Maruti CNG Car: సీఎన్జీ వెర్షన్లో మారుతీ బ్రెజ్జా.. బుకింగ్స్ ప్రారంభం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
సీఎన్జీ వాహనాలు తన ముద్ర వేస్తున్నాయి. ఈ క్రమంలో మారుతీ సుజుకీ బ్రెజ్జాని సీఎన్జీ వెర్షన్ లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనిని ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శించింది. ఇప్పుడు బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

ప్రస్తుతం అంతా పర్యావరణ హిత వాహనాల గురించే చర్చ. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు.. నానాటికీ అధికమవుతున్న వాతావరణ కాలుష్యాలను అరికట్టేందుకు అన్ని ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈనేపథ్యంలో పర్యావరణ హిత వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. మరోవైపు సీఎన్జీ వాహనాలు కూడా తన ముద్ర వేస్తున్నాయి. ఈ క్రమంలో మారుతీ సుజుకీ బ్రెజ్జా ఎస్యూవీని సీఎన్జీ వెర్షన్ లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనిని నోయిడాలో నిర్వహించిన ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శించింది. ఇప్పుడు ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరిస్తోంది. కాగా డెలివరీలు ప్రారంభం కావడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..
ఆటోమేటిక్ గేర్ బాక్స్..
మొదటి సారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ సిఎన్‌జి వెర్షన్ మొత్తం నాలుగు ట్రిమ్‌లలో విడుదల కానుంది అవి LXI, VXI, ZXI, ZXI+. ఇతర మారుతి సీఎన్‌జీ కార్ల మాదిరిగా కాకుండా.. ICE బేస్డ్ వెర్షన్ మాదిరిగా అన్ని ట్రిమ్‌లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. కాగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదలయ్యే మొదటి సీఎన్‌జీ బ్రెజ్జా కావడం విశేషం.
ఎస్ సీఎన్జీ బ్యాడ్జ్..
మారుతి బ్రెజ్జా సీఎన్‌జీ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది సీఎన్‌జీ అని గుర్తించడానికి ఇందులో S-CNG బ్యాడ్జ్ చూడవచ్చు. బూట్‌లో సీఎన్‌జీ ట్యాంక్ అమర్చబడి ఉండటం వల్ల స్పేస్ తక్కువగా ఉంటుంది. ఇందులో స్మార్ట్‌ప్లే ప్రో+తో కూడిన 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వాయిస్ అసిస్టెంట్, ఓటీఏ అప్‌డేట్‌లతో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టార్ట్/స్టాప్ బటన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి.
కంపెనీ బ్రెజ్జా సీఎన్‌జీ గురించి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు, కానీ ఇది ఇప్పటికే విక్రయించబడుతున్న ఎర్టిగా, ఎక్స్ఎల్6 మాదిరిగా 1.5 లీటర్ కే15సీ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 100 హెచ్‌పీ పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‌జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంది.
ధర ఎంతంటే..
మారుతి సుజుకి కొత్త బ్రెజ్జా సిఎన్‌జి ధరలను అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇది దాని పెట్రోల్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. కావున దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..