భారత్ బంద్‌కు మద్దతుగా దేశంలో పలు చోట్ల రైల్ రోకో.. పట్టాలపై కూర్చొని ఆందోళన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో ఆందోళన కొనసాగుతోంది. కొన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశంలోని పలుచోట్ల రైల్ రోకో చేపట్టారు.
రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు దేశమంతటా మద్దతు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో ఆందోళన కొనసాగుతోంది. కొన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశంలోని పలుచోట్ల రైల్ రోకో చేపట్టారు. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. స్వాభిమాని శేత్కారీ సంఘటన సభ్యులు మల్కాపూర్ స్టేషన్‌లో చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు. పట్టాలపై కూర్చొని నిరసన చేపట్టారు. ఆందోళన తీవ్ర స్థాయికి చేరడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపు చేయడానికి ప్రయత్నించారు. అటు ఒడిశా రాష్ట్రంలోనూ కొన్ని చోట్ల రైళ్లను అడ్డుకున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో వామపక్షాలు, రైతు సంఘాల నేతలు రైళ్ల రాకపోకలను అడ్డగించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేతలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో వామపక్షాల నేతలు పలు రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై బైఠాయించారు. రైల్వే సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక గుజరాత్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. యూపీలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.