AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Freebies: మారుతున్న ఎన్నికల ప్రహసనం.. ఉచితాలపై ఇక పార్టీల ఆధారం.. ఆర్థిక పరిస్థితులిక గాలికే..!

Election Freebies: ఏడు దశాబ్ధాలుగా దేశంలో కొనసాగుతున్న ఎన్నికల తంతులో ప్రతీ ఏడాది కొత్త మార్పులు వస్తూనే వున్నాయి. గతంలో ఎన్నికల హామీలు అభివృద్ధి ఆధారంగా వుండేవి. 80వ దశకం నుంచి ఎన్నికల హామీల్లో అభివృద్ధి అంశాలు తగ్గుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా..

Election Freebies: మారుతున్న ఎన్నికల ప్రహసనం.. ఉచితాలపై ఇక పార్టీల ఆధారం.. ఆర్థిక పరిస్థితులిక గాలికే..!
Politics
Rajesh Sharma
|

Updated on: Jun 20, 2023 | 8:32 PM

Share

Election Freebies: ఏడు దశాబ్ధాలుగా దేశంలో కొనసాగుతున్న ఎన్నికల తంతులో ప్రతీ ఏడాది కొత్త మార్పులు వస్తూనే వున్నాయి. గతంలో ఎన్నికల హామీలు అభివృద్ధి ఆధారంగా వుండేవి. 80వ దశకం నుంచి ఎన్నికల హామీల్లో అభివృద్ధి అంశాలు తగ్గుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ దిగ్గజం ఎన్టీఆర్.. రెండురూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రకటించి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కిలో బియ్యం ధర ఒక రూపాయకి తగ్గిపోయినా ఎన్టీఆర్ ప్రకటించిన రెండ్రూపాయలకు కిలో బియ్యం అనే పదబంధాన్ని కొట్టలేకపోయింది. ఆ క్రెడిట్ కచ్చితంగా స్వర్గీయ ఎన్టీఆర్‌దేనని చెప్పాలి. ఆ తర్వాత మధ్య నిషేధం వంటి హామీలతో ఆయనే మరోసారి చరిత్ర సృష్టించారు. అయితే, ఈ హామీలు ఆ తర్వాత కాలంలో కొత్త పుంతలు తొక్కడం మొదలైంది. 2004 ఎన్నికలకు ముందు ఆనాటి విపక్ష నాయకుడు డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ హామీతో జనం మనసులను చురగొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీ ఆనాడు పెద్ద సంచలనం. ఈ హామీ వైఎస్ఆర్‌ను రైతు బాంధవుడిగా మార్చిందనే చెప్పాలి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉచిత హామీలను చూస్తూనే వున్నా.. గత అయిదారేళ్ళుగా ఉచితాల ప్రభావం ఎన్నికల్లో విపరీతంగా పెరిగిపోయింది. డైరెక్ట్ నగదు పంపిణీ పథకాలు మొదలయ్యాయి. నిజానికి సంక్షేమ పథకాలంటేనే ఖజానాలకు భారం. కానీ ఆ భారాన్ని ప్రజల సెంటిమెంట్లతో ముడిపెట్టిన రాజకీయ పార్టీలు ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి మరీ ఉచిత హామీలను గుప్పించడం షురూ చేశాయి.

నగదు బదిలీతో షురూ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (నేడు భారత రాష్ట్ర సమితి) రైతు బంధు పేరిట రాష్ట్రంలో వ్యవసాయ భూములున్న వారికి వ్యవసాయ పెట్టుబడి కింద నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించింది. దీన్నే పోలిన పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నా ఈ తరహా పథకానికి ఆద్యునిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు క్రెడిట్ కొట్టేశారు. తాజాగా ఈ రైతు బంధు పథకం కింద ఎకరాకు ఇస్తున్న నగదు మొత్తాన్ని పెంచే యోచనలో కేసీఆర్ వున్నట్లు సమాచారం. ఉచిత హామీలతో ప్రజాభిమానాన్ని చూరగొనొచ్చు గాక.. ఆర్థిక పరిస్థితిని మాత్రం చక్కదిద్దలేరన్నది నిష్టుర సత్యం. అయితే, ఇపుడు రాజకీయ పార్టీలన్నీ కాస్త అటు ఇటుగా ఉచిత హామీలనే ప్రధాన అస్త్రాలుగా ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. మొన్నటికి మొన్న జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంలో ఉచిత హామీలే కీలక పాత్ర వహించాయి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆడవారికి, వృద్ధులకు, నిరుద్యోగులకు ఏదో ఒక పేరిట నగదు బదిలీ వంటి పథకాలను కర్నాటకలో కాంగ్రెస్ విచ్చలవిడిగా ప్రకటించింది. దాంతో కన్నడిగులు ఆ పార్టీకి అనూహ్య విజయం కట్టబెట్టారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ నాయకులిపుడు ఉచిత హామీలను ఎలా అమలు చేయాలా? అసలే అంతంత మాత్రంగా వున్న ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినకుండా ఎలా జాగ్రత్త పడాలా అని తలలు పట్టుకుంటున్నారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నష్టాల పాలు చేసే ప్రమాదం వుండడంతో 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారే లక్ష్యంగా యూనిట్ ధరను అమాంతం పెంచేసింది సిద్దరామయ్య ప్రభుత్వం.

