జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడ‌రేష‌న్ అధ్యక్షుడిగా తెలంగాణ‌బిడ్డ

జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడ‌రేష‌న్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు చెందిన అరిశెన‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్‌రావు ఘన విజయం సాధించారు.

జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడ‌రేష‌న్ అధ్యక్షుడిగా తెలంగాణ‌బిడ్డ
Follow us

|

Updated on: Nov 02, 2020 | 5:34 PM

జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడ‌రేష‌న్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు చెందిన అరిశెన‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్‌రావు ఘన విజయం సాధించారు. ఈనెల 18న‌ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభమ‌వ‌గా అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌గ‌న్ ఒక్క‌రే నామినేష‌న్ వేయ‌డంతో ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. జాతీయ హ్యాండ్ బాల్ ఫెడ‌రేష‌న్ జాతీయ అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ మోహ‌న్ రావు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ స్థాయిలో క్రీడా సంఘానికి అధ్య‌క్షుడిగా తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక వ్య‌క్తిగా జ‌గ‌న్ మోహన్ రావు నిలిచారు. హ్యాండ్‌బాల్ జాతీయ అధ్య‌క్షుడిగా త‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న 29 రాష్ట్ర సంఘాల‌కు జ‌గ‌న్ మోహ‌న్ రావు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. త‌న మీద‌ న‌మ్మ‌కం ఉంచి ఇంత‌టి గురుత‌ర బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించినందుకు శ‌క్తి వంచ‌న లేకుండా హ్యాండ్‌బాల్ అభివృద్ధికి కృషి చేస్తాన‌న్నారు. నిష్ణాతులైన కోచ్‌ల ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా టాలెంట్ హంట్ నిర్వ‌హించి మెరిక‌లాంటి క్రీడాకారుల‌ను జ‌ల్లెడ‌ప‌ట్టి సాన‌పెడ‌తాన‌ని జ‌గ‌న్ తెలిపారు. టోక్యో త‌దుప‌రి జ‌రిగే ఒలింపిక్స్ లో మెడ‌ల్ టార్గెట్‌గా భార‌త క్రీడాకారుల‌ను త‌యారు చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు.

జాతీయ స్థాయిలో హ్యాండ్ బాల్ ఫెడ‌రేష‌న్ తెలంగాణ నుంచి ఎన్నికైన తొలి అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ మోహ‌న్ రావు చ‌రిత్ర సృష్టించారు. భార‌త ఒలింపిక్ సంఘం కోశాధికారి, హ్యాండ్‌బాల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనందీశ్వ‌ర్ పాండే స‌హ‌కారంతో అసోసియేష‌న్ పై ప‌ట్టు సంపాదించిన జ‌గ‌న్ స్వ‌ల్ప కాలంలోనే అధ్య‌క్ష స్థాయికి ఎదిగారు. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల వ్యూహాల‌‌న్నింటిని స‌మ‌ర్థంగా తిప్పికొట్టి జ‌గ‌న్ రెండేళ్ల‌లోనే ఫెడ‌రేష‌న్‌లో అధ్యక్ష స్థానానికి చేరుకున్నారు.

అరిశెన‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్ రావు స్వ‌స్థ‌లం రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలోని దండుమైలారం. స్వ‌త‌హాగా పారిశ్రామిక వేత్త అయిన జ‌గ‌న్ క్రీడ‌ల‌పై ఆస‌క్తితో వాటి అభివృద్ధికి న‌డుం బిగించారు. 47 ఏళ్ల జ‌గ‌న్ 2018లో జ‌రిగిన తెలంగాణ టీ20 లీగ్ నిర్వ‌హ‌ణ‌లో కీల‌క‌పాత్ర పోషించ‌డంతో పాటు మెద‌క్ మేవ‌రిక్స్ జ‌ట్టుకి యాజ‌మానిగా ఉన్నారు. ఆ టోర్నీలో మేవ‌రిక్స్ జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.