ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించని పోలీసులు, పట్టు వీడని రైతులు, రేపు మరో విడత చర్చలు

ఈ నెల 26 న ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణకు రైతులను ఢిల్లీ పోలీసులు అనుమతించలేదు. దీనికి బదులు కుంద్లి-మానెసార్-పాల్వాల్ లేదా...

  • Umakanth Rao
  • Publish Date - 5:15 pm, Thu, 21 January 21
ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించని పోలీసులు, పట్టు వీడని రైతులు, రేపు మరో విడత చర్చలు

ఈ నెల 26 న ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణకు రైతులను ఢిల్లీ పోలీసులు అనుమతించలేదు. దీనికి బదులు కుంద్లి-మానెసార్-పాల్వాల్ లేదా కుంద్లి-ఘజియాబాద్-పాల్వాల్ మార్గంలో ర్యాలీని నిర్వహించుకోవచ్చునన్నారు. ఔటర్ రింగ్ రోడ్ చాలా సెన్సిటివ్ అన్నారు. కానీ ఈ ప్రతిపాదనను అన్నదాతలు వ్యతిరేకించారు. తాము ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులోనే నిర్వహిస్తామని, ఇందుకు సన్నాహాలు కూడా చేసుకున్నామని వారు చెప్పారు. దీంతో గురువారం వీరిమధ్య సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రేపు మళ్ళీ ఉభయ పక్షాలూ చర్చలు జరపనున్నాయి. రైతుల ట్రాక్టర్ ర్యాలీ పై పోలీసులు, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈ బాధ్యతను వీరికే వదిలివేసింది. దీంతో కేంద్రం ఆదేశాలపై పోలీసులు అన్నదాతలతో చర్చలకు ఉపక్రమించారు.

ఇప్పటికే పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ నుంచే గాక రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి కూడా రైతులు ఢిల్లీ లోని సింఘు బోర్డర్ కు చేరుకున్నారు. ఈ నెల 26 న సుమారు 20 వేల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలన్నది వీరి యోచనగా ఉంది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు కూడా పాల్గొంటున్నారు. తాముశాంతియుతంగా దీన్ని నిర్వహిస్తామని, గణ తంత్ర దినోత్సవ పరేడ్ కార్యక్రమాలకు అంతరాయం కల్గించబోమని రైతు సంఘాలు ఇదివరకే స్పష్టం చేశాయి. కానీ పోలీసులు దీన్ని పూర్తిగా విశ్వసించలేకపోతున్నారు. అన్ని వేల ట్రాక్టర్లతో ర్యాలీ అంటే మాటలు కాదని, పరేడ్ కార్యక్రమాలకు భంగం వాటిల్లవచ్ఛునని వారు ఆందోళన చెందుతున్నారు.

Read Also:కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వీడాలంటూ లక్ష్మీ పూజ నిర్వహించనున్న ముఖ్యమంత్రి.
Read Also:ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ, దాన్ని తెలుగులోకి మేము తీసుకురావడం గర్వంగా ఉంది : అల్లు అర్జున్.