కరోనా కట్టడికి నాజల్ డ్రాప్స్.. వ్యాక్సిన్ రూపకల్పనలో భారత్ బయోటెక్
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందువరుసలో ఉన్న స్వదేశీ సంస్థ భారత్ బయోటెక్ మరోసారి గుడ్ న్యూస్ తీసుకువచ్చింది.
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందువరుసలో ఉన్న స్వదేశీ సంస్థ భారత్ బయోటెక్ మరోసారి గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు నాజల్ డ్రాప్స్ (ముక్కులో వేసుకునే చుక్కల మందు)పైన భారత్ బయోటెక్ ప్రయోగాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్కన్ డైలాగ్ వర్చువల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం తాము కొవాగ్జిన్‌పై మూడో విడుత క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇది డబుల్ డోస్ ఇంజెక్టబుల్ టీకా అని పేర్కొన్నారు. దీన్ని దేశంలో అందరికీ అందించాలంటే 260 కోట్ల సిరంజీలు, సూదులు అవసరమవుతాయని ఆయన వివరించారు. ఇది చాలా కష్టంతో కూడుకున్నదని ఆయన వెల్లడించారు. అందుకే తాము దీనికి ప్రత్యామ్నాయంగా నాజల్ డ్రాప్స్ అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు.
ప్రపంచంలో బీఎస్‌ఎల్-3 ఉత్పత్తి కేంద్రం ఉన్న ఏకైక సంస్థ తమదేనన్న కృష్ణా ఎల్లా.. కరోనా మహమ్మారి ప్రమాద తీవ్రత ముందే ఊహించామన్నారు. తాజాగా చైనా 250 మిలియన్ డాలర్లతో ఈ సెంటర్ ను ఏర్పాటు చేస్తోందని, అమెరికా, ఐరోపాలోనూ ఈ బీఎస్‌ఎల్-3 ఉత్పత్తి కేంద్రం లేదని ఆయన వెల్లడించారు. కొవాగ్జిన్ టీకా కోసం ఐసీఎంఆర్‌తో తాము భాగస్వామ్యమయ్యామని తెలిపారు. ప్రస్తుతం దీనిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, తాను దీనిపై సంతోషంగా లేనన్నారు. అందుకే నాజల్ డ్రాప్ తయారీపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఇది ముక్కులో ఒక్కసారి వేస్తే సరిపోయే చుక్కల మందు అని వివరించారు.
@ISBedu‘s Deccan Dialogue @DeccanDialogue begins virtually. Secy ER Rahul Chhabra, India’s envoy to Bangladesh @ihcdhaka @VDoraiswami present. pic.twitter.com/nkWB0Lf3Mi
— Sidhant Sibal (@sidhant) November 16, 2020
గతంలో రోటా వైరస్, పోలియో కోసం చుక్కల మందులు తయారుచేసిన అనుభవం తమకుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో ఇది అందుబాటులోకి రానున్నట్లు కృష్ణా ఎల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.