అమరావతిలో స్తబ్దత.. రాజధానిపై చంద్రబాబు కీలక ట్వీట్

అమరావతిలో నెలకొన్ని ప్రస్తుత పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. రాజధాని ఏరియాలో ప్రస్తుతం స్తబ్దత నెలకొనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పరిరక్షణ ప్రతీ ఒక్క ఆంధ్రుడి బాధ్యత అని ఆయనంటున్నారు.

అమరావతిలో స్తబ్దత.. రాజధానిపై చంద్రబాబు కీలక ట్వీట్
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 22, 2020 | 4:18 PM

Chandrababu tweet on Capital city:  అయిదేళ్ళ క్రితం పురుడు పోసుకున్న అమరావతి రాజధానిని ఏడాదిన్నర క్రితం కొత్త పాలకులు చిదిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మూడున్నరేళ్ళ పాటు పదివేల కోట్ల రూపాయల వ్యయంతో కొనసాగిన రాజధాని నిర్మాణాన్ని ఏడాదిన్నరగా నిలిపేసి అమరావతిలో స్తబ్దత తెచ్చారని ఆయన పేర్కొన్నారు. అయిదేళ్ళ క్రితం జరిగిన భూమిపూజ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన గురువారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు.

‘‘ విభజన నష్టాన్ని అధిగమించే సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా మన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 5ఏళ్లు.. మూడున్నరేళ్లుగా నిరాఘాటంగా సాగిన నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేసి అభివృద్దిని ఆపేశారు.. వేలాది కూలీలు, భారీ మెషీనరీతో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది… ’’ ఆయన ట్వీట్ చేశారు.

పోటీ పడి మరీ అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రస్తుత పాలకులు నీరుగార్చారని చంద్రబాబు ఆరోపించారు. శంకుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం, ఆ వేడుకకు హాజరైన దేశ, విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని కాలరాశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవాస్తవ ఆరోపణలతో, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేశారన్నారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో రాజధాని నిర్మాణ బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం కరెక్టు కాదని చంద్రబాబు అంటున్నారు. అమరావతి రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క ఆంధ్రునిపై వుందని ఆయన పిలుపునిచ్చారు.

Also read: అరెస్టును అడ్డుకుని హంగామా చేసిన మహిళలు

Also read: పొద్దుటూరులో భారీ గోల్డ్ గోల్‌మాల్

Also read: “నాగ్” మిసైల్ ప్రయోగం సక్సెస్

Also read: వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు హతం