ఆ కుటుంబానికి మెట్రో ఫిల్లరే దిక్కైంది..!
కరోనా అంటుకుందన్న అనుమానంతో ఇంటి ఓనర్ ఇంట్లోకి రావొద్దన్నాడు. దీంతో రోడ్డునపడ్డ ఆ కుటుంబానికి మెట్రో ఫిల్లరే దిక్కైంది.

కరోనా సోకిన ఒకరు గాంధీ అస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. తమకు అంటుకుందన్న అనుమానంతో కుటుంబసభ్యలు ఆస్పత్రికి వెళ్తే లేదు పోమ్మన్నారు. విషయం తెలిసిన ఇంటి ఓనర్ ఇంట్లోకి రావొద్దన్నాడు. దీంతో రోడ్డునపడ్డ ఆ కుటుంబానికి మెట్రో ఫిల్లరే దిక్కైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన తల్లి, ఆమె ముగ్గురు కుమారులు మూసాపేటలో అద్దెకు ఉంటున్నారు. అంతా కాయకష్టం చేసేవారే. అన్నదమ్ముల్లో చివరి వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగతా ముగ్గురూ ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లారు. అయితే, పడకలు ఖాళీగా లేవు.. గురువారం రండంటూ చెప్పి పంపించారు. అయితే, విషయ్యాన్ని ఇంటి యజమానికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఇంటికి మాత్రం రావద్దని మిగతా కుటుంబాలకు అంటుకుంటుదని యజమాని తేల్చి చెప్పాడు. దీంతో పాలుపోని కుటుంబం రోడ్డు పైనా ఉండిపోయింది. బుధవారం సాయంత్రం జోరువాన కురుస్తుండగా తడిసిన హృదయంతో తల్లడిల్లిపోయారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 వరకు ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలోని మెట్రో పిల్లరును ఆసరాగా చేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. దూరపు బంధువు ఒకరు చేరదీసి ఇంట్లో తలదాచుకోవడానికి అవకాశం ఇవ్వడంతో వారికి కాస్త ఊరట దక్కింది. ఇలా హైదరాబాద్ మహానగరంలో అద్దె ఇంట్లో ఉంటున్నవారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. వైరస్ లేకున్నా లక్షణాలు కనిపిస్తే చాలు ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు.