ఉచితాలే దిక్కని చాటిన కర్నాటక ఫలితాలు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్ని రాజకీయ పక్షాలు ఉచిత హామీలే ఇక తమకు ఎన్నికల్లో విజయతీరాలకు చేరుస్తాయన్న నమ్మకాన్ని వచ్చేశారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలలోని రాజకీయ పార్టీల్లో ఈ ధోరణి అమాంతం పెరిగిపోయింది. కర్నాటక ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే రాజమండ్రి వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో 6 ఎన్నికల హామీలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే ప్రజల ముందు కీలక తాయిలాలను వుంచారు. దాంతో ఏపీలో హామీల పర్వం ముందే వచ్చేసినట్లయ్యింది. ఎన్నికలకు ఇంకా పది నెలల గడువుండగానే ప్రధాన పార్టీలు ప్రజల్ని మచ్చిక చేసుకునేందుకు యత్నాలు మొదలుపెట్టాయి. ఈ విషయంలో విపక్ష టీడీపీ కాస్త దూకుడును ప్రదర్శిస్తుందనే చెప్పాలి. మే నెలాఖరులో జరిగిన మహానాడులోనే ఏపీ వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోతున్న హామీలను దాదాపు వెల్లడించేసింది. తాజాగా పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అంటే వచ్చే దసరా నాడే విడుదల చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది.  ఇంకోవైపు వారాహి విజయ యాత్ర ప్రారంభించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. సైతం హామీల పర్వాన్ని ప్రారంభించారు. ఇక మరో ప్రతిపక్షం బీజేపీ మాత్రం కేంద్ర ప్రభుత్వం ద్వారా పని చక్క బెట్టుకొస్తోంది. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను క్రమంగా విడుదల చేయడం మొదలైంది. ఇక అధికార వైసీపీ గత ఎన్నికల హామీలను పూర్తి చేస్తున్నామంటూ ప్రచారం ప్రారంభించింది.

హామీల పర్వం ప్రారంభం

ఎన్నిక‌ల‌కు ఇంకా ప‌దినెల‌లే సమయం. సరిగ్గా చెప్పాలంటే.. ప్రిపరేషన్‌కు ఆర్నెళ్లకు మించి గడువు లేదు. దీంతో అన్ని పార్టీలు తమ గేమ్‌ ప్లాన్‌ను మొదలు పెట్టేశాయి. ఇప్పటికే మహానాడు వేదికగా మేనిఫెస్టోలో సగం హామీలను బయటపెట్టిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు.. ఇంకొన్ని పథకాలకు సంబంధించిన ప్రకటనలను త్వరలోనే చేయబోతున్నారు. అధికారమే లక్ష్యంగా ఈ హామీల వర్షం ఉండబోతోందనేది సుస్పష్టంగా కనిపిస్తోంది.  ఓవైపు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్రతో ప్రజ‌ల్లో ఉండ‌గానే… మరోవైపు చంద్రబాబు జిల్లాల ప‌ర్యట‌న‌ల్లో ప్రజ‌ల మ‌ధ్య ఉంటున్నారు. అయితే టీడీపీ ఇప్పటికే తమ మేనిఫెస్టోలో కొంత భాగాన్ని రివీల్‌ చేసింది. రాజమండ్రి మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించినవి ఆరు హామీలు. కానీ, ఆ 6 హామీలు పొలిటికల్‌గా బాగానే పేలాయి. మహిళలు, రైతులు, యువత… ఈ మూడు వర్గాలే టార్గెట్‌గా అట్రాక్టివ్‌ స్కీమ్స్‌ను ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తోందో క్లియర్‌ కట్‌గా చెప్పారు. గందరగోళం లేకుండా ఆకట్టుకునే పథకాలతో నాడు మినీ మేనిఫెస్టో అనౌన్స్‌ చేశారు. ఇప్పుడు రెండో మేనిఫెస్టో వచ్చే దసరా రోజు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు.  మొదటి మేనిఫెస్టోపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది టీడీపీ. అందుకోసం 125 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయబోతోంది. బస్సు యాత్ర తర్వాత రెండో మేనిఫెస్టోను ప్రకటించనున్నారు చంద్రబాబు.

6 హామీలతో టీడీపీ

తెలుగు దేశం పార్టీ తొలి విడత హామీల్లో భాగంగా భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో 6 హామీలు ఇచ్చింది. అందులో.. హామీ నెంబర్‌-1 మహాశక్తి … మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం నిర్వహించడంతో పాటు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు మహిళల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుందని.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని తెలిపారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా 15 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది కర్నాటక కాంగ్రెస్ హామీకి కాపీగానే భావించాలి. వీటితో పాటుగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. మే నెల్లో ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోపై అప్పుడే సెటైర్లేశారు సీఎం జగన్‌. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రెండో మేనిఫెస్టో ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంటే, ఎలాంటి స్కీమ్స్‌ ఉంటాయో ముందే చెప్పేశారు సీఎం జగన్‌.

కసరత్తు ప్రారంభించిన వైసీపీ

ఒక్కోవర్గంతో సమావేశమవుతూ మెల్లగా వారి మనసు దోచుకునే పనిలో పడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి యాత్రతో జనం ముందు వచ్చేశారు. రిజర్వేషన్లు, ప్రత్యేక కార్పొరేషన్, హాస్టళ్లు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, హెల్త్ కార్డులు.. ఇలా వరాల జల్లు కురిపిస్తూ పోయారు. ఆ తర్వాత పింఛన్ విషయం వచ్చింది. సామాజిక పింఛన్ 5వేలకు పెంచాలని వికలాంగులు కోరగా.. జనసేన అధికారంలోకి వస్తే 10వేలకు పైగా పింఛన్ ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇలా హామీల విషయంలో పవన్ కల్యాణ్ ఏ వర్గాన్నీ వదిలిపెట్టడం లేదు. మరోవైపు రాజమండ్రిలో ప్రకటించింది కేవలం టీజర్‌ మాత్రమే అంటోంది టీడీపీ.  చంద్రబాబు ప్రకటించబోయే రెండో మేనిఫెస్టోలో ఎలాంటి హామీ ఉండబోతున్నాయి?. మొదటి మేనిఫెస్టోలో మ‌హిళ‌లు, రైతులు, బీసీలు, నిరుద్యోగులపై వరాల వర్షం కురిపించిన చంద్రబాబు… ఈసారి ఏఏ వర్గాలు టార్గెట్‌గా హామీలు ఇవ్వబోతున్నారు? ఇదిపుడు హాట్ టాపిక్‌గా మారింది.  ఇక ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ నేతలు విపక్షాల హామీలపై తమ స్పందనలు తెలియజేస్తూనే వచ్చే ఎన్నికల్లో ఇవ్వదగిన హామీలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విపక్షాల హామీలను తలదన్నే స్థాయిలో.. ప్రజలకు విపరీతంగా ఆకర్షించే స్థాయిలో హామీలను ప్రకటించేందుకు సీఎం జగన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ పూర్తి చేశామని చాటేలా సీఎం జగన్ కార్యాచరణ అమలు చేస్తున్నారు. వారంలో రెండు, మూడు కార్యక్రమాలలో పాల్గొంటూ గత నాలుగేళ్ళ ప్రొగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుంచుతున్నారు. అదేసమయంలో తమ కోర్ కమిటీ సారథ్యంలో వచ్చే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు కూడా జగన్ ప్రారంభించినట్లు వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తానికి ఏపీలో వచ్చే ఎన్నికలు పూర్తిగా ఉచిత హామీల ఆధారంగానే జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో