గుడ్లగూబల్నీ వదలని కన్నింగ్, ఒక్కోటీ పదివేల నుంచి లక్ష రూపాయల ధర, పక్షుల ప్రాణాలతోనూ చెలగాటం
గుడ్లగూబ...పక్షి మాత్రమే కాదు. ఇప్పుడిది ఓ క్రేజీ బిజినెస్ ప్రొడక్ట్ అయింది. మార్కెట్లో దీనికి యమా డిమాండ్ ఉంది. ఒక్కో గుడ్లగూబ..
గుడ్లగూబ…పక్షి మాత్రమే కాదు. ఇప్పుడిది ఓ క్రేజీ బిజినెస్ ప్రొడక్ట్ అయింది. మార్కెట్లో దీనికి యమా డిమాండ్ ఉంది. ఒక్కో గుడ్లగూబ పదివేల నుంచి లక్ష రూపాయల ధర పలుకుతోంది. ఇదే వేటగాళ్లకు వరంగా మారింది. గుడ్లగూబలు శుభసూచకమా..? ఇవి సర్వరోగ నివారిణా..? ఇవి దగ్గర ఉంటే ఆరోగ్య వంతంగా ఉంటారా..? ఉదయం లేచి ఈ పక్షిని చూస్తే శుభాలు కలుగుతాయా..? ఇలాంటి వాటినే క్యాష్ చేసుకున్నాడు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇమ్రాన్. అమాయకులను నమ్మించి….వివిధ రకాల గుడ్లగూబలను పట్టుకుని వచ్చి లక్షల రూపాయలకు అమ్మేశాడు. కొందరైతే ఏకంగా గల్ఫ్ దేశాలకు కూడా వీటిని కొని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పాతబస్తీ ఫలక్‌నుమా గుడికా దవాఖాన వద్ద ఉంటే ఇమ్రాన్ ఐదేళ్లుగా ఇదే బిజినెస్ చేస్తున్నాడు. ఒంటరిగా శ్రీశైలం అడవులకు వెళ్లి…బర్న్ గుడ్లగూబలను వేటాడి పాతబస్తీకి తీసుకొచ్చేవాడు. పలువురి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని..వారికి మంచి జరుగుతుందని నమ్మించేవాడు. పాతబస్తీలో కొందరు వ్యక్తులు ఈ భ్రమలో పడి పక్షులను కొనేశారు. ఈ విషయం తెలిసిన టాస్క్‌ఫోర్స్ అడిషినల్ డీసీపీ చక్రవర్తి ఆదేశాలతో..పారెస్టు అధికారులు మూకుమ్మడిగా ఇమ్రాన్ ఇంటిపై దాడి చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న 15 గుడ్లగూబ పక్షులను స్వాధీనం చేసుకున్నారు.
ఇలాఉంటే, గుడ్లగూబ శుభసూచకమని కొందరంటే, మరో వెర్షన్ కూడా ఉంది. పెద్ద పెద్ద కళ్లు, వంకర ముక్కుతో భయంకరంగా ఉండే గుడ్లగూబ…దాని ఆకారం చూస్తే చాలా మంది భయపడతారు. అంతేకాదు అది ఇంట్లోకి వచ్చినా, ఇంటిపై వాలినా, ఎదురు వచ్చినా, పరిసరాలలో తిరిగినా అశుభ సూచకమని చాలా మంది నమ్ముతారు. అందుకే అది వాలిన ఇంటి నుండి కాపురం చేయకుండా మరో ఇంటికి వెళ్లిపోతారు. ఇది కనిపించిన చోట పరిసరాలలో చావు కబురు వినవస్తుందనే అపోహ కూడా ప్రచారంలో ఉంది. మొత్తానికి వేటగాళ్లు చెప్పే కట్టుకథలు నమ్మి జనం మోసపోవద్దని టాస్క్‌ఫోర్స్ పోలీసులు సూచించారు. అమాయకులను బురిడీకొట్టించి డబ్బు కాజేసిన ఇమ్రాన్‌ఖాన్‌ని రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడిప్పుడే బాధితులు కూడా పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. తమను ఇమ్రాన్ మోసం చేశాడని చెప్పుకొస్తున్నారు.