బాలాకోట్‌లో నిజంగా దాడులు జరిగాయా?

బాలాకోట్‌లో నిజంగా దాడులు జరిగాయా?

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన మెరుపుదాడులపై కాంగ్రెస్ ప్రవాస భారతీయ విభాగం చైర్మన్, రాహుల్‌గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బాలాకోట్ దాడులు జరిగాయా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కొందరు ఉగ్రవాదులు జరిపిన పుల్వామా ఉగ్రదాడికి యావత్ పాకిస్థాన్‌ను నిందించడం సరికాదన్నారు. బాలాకోట్ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులను చంపామని వారు (కేంద్రం) చెబుతున్నారని, ఇందుకు సాక్ష్యాలున్నాయా? అని ప్రశ్నించారు. శుక్రవారం పిట్రోడా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 5:14 PM

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన మెరుపుదాడులపై కాంగ్రెస్ ప్రవాస భారతీయ విభాగం చైర్మన్, రాహుల్‌గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బాలాకోట్ దాడులు జరిగాయా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కొందరు ఉగ్రవాదులు జరిపిన పుల్వామా ఉగ్రదాడికి యావత్ పాకిస్థాన్‌ను నిందించడం సరికాదన్నారు. బాలాకోట్ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులను చంపామని వారు (కేంద్రం) చెబుతున్నారని, ఇందుకు సాక్ష్యాలున్నాయా? అని ప్రశ్నించారు. శుక్రవారం పిట్రోడా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. వాళ్లు (కేంద్రం) 300 మంది ని చంపామంటున్నారు. అయితే ఇందులో నిజాలేమిటో దీన్ని నిరూపించే సాక్ష్యాలేమిటో చూపించగలరా? అని ప్రశ్నించారు. పాక్‌లోని జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద క్యాంపులపై భారత వాయుసేన చేసిన దాడులపై ప్రశ్నించగా పిట్రోడాపై వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ముంబై దాడులపై కూడా శామ్ పిట్రోడో స్పందించారు. ఆ సమయంలో ఎనిమిది మంది వచ్చి భారత్‌పై దాడులు చేశారు. అయితే ఇందుకు ఆ దేశం (పాక్) మొత్తాన్ని తప్పుపట్టకూడదు అని అన్నారు. పుల్వామా దాడుల అనంతరం కేంద్రం వ్యవహరించిన తీరు సరిగాలేదని పిట్రోడా పేర్కొన్నారు.

శామ్ పిట్రోడో చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలందరు ఫైర్ అయ్యారు. దాడుల వాస్తవికతను ప్రశ్నించిన శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మోదీ మండిపడ్డారు. భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం కాంగ్రెస్‌కు అలావాటేనని, కానీ ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెప్పగలమని, ప్రజలు అభిప్రాయాన్ని అవగాహన చేసుకోగలమని దుయ్యబట్టారు. ‘ఉగ్రదాడికి దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని యావత్ దేశానికి ఎప్పుడో తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కాంగ్రెస్‌ రాజ వంశానికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కూడా ఒప్పుకున్నారు. కానీ ఇది నవ భారతం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులకు వారి భాషలోనే మేం సమాధానం చెప్పాం. ఉగ్రవాదుల పక్షాన మాట్లాడటం, మన సాయుధ బలగాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల సహజ నైజం. కశ్మీర్‌ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను ప్రతిపక్ష నేతలు కించపరుస్తున్నారు. మన భద్రతా బలగాలను ప్రతిపక్షం మళ్లీ అవమానిస్తోంది. ఈ దేశ ప్రజలను నేను కోరుకునేది ఒక్కటే.. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలను ప్రశ్నించండి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను ఎప్పటికీ క్షమించబోమని వారికి అర్థమయ్యేలా చెప్పండి. జవాన్లకు ఈ దేశం ఎప్పటికీ అండగా నిలుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మరోవైపు బాలాకోట్ ఘటనపై చేసిన ఈ వ్యాఖ్యలు నా వ్యక్తిగతమని సమర్ధించుకున్నారు పిట్రోడా. సొంత అభిప్రాయాలతో, వ్యక్తిగతంగానే ఈ వ్యాఖ్యలు చేశానని, వీటితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని పిట్రోడా చెప్పారు. ఒక శాస్త్రవేత్తగా తాను సహేతుకతనే విశ్వసిస్తానని తెలిపారు. వాస్తవాలను నమ్ముతాను కానీ, భావోద్వేగాలను కాదని పేర్కొన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu