ఆ ముగ్గురితో జగన్‌కు నెత్తి నొప్పి..ఏం చేయబోతున్నారంటే?

అధికార పగ్గాలు చేపట్టినప్పట్నించి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందరి కాళ్ళకు ముగ్గురు బ్రేకేస్తున్నారన్న చర్చ వైసీపీలో జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలోను, అంతకు ముందు పాదయాత్రలోను తానిచ్చిన హామీలను ఒక్కటొక్కటే అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అమలు చేస్తున్న ప్రతీ పథకంలోను తనదైన ముద్ర ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రికి ముగ్గురు నేతలు తలనొప్పులు తెస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీకి సేవలందించిన సీనియర్లకు, జూనియర్లకు […]

  • Rajesh Sharma
  • Publish Date - 3:13 pm, Sat, 28 December 19
ఆ ముగ్గురితో జగన్‌కు నెత్తి నొప్పి..ఏం చేయబోతున్నారంటే?

అధికార పగ్గాలు చేపట్టినప్పట్నించి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందరి కాళ్ళకు ముగ్గురు బ్రేకేస్తున్నారన్న చర్చ వైసీపీలో జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలోను, అంతకు ముందు పాదయాత్రలోను తానిచ్చిన హామీలను ఒక్కటొక్కటే అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అమలు చేస్తున్న ప్రతీ పథకంలోను తనదైన ముద్ర ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రికి ముగ్గురు నేతలు తలనొప్పులు తెస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

పార్టీకి సేవలందించిన సీనియర్లకు, జూనియర్లకు సమప్రాధాన్యమిస్తూ జగన్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యువ మంత్రులంతా జగన్ డైరెక్షన్‌కు కాస్తైనా అటు ఇటు జరక్కుండా పనిచేసుకుపోతుంటే ఇద్దరు సీనియర్ మంత్రులు మాత్రం తమదైన నోటివాటంతో ముఖ్యమంత్రికి తలనొప్పులు తెస్తున్నారని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ ఇద్దరి మంత్రులకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా తోడై తన ప్రకటనలతో ముఖ్యమంత్రిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని అనుకుంటున్నారు.

రాజధాని రగడను ఈ స్థాయికి తెచ్చిన మొట్టమొదటి ఘనత మంత్రి బొత్స సత్యనారాయణకే దక్కుతుంది. ముఖ్యమంత్రి మదిలో ఏముందో ఊహించారో లేక ముఖ్యమంత్రే స్వయంగా బొత్సతో షేర్ చేసుకున్నారో గానీ.. అమరావతి నుంచి రాజధాని తరలే సంకేతాలను మొదటిసారి ఇచ్చింది బొత్సనే. బొత్స వ్యాఖ్యలు ఎంత ఇబ్బందికి గురి చేసినా ఎక్కడా ఆయన్ను మందలించినట్లుగాని, వద్దని వారించినట్లుగాని కనిపించకుండా మెచ్యురిటీతో వ్యవహరించారు జగన్. అదే సమయంలో రాజధాని విషయంలో జగన్ అడుగు ముందుకే సాగింది.

ఆ తర్వాత మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి శాసనసభలో హింట్ ఇచ్చిన తర్వాత మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘‘మూడు రాజధానులైనా పెట్టుకుంటాం.. ముప్పై రాజధానులైనా కట్టుకుంటాం‘‘ అంటూ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. మంత్రి అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారంటూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎదురు దాడి మొదలుపెట్టాయి.

ఇక మూడు రాజధానులపై జగన్ సభలో ప్రకటన చేయకముందు స్పీకర్ తమ్మినేని ప్రతిపక్ష నేత చంద్రబాబుతో దాదాపు తగవు పడ్డంత పనిచేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో మహిళలు రవికలు కూడా వేసుకోవాలన్న విషయం తెలియనంతగా వెనుకబడిపోయారంటూ కామెంట్ చేసి, సభలో వున్న మహిళా ఎమ్మెల్యేలకు ఎంబర్రాసింగ్ క్రియేట్ చేశారు.

అప్పటికప్పుడు పెద్దగా పట్టించుకోకపోయినా ఈ ముగ్గురి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అసహనంగా వున్నారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వాటిని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి.