AP Temples as Covid Care Centres: ఏపీ ఆలయాల్లో కరోనా సేవలు.. అందుబాటులో వేయి పడకల కోవిడ్ కేర్ సెంటర్లు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వికృతరూపం ప్రదర్శిస్తోంది. నిత్యం దాదాపు 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగుల కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Temples as Covid Care Centres: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వికృతరూపం ప్రదర్శిస్తోంది. నిత్యం దాదాపు 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగుల కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దేవాలయాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో మొత్తం వేయి పడకలను సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఉన్న కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్టు ప్రకటించారు. ఆ ఇవాళ ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. అదే విధంగా కోవిడ్ విపత్తు వేళ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 పెద్ద ఆలయాల ఆధ్వర్యంలో వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్టు దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకటి రెండు చోట్ల చిన్న కోవిడ్ కేర్ సెంటర్లలో 25 వరకు బెడ్‌లను, చాలాచోట్ల వంద వరకు బెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కోవిడ్ కేర్ సెంటర్‌లో మూడు, నాలుగు ఆక్సిజన్ పడకలను సిద్ధంగా ఉంచారు.
కోవిడ్ కేర్ సెంటర్లలో వైద్యుల పర్యవేక్షణలో రోగులకు ప్రాథమిక చికిత్స అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లలో ఇప్పటికే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి.
వీటితోపాటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయం, విశాఖ జిల్లా సింహాచలం, గుంటూరు జిల్లా పెదకాకాని, ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం, నెల్లూరు జిల్లా జొన్నవాడ ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం, మహానంది, ఉరుకొంద ఆలయాలు, వైఎస్సార్ జిల్లా గండి, అనంతపురం జిల్లా కసాపురం, చిత్తూరు జిల్లా కాణిపాకం, శ్రీకాళహస్తి, చౌడేపల్లి మండలం దిగువపల్లి ఆలయాల ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు దాదాపు పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, కరోనా నియంత్రణకు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే.. వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ సూచించారు.
Read Also… అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వీరే..!