Snake: పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా..
పాము పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అది ఎంతటి బలవంతుడైనా పాము కాటుకు బలికావాల్సిందే. అయితే మీకో సందేహం ఎప్పుడైనా వచ్చిందా? ఒక విషపూరిత పామును మరొకటి కరిస్తే ఏమవుతుంది..? తన సొంత విషంతో తానే చనిపోతుందా..? లేక ఆ విషాన్ని తట్టుకునే విరుగుడు దాని దగ్గరే ఉంటుందా? అనేది తెలుసుకుందాం..

సాధారణంగా పాము అనగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. అది విషపూరితమైనదైతే ప్రాణభయం వెంటాడుతుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక విషపూరిత పామును మరొకటి కరిస్తే ఏమవుతుంది..? రెండు పాములు పోరాడుకుంటే అవి ఒకదాని విషానికి ఒకటి చనిపోతాయా? చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. చాలా విషపూరిత పాములు తమ సొంత జాతికి చెందిన విషాన్ని కొంతవరకు తట్టుకోగలవు. ఇది పరిణామ క్రమంలో వాటికి వచ్చిన సహజ సిద్ధమైన శక్తి. ఉదాహరణకు.. ఒక నాగుపాము మరొక నాగుపాముని కరిస్తే, దాని శరీరంలో ఉండే ప్రత్యేక ప్రోటీన్లు ఆ విషాన్ని తటస్థీకరిస్తాయి. కాటు వేసిన చోట కొద్దిగా వాపు వచ్చినా ఆ పాము చనిపోదు. ఒకే జాతి పాములు ఒకదాని విషానికి ఒకటి చనిపోతే ఆ జాతి ఎప్పుడో అంతరించిపోయేదని నిపుణులు వివరిస్తున్నారు.
జాతి మారితే ప్రమాదం పెరుగుతుంది
కానీ ఒక రకమైన పాము మరో రకమైన పామును కరిచినప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక పాము శరీరం వేరొక జాతి పాము విషానికి తట్టుకునేలా సిద్ధంగా ఉండదు. అందుకే ఆ విషం తీవ్ర ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారవచ్చు. అయితే ఈ విషయంలో కింగ్ స్నేక్ ఒక అద్భుతం. వీటికి ఇతర విషపూరిత పాముల విషంతో పోరాడే శక్తి చాలా ఎక్కువ. అందుకే ఇవి అత్యంత విషపూరితమైన పాములను కూడా సునాయాసంగా వేటాడి తినేయగలవు.
విషం కంటే గాయాలే ఎక్కువ ప్రమాదం
పాముల పోరాటంలో ఏదైనా పాము చనిపోతే అది కేవలం విషం వల్ల మాత్రమే కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పోరాటంలో దంతాలు లోతుగా దిగడం వల్ల కలిగే తీవ్రమైన గాయాలు, ఇన్ఫెక్షన్లు లేదా విపరీతమైన ఒత్తిడి వల్ల అవి ప్రాణాలు కోల్పోతుంటాయి. పాములు ప్రతీకారం కోసం ఎప్పుడూ విషాన్ని ఉపయోగించవు. ప్రకృతి వాటికి ఇచ్చిన ఈ ఆయుధాన్ని కేవలం ఆత్మరక్షణ కోసం లేదా ఆహారం కోసం మాత్రమే ఉపయోగిస్తాయి.
