అబ్బాయి మెడలో.. అమ్మాయి తాళి కడితే తప్పేంటి..?

పెళ్లంటే ... పేదంటి తండ్రికి మోయలేనంత భారం... డబ్బుకు కొదువ లేని శ్రీమంతులకు చెప్పలేనంత ఆడంబరం... పెళ్లికి ముందు చేసుకునే సంబరాలకే ఈ దేశంలో వేల కోట్ల ఖర్చు పెట్టే శ్రీమంతులున్నారన్న విషయం.. నిన్న గాక మొన్నే అంబానీలింట వేడుకలతో యావత్ ప్రపంచానికి అర్థమయ్యింది. అయితే అందుకు పూర్తిగా విరుద్ధమైన సంఘటనలకు ఈ దేశంలో ఏ మాత్రం కొదువలేదన్నది కూడా జగమెరిగిన సత్యం.

అబ్బాయి మెడలో.. అమ్మాయి తాళి కడితే తప్పేంటి..?
అమ్మాయిలు కూడా అబ్బాయిలకు తాళి కట్టే పెళ్లిImage Credit source: TV9 Network
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Jun 19, 2024 | 12:13 PM

పెళ్లి… భారమా.. బరువా..మీలో తాపీ ధర్మారావు రాసిన పెళ్లి.. దాని పుట్టు పూర్వోత్తరాలు ఎంత మంది చదివారు..? చదివి అర్థం చేసుకునే వారి దృష్టిలో పెళ్లి అంటే… ఒక అర్థం… అదే ఇటీవల కాలంలో యూట్యూబులో వస్తున్న ప్రవచనాల సారాంశాన్ని మెదడులోకి పూర్తిగా ఎక్కించుకొని అప్పుడప్పుడు ఆ విజ్ఞాన ప్రదర్శనను చేసే వ్యక్తుల దృష్టిలో మరో అర్థం.

పెళ్లంటే … పేదంటి తండ్రికి మోయలేనంత భారం…డబ్బుకు కొదువ లేని శ్రీమంతులకు చెప్పలేనంత ఆడంబరం… పెళ్లికి ముందు చేసుకునే సంబరాలకే ఈ దేశంలో వేల కోట్ల ఖర్చు పెట్టే శ్రీమంతులున్నారన్న విషయం.. నిన్న గాక మొన్నే అంబానీలింట వేడుకలతో యావత్ ప్రపంచానికి అర్థమయ్యింది. అయితే అందుకు పూర్తిగా విరుద్ధమైన సంఘటనలకు ఈ దేశంలో ఏ మాత్రం కొదువలేదన్నది కూడా జగమెరిగిన సత్యం. పెళ్లంటే.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. ఇవి మాత్రమే ఉంటే ఈ కాలం దాన్ని పెళ్లి అనుకోదు.. అందుకే రాజప్రసాదాల్లా కల్యాణ మంటపాలు సిద్ధమైపోయాయి.  వేల కోట్లు కాకపోయినా… తాహతు అనే ఒక అర్థం తెలియని అబద్ధాన్ని నిజమని భ్రమపడిపోయి… ఉన్నదంతా ఖర్చు పెట్టే తల్లిదండ్రులకు.. ఇప్పుడు ఏ మాత్రం లోటు లేనే లేదు.

అయితే ఇన్ని వింతలు జరుగుతున్న ఈ కాలంలో కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు… పాత వాసనలు చవి చూస్తుంటాం… వందల ఏళ్ల ఆచారమంటూ… ఇప్పటికీ పాటించే ఆనాటి అలవాట్లు కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతాం.

మూడేళ్లకు ఒక్కసారే జరుగుతాయి

ప్రతి మూడేళ్లకు మాత్రమే సాధారణంగా భిన్న మతాలకు, కులాలకు, జాతులకు పెట్టింది పేరైన భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో వివాహ సంప్రదాయాలు, ఆచారాలు ఒక్కోలా ఉంటాయి. చాలా మంది వాటిని నామమాత్రంగా పాటిస్తున్నప్పటికీ… కొంత మంది మాత్రం ఇప్పటికి పూర్వీకుల నుంచి తరతరాలుగా అనుసరిస్తూ వస్తున్న కట్టుబాట్లను, సంప్రదాయలను అట్టి పెట్టుకునే ఉంటారు. సాధారణంగా మనం ఈ తరహా విధానాలు గిరిజన తెగల్లో ఇప్పటికీ కనిపిస్తుంటాయి. నాగరిక సమాజానికి ఇప్పటికీ అంటీ ముట్టనట్టు ఉండటం.. సంప్రదాయాలు, ఆచారాలనే ప్రధానంగా వారి జీవనాన్ని కొనసాగిస్తుండటం.. ఇవే ప్రధాన కారణాలు. అయితే మైదాన ప్రాంతాల్లో వీటికి కొంత వరకు మినహాయింపు ఉంటుంది. అలాగని మైదాన ప్రాంతాల్లో, నగరాల్లో వివాహ సంప్రదాయాలను పాటించడంలేదని చెప్పడం ఈ కథనం ఉద్ధేశం కాదు. వారితో పోల్చితే గ్రామాల్లో, కొండ కోనల్లో నివసించే వారు మాత్రం వాటి విషయంలో మరింత పట్టుపై ఉంటారు.

