దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే..
పెళ్లీడుకొచ్చిన బిడ్డ చనిపోయిందని ఆ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమెకు చివరి వీడ్కోలు చెప్పడానికి అశ్రునయనాల మధ్య స్మశాన వాటికకు తీసుకెళ్తున్నారు.
పెళ్లీడుకొచ్చిన బిడ్డ చనిపోయిందని ఆ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమెకు చివరి వీడ్కోలు చెప్పడానికి అశ్రునయనాల మధ్య స్మశాన వాటికకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో వారి సంప్రదాయం ప్రకారం యువతిని శవపేటికలో పెట్టి తీసుకెళ్తుండగా మధ్యలో ఆమె మూలిగిన శబ్దం రావడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లిలో బుధవారం జరిగింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..కుదురుపల్లికి చెందిన మెండ లక్ష్మి-లక్ష్మయ్య దంపతుల కుమార్తె గీతాంజలి(20) మహదేవపూర్‌లోని గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. 20 రోజులుగా ఆమెకు జ్వరం వస్తూ, పోతూ ఉంది. ఈ క్రమంలో కుటుంబీకులు నిర్లక్ష్యంతో ఊర్లోనే ఆర్‌ఎంపీతో చికిత్స చేయించారు. జ్వరంతోనే యువతి కూలి పనులకు కూడా వెళ్లింది. దీంతో ఆమెకు జ్వరం తీవ్రం అయి బుధవారం రాత్రి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అసలు చలనం లేకుండా ఉండిపోవడంతో కుటుంబసభ్యులు ఆమె చనిపోయిందనుకున్నారు. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తుండగా మార్గమధ్యలో దింపుడుకల్లం వద్ద శవపేటికను దించి పిలవగా యువతి నుంచి మూలిగిన శబ్దం వినిపించింది. దీంతో షాకైన గ్రామస్తులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారమందించి మహదేవపూర్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే యువతి చనిపోయిందని డాక్టర్ నిర్ధారించడంతో తిరిగి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.