అధికారుల నిర్లక్ష్యం..ముగ్గురు చిన్నారులు దుర్మరణం
అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల మరణాలకు కారణమైంది. రైల్వే అండర్‌పాస్‌లో నిలిచిన నీటిని తరలించేందుకు అధికారులు తవ్వించిన కాలువలోకి దిగిన చిన్నారులు పైకి రాలేక ప్రాణాలు విడిచారు.

అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల మరణాలకు కారణమైంది. రైల్వే అండర్‌పాస్‌లో నిలిచిన నీటిని తరలించేందుకు అధికారులు తవ్వించిన కాలువలోకి దిగిన చిన్నారులు పైకి రాలేక ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని బంగారుపేటలో శనివారం చోటు చేసుకుంది. మృతులను సయ్యద్ అమీర్ కుమారుడు సాధిక్ (12), సలీం కుమార్తె మెహిక్ (8), నవీద్ కుమారుడు ఫయాజ్(7)గా గుర్తించారు. శుక్రవారం బంగారుపేట పట్టణంలో జడివాన కురిసింది. దీంతో పట్టణంలో అశాస్త్రీయంగా నిర్మించిన రైల్వే అండర్ పాస్ పొంగి పొర్లింది. వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో రైల్వే అధికారులు జేసీబీ సహాయంతో సమాంతరంగా కాలువ తవ్వించి నీటిని మళ్లించారు. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )
శనివారం మధ్యాహ్నం అటుగా వచ్చిన ముగ్గురు పిల్లలు సరదాగా కాలువలోకి దిగారు. గోతులు లోతుగా ఉండడంటంతో పైకి వచ్చేందుకు విఫలయత్నం చేసినప్పటికీ జారి మళ్లీ నీటిలోకి పడిపోయి చనిపోయారు. పట్టణ పోలీసులు వచ్చి డెడ్‌బాడీలను వెలికి తీశారు. ఘటనా స్థలానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రుల వేదన చూపరులను కన్నీళ్లు పెట్టించింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా అశాస్త్రీయంగా నిర్మించిన అండర్‌పాస్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