ఇప్పుడు అలాంటి వారి గురించే మనం చెప్పుకోబోతున్నాం

ఉత్తరాంధ్రలోని… శ్రీకాకుళం జిల్లా… పలాసకు సమీపంలోని సముద్ర తీరానికి ఆనుకొని ఉంటుంది నువ్వల రేవు అనే చిన్న పల్లె. ఊరు… ఊరంతా మత్స్యకారులే. సముద్రంలోకెళ్లడం మగాళ్ల పని… వాళ్లు తెచ్చే సంపాదనతో ఇంటిని చక్కదిద్దుకోవడం ఆడవాళ్ల పని. సాధారణంగా అన్ని చోట్లా ఉండేదే అనుకుంటే ఈ కథనాన్ని ఇక్కడతో ఆపేయచ్చు. కానీ… ఆ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఊరి కట్టుబాట్లకు ఓ ప్రత్యేకత ఉంది. అన్నింటికీ మించి ఆ ఊరి వివాహ వ్యవస్థకే ప్రత్యేకత ఉంది. వందల ఏళ్ల చరిత్ర కూడా ఉంది.

వింత పెళ్లిళ్లు...విచిత్రమైన ఆచారాలు

ఒడిషా నుంచి ఆంధ్రకు వలస

హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లికూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టడం ఆనవాయితీ. కులాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు వేరైనా.. దేశమంతా హిందువుల్లో దాదాపు ఇలాంటి ఆచారమే కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ ఆ ఆచారానికి కాస్త భిన్నంగా ఉంటుంది నువ్వుల రేవులో జరిగే పెళ్లి. అంతే కాదు.. సాముహిక వివాహాల గురించి మనం ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం… కానీ ఊరంతా ఒకేసారి పెళ్లిళ్లు చేసుకునే పద్ధతి గురించి ఎంత మంది మనలో విన్నారు..? ఆ పద్ధతి కూడా నువ్వుల రేవు గ్రామం గురించి ప్రపమంచమంతా ప్రత్యేకంగా చెప్పుకునేలా చేసింది.

ఎవరి పెళ్లి వారిదే నిజానికి గ్రామాల్లో పెళ్లిళ్లంటే ఆ సందడే వేరు… అలాంటి ఊరంత మంటపంలో వందలాది పెళ్లిళ్లు ఒకేసారి జరిగితే చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. అయితే పేరుకు ఊరంతా పెళ్లిళ్లే అయినా.. ఒకేసారి జరిగినా.. ఒక్క మంటపంలో జరగవు. ఎవరి పెళ్లి వారిదే.. ఎవరి మంటపం కూడా వారిదే. సాధారణంగా నువ్వుల రేవులో 2-3 ఏళ్లకొకసారి పెళ్లిళ్లు జరుగుతాయి. సుమారు 3500 మందికి పైగా కుటుంబాలున్న నువ్వుల రేవులో కనీసం 13 వేల మంది జనాభా ఉంటారు. శతాబ్దాల క్రితం ఒడిశా నుంచి వలసొచ్చిన కేవిటి కులస్తులు వాళ్లంతా. నువ్వలరేవు  కేంద్రంగా నివాసం ఏర్పరచుకుని అక్కడే స్థిరపడ్డారు.

మూడేళ్లకు ఒకసారి పెద్దల కుదిర్చిన ముహూర్తంలోనే.. గ్రామంలో పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు ఒక్కటవుతుంటారు. ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలకు.. అదే గ్రామానికి చెందిన అబ్బాయిలతో.. వివాహాలు జరిపించడం ఆనవాయితీ. ఇంటి పెద్దల అంగీకారం, అమ్మాయి, అబ్బాయిల ఇస్టానుసారమే పెళ్లిళ్లు నిర్ణయిస్తుంటారు.

ఒకే ముహూర్తం - ఊరంతా పెళ్లిళ్లు

ఒకే ముహూర్తం – ఊరంతా పెళ్లిళ్లు

ఒకే ముహూర్తంలో.. అన్ని జంటలకు సామూహిక మాంగల్యధారణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కేవిటి సంప్రదాయం ప్రకారం.. రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా కులదేవత బృందావతