Case On TikTok: టిక్‌టాక్ పై కేసు వేసిన 12 ఏళ్ల చిన్నారి.. వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తుందంటూ..
Case File On TikTok App: చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించిన విషయం తెలిసిందే...
Case File On TikTok App: చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించిన విషయం తెలిసిందే. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను, వారి కీలక సమాచారాన్ని బైట్ డ్యాన్స్ దుర్వినియోగం చేస్తుందంటూ భారత ప్రభుత్వం ఈ యాప్‌ను బ్యాన్ చేసింది. కోట్ల సంఖ్యలో డౌన్‌లోడ్స్‌తో దూసుకెళుతోన్న టిక్‌టాక్‌కు ఈ నిర్ణయంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికీ ఈ యాప్ భారత్‌లో సేవలను తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ యాప్‌పై బ్రిటన్‌లో ఓ కేసు నమోదైంది. బ్రిటన్‌కు చెందిన ఓ 12 ఏళ్ల బాలిక టిక్‌టాక్‌పై కేసు నమోదు చేసింది. యూజర్ల వ్యక్తిగత గోప్యత విషయంలో బైట్‌డ్యాన్స్ ఐరోపా సమాఖ్య నిబంధలను ఉల్లంఘించిందని ఆ బాలిక ఆరోపణ. ఈ చిన్నారి చేసిన ఫిర్యాదుకు ఇంగ్లండ్ పిల్లల కమిషనర్ అన్నే లాంగ్ఫీల్డ్ మద్ధతు పలకడం విశేషం. ఈ క్రమంలో బ్రిటన్‌లో టిక్‌టాక్ యాప్‌ను ఉపయోగిస్తున్న 16 ఏళ్లలోపు చిన్నారులకు ఈ కేసు వల్ల మరింత రక్షణ కలుగుతుందని అన్నే అభిప్రాయపడ్డారు. డేటా ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని, సమాచారం బహిర్గతం అవుతుందని ఆ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉంటే గతంలో కూడా అమెరికాలో టిక్‌టాక్ ఇలాంటి ఓ ఆరోపణ ఎదుర్కొంది. దీంతో 2019లో యూఎస్ ఫెడరల్ కమిషన్ టిక్‌టాక్ 5.7 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.