మీ బాడీలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే మందు మానేయండి.. లేకపోతే మీ పని అయిపోయినట్లే..
మనం తాగే ప్రతి మద్యం చుక్కా లివర్‌పై గాయంలా మారుతుందని మీకు తెలుసా..? రాత్రి తాగిన మద్యం ప్రభావం ఉదయం పూట మీ శరీరంలో కొన్ని ప్రత్యేక లక్షణాల రూపంలో కనిపిస్తుంది. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే, అది కాలేయ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంది. మీ లివర్ మిమ్మల్ని హెచ్చరిస్తున్న ఆ 3 ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మద్యం సేవించడం అనేది ఈ రోజుల్లో ఒక సరదాగా మారిపోయింది. కానీ అది కాలేయంపై చూపే ప్రభావం మాత్రం అత్యంత భయంకరమైనది. అధికంగా మద్యం తాగడం వల్ల కాలేయంపై మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఒకరకమైన గాయాల వంటివి, వీటినే వైద్య పరిభాషలో లివర్ సిర్రోసిస్ అంటారు. మీరు తక్కువ మొత్తంలో తాగినా, అప్పుడప్పుడు తాగినా అది కాలేయానికి హానికరమే. ముఖ్యంగా శరీరంలో ఈ మూడు మార్పులు కనిపిస్తే.. మీ కాలేయం ప్రమాదంలో ఉందని అర్థం.
నిద్ర లేవగానే తల బరువుగా, నీరసంగా ఉండటం
రాత్రి కొంచెం మద్యం తాగినప్పటికీ, ఉదయం నిద్రలేవగానే తల విపరీతమైన బరువుగా అనిపించడం, ఒంట్లో అస్సలు శక్తి లేకపోవడం వంటివి జరిగితే అది హెచ్చరికగా భావించాలి. ఏ పని చేయాలని అనిపించకపోవడం, నిరంతరం శరీర నొప్పులు, వికారం లేదా వాంతులు వచ్చే సూచనలు కనిపిస్తాయి. ఇవి ప్రారంభ కాలేయ వైఫల్యం సంకేతాలు. మీ కాలేయం విషతుల్యమైన ఆల్కహాల్‌ను క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతోందని దీని అర్థం.
నిరంతరం వేధించే కడుపు సమస్యలు
మద్యం మీ జీర్ణవ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆహారం సరిగ్గా అరగకపోవడం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతుంటే జాగ్రత్త పడాలి. కడుపు నొప్పి, కడుపులో గ్యాస్ పట్టేసినట్లు భారంగా అనిపించడం, తరచుగా త్రేన్పులు రావడం వంటి లక్షణాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వల్ల కాలేయం తన పనితీరును నెమ్మదిస్తుంది. ఈ దశలోనూ మద్యం మానకపోతే పరిస్థితి విషమించవచ్చు.
నిద్రలేమి.. మద్యం లేనిదే నిద్ర పట్టకపోవడం
మద్యం సేవించడం వల్ల గాఢ నిద్ర పడుతుందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ వాస్తవానికి అది నిద్రను నాశనం చేస్తుంది. రాత్రిపూట తరచుగా నిద్ర భంగం కలగడం, గాఢ నిద్ర లేకపోవడం వల్ల ఉదయం నీరసంగా అనిపించడం. ఒకవేళ మీకు మద్యం తాగకుండా నిద్ర పట్టడం లేదంటే, మీరు ఆల్కహాల్‌కు బానిసయ్యారని అర్థం. ఇది కాలేయంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
జాగ్రత్త పడదాం ఇలా..
- చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఉదయం నీరసాన్ని వదిలించుకోవచ్చ. కానీ అది తాత్కాలికమే.
- ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.
కాలేయం తనను తాను రిపేర్ చేసుకునే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. మీరు ప్రారంభ దశలోనే మద్యం మానేస్తే, లివర్ మళ్ళీ ఆరోగ్యంగా మారే అవకాశం ఉంది.
