AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work-Life Balance: ఆఫీసు టెన్షన్లు బెడ్‌రూమ్ దాకా వస్తున్నాయా? వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం 5 సూత్రాలు!

జీవితం అంటే కేవలం సంపాదన మాత్రమే అనుకుంటే సరిపోదు. మనల్ని ప్రేమించే వారితో గడిపే మధుర క్షణాల సమాహారం కూడా. ఆఫీసు ఫైళ్లను ఆఫీసులోనే వదిలేసి, ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వును మాత్రమే వెంట తీసుకెళ్లండి. అప్పుడే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది సాధ్యమవుతుంది.

Work-Life Balance: ఆఫీసు టెన్షన్లు బెడ్‌రూమ్ దాకా వస్తున్నాయా? వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం 5 సూత్రాలు!
Work Life Balance
Nikhil
|

Updated on: Feb 09, 2026 | 6:41 PM

Share

ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి పనులు గుర్తుకు రావడం.. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫైళ్లు కళ్లముందు కదలడం.. ఇదీ ఈ తరం ఉద్యోగి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. చాలామందికి ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ అనేది కేవలం పుస్తకాల్లో కనిపించే పదంలా లేదా కార్పొరేట్ కంపెనీలు గోడల మీద తగిలించే పోస్టర్‌లా మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ బ్యాలెన్స్ సాధ్యమేనా? లేక అదో అందని ద్రాక్షా? చాలామంది ‘బ్యాలెన్స్’ అంటే 24 గంటలను సమానంగా ఆఫీసుకి, ఇంటికి పంచడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే సమయాన్ని పంచడం కాదు.. ‘ప్రెజెన్స్’ (ఉనికిని) పంచడం. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు 100 శాతం అక్కడే ఉండటం, ఇంటికి వచ్చాక ఆఫీసు ఆలోచనల నుంచి 100 శాతం బయటపడటం. అది లేనప్పుడే అసలైన ఒత్తిడి మొదలవుతుంది.

ఒక సాఫ్ట్‌వేర్ మేనేజర్ రోజూ 12 గంటలు కష్టపడుతుంటారు. తన భార్యాపిల్లల కోసమే ఇంత కష్టపడుతున్నాను అని ఆయన అనుకుంటారు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన చేతిలో ఫోన్, మెదడులో ప్రాజెక్ట్ డెడ్ లైన్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా అడిగితే చిరాకు పడుతుంటారు. ఫలితంగా, ఆయన భౌతికంగా ఇంట్లోనే ఉన్నా, మానసిక స్థితి మాత్రం ఎప్పుడో ఆఫీసుకి వెళ్లిపోతుంది. ఇక్కడ సమస్య ‘సమయం’ కాదు.. ‘మెంటల్ స్విచ్ ఆఫ్’ చేయలేకపోవడం. వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ నోటిఫికేషన్లు ఆఫీసుని మన బెడ్‌రూమ్ దాకా తీసుకొచ్చాయి. నేను ఆన్ లైన్ లో లేకపోతే పని ఆగిపోతుందేమో లేదా బాస్ ఏమనుకుంటారో అన్న అపరాధ భావం మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.

సమతుల్యత మార్గాలు..

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ పాటించడం ఎంతో అవసరం. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిని ఒక వంతెనలా వాడుకోవాలి. ఆ ప్రయాణంలో సంగీతం వినడమో లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి ఆలోచనలను అక్కడే ముగించడమో చేయాలి. ఇంటి తలుపు తీసే ముందే ఆఫీసు టెన్షన్లను బయటే వదిలేయాలి. రాత్రి భోజనం చేసేటప్పుడు లేదా పిల్లలతో ఆడుకునేటప్పుడు ఫోన్ ని పక్క గదిలో ఉంచాలి. నోటిఫికేషన్ల శబ్దం మీ ప్రశాంతతను దోచుకోకుండా చూసుకోవాలి. మీరు కుటుంబంతో ఎన్ని గంటలు ఉన్నారన్నది కాదు.. ఉన్న ఆ కాసేపు ఎంత నాణ్యమైన సమయం గడిపారన్నదే ముఖ్యం.

హద్దులు ముఖ్యం..

పని వేళలు ముగిశాక, అత్యవసరమైతే తప్ప కాల్స్ లేదా మెయిల్స్ కు స్పందించకూడదనే నియమాన్ని తోటి ఉద్యోగులకు సున్నితంగా చెప్పాలి. మీ వ్యక్తిగత సమయాన్ని మీరు గౌరవిస్తేనే, ఇతరులు గౌరవిస్తారు. అలాగే ఖాళీ గ్లాసుతో ఇతరుల దాహం తీర్చలేం అన్న విషయాన్ని గుర్తించాలి. మీకు ఇష్టమైన అలవాట్లను పాటించడం లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు మీరు ఆఫీసులోనూ, ఇంట్లోనూ ఉత్సాహంగా ఉండగలరు. మన శక్తికి మించిన బాధ్యతలను మొహమాటానికి ఒప్పుకోకుండా ‘నో’ చెప్పడం కూడా నేర్చుకోవాలి.

గత వారం రోజుల్లో, మీరు ఏకాగ్రతతో మీ కుటుంబ సభ్యుల కళ్లలోకి చూస్తూ కనీసం పది నిమిషాలు మాట్లాడారా? లేకపోతే, మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని అర్థం. పని అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, పనే జీవితం కాకూడదు. వృత్తి పరమైన బాధ్యతలను నెరవేరుస్తూనే, వ్యక్తిగత సంతోషాలకు చోటు కల్పించినప్పుడే పరిపూర్ణమైన జీవనం సాధ్యమవుతుంది. చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడి లేని అందమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.