కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ సర్కార్ సర్వం సిద్దం.. రాష్ట్ర వ్యాప్తంగా 1,677 కోల్డ్ చైన్ పాయింట్ల ఏర్పాటు
కోవిడ్ వ్యాక్సిన్ డోసులను వేయడానికి కావాల్సిన మౌలిక వసతులను ఏపీ సర్కార్ సిద్ధం చేస్తోంది.
కరోనా మహమ్మారి నుండి విముక్తి కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర అనుమతి ఇవ్వడంతో టీకా పంపిణీ కోసం కావలసిన ఏర్పాట్లను కేంద్రం ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ కు రెడీ అవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను నెల రోజుల్లోనే పూర్తయ్యేలా చూడాలని చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కోవిడ్ వ్యాక్సిన్ డోసులను వేయడానికి కావాల్సిన మౌలిక వసతులను ఏపీ సర్కార్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే 13 జిల్లాల కలెక్టర్లతో చర్చలు జరిపి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే ఆరోగ్య కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బందికి, అంగన్వాడీ వర్కర్లకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.
కేంద్రం నుంచి అందే వ్యాక్సిన్లను రాష్ట్ర వ్యాప్తంగా 1,677 కోల్డ్ చైన్ పాయింట్లను ఏపీ సర్కార్ సిద్ధం చేసింది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టార్‌ను గన్నవరంలో ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే ప్రాంతీయ స్థాయిలో కర్నూల్, కడప, గుంటూరు, విశాఖపట్నంలో వ్యాక్సిన్ స్టోర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. ఇక, వ్యాక్సిన్లను భద్రపరిచేందుకు 7 భారీ ఫ్రీజర్లు, 11 భారీ కూలర్లు, 1,865 డీప్ ఫ్రీజర్లు, 2,182 ఐస్ లైన్డ్ ఫ్రిజర్లు సిద్దం చేశామని అధికారులు వివరించారు. అటు కేంద్రం నుండి అదనంగా ఫ్రీజర్లు, కూలర్లు, వ్యాక్సిన్ కారియర్ లతో పాటు కోల్డ్ బాక్సులు రానున్నాయని అధికారులు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసే కోవిడ్ వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో వివిధ ప్రాంతాలకు తరలించేందుకు 19 వాహనాలు సిద్దం చేసినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు 17,032 మంది ఏఎన్ఎంలను సిద్దం చేసింది సర్కార్.
మరోవైపు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నుండి ఎనిమిది వారాల తరువాత యాంటీబాడీస్ అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అంత వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో 30 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.