AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Delta Plus: తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్‌‌ తొలి కేసు.. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్.. స్థానికుల నమూనాలు సేకరిస్తున్న అధికారులు!

ఆంధ్రప్రదేశ్ లో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. గత ఏప్రిల్ నెలలో ఓ వ్యక్తికి కరోనా సోకగా. అతని నుంచి సేకరించిన నమూనాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు సీసీఎంబీ గుర్తించింది

Corona Delta Plus: తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్‌‌ తొలి కేసు.. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్.. స్థానికుల నమూనాలు సేకరిస్తున్న అధికారులు!
Delta variant
Balaraju Goud
|

Updated on: Jun 26, 2021 | 12:12 PM

Share

AP First Delta Plus Variant Case: ఆంధ్రప్రదేశ్ లో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. గత ఏప్రిల్ నెలలో ఓ వ్యక్తికి కరోనా సోకగా. అతని నుంచి సేకరించిన నమూనాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు సీసీఎంబీ గుర్తించింది. తిరుపతిలో డెల్టా ప్లస్ కేసును గుర్తించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. డెల్టా ప్లస్ స్ట్రెయిన్ సోకిన వ్యక్తికి చికిత్స అందించామని.. అతడి నుంచి ఈ వేరియంట్ ఇతరులెవరికీ వ్యాప్తి చెందలేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

తిరుపతిలో నమోదైన తొలి డెల్టా ప్లస్ కేసుతో చిత్తూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.. తిరుపతిలోని తిరుమలరెడ్డి నగర్‌లో నివాసముండే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కు సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏప్రిల్ 3న కోవిడ్ లక్షణాలు కనిపించడంతో అదే నెల 5న కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో అతనికి పాజిటివ్‌గా తేలడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అతనితో పాటు కుటుంబసభ్యుల శాంపిల్స్ పరీక్షించిన వైద్యులు.. అతని భార్య, కొడుకుకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారించారు. స్విమ్స్ లో చికిత్స తరువాత కరోనా నుంచి కోలుకున్న బాధితుడు ఇంటికి చేరుకున్నాడు.

అయితే, వేరియంట్ మార్పును గుర్తించేందుకు వైద్యులు అతనికి సంబంధించి శాంపిల్స్‌ను పుణెలోని సీసీఎంబీకి పంపించారు స్విమ్స్ ఆసుపత్రి వర్గాలు. దీంతో అతనికి సోకిన వైరస్ కొత్త వేరియంట్ డెల్టా ఫ్లస్ అని నిర్ధారించారు. ఇక, దీంతో వైరస్ వేరియంట్ ను గుర్తించేందుకు రాష్ట్రంలోని ప్రతి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుంచే 15 రోజులకు ఒక్కసారి 15 శాంపుల్స్ ను సీసీఎంబీ కి పంపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ గుర్తించినట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. డెల్టా ప్లస్ తో సంక్రమణ వేగం అధికమని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు, తిరుమల రెడ్డి నగర్ లోని స్థానికుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు వైద్య సిబ్బంది. వీటిని సీసీఎంబీకి పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్.. రూపాంతరం చెంది డెల్టా ప్లస్ వేరియంట్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసులను ఇప్పటి వరకూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గుర్తించారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం ఏడుగురికి ఈ స్ట్రెయిన్ సోకగా.. ఇద్దరు మరణించారు. మిగతా ఐదుగురు కోలుకోగా వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. కోలుకున్న ఐదుగురిలో ముగ్గురే టీకాలు వేయించుకున్నారు.

మహారాష్ట్రలో ఏడు జిల్లాల్లో 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ఇటీవల ప్రకటించారు. రత్నగిరి జిల్లాలో 9 కేసులు గుర్తించగా.. జలగావ్‌లో ఏడు, ముంబైలో రెండు కేసులు గుర్తించారు. పాల్ఘార్, థానే, సింధు దుర్గ్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు. మహారాష్ట్రలో డెల్లా ఒకరు మృతి చెందారు. తమిళనాడులో గత మే నెలలో 32 ఏళ్ల మహిళకు కరోనా సోకగా.. ఆమెకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు.

మన దేశంలో మొత్తం 48కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోయ్యాయి. ఈ వేరియంట్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించింది. ఈ వేరియంట్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుందని.. కాక్‌టెయిల్ ఇంజెక్షన్‌కు సైతం లొంగడం లేదని చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మన దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయగా.. డెల్టా ప్లస్ వేరియంట్‌పై అవి ఎలా పని చేస్తాయనేది కచ్చితంగా తెలియదని వైద్య నిపుణఉలు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Read Also…  Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం వివాదంలో మరో ట్విస్ట్.. అందరిది ఒకే అభిప్రాయమన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.. అవాస్తమన్న మహాలక్ష్మమ్మ