిపోయే ఆఫర్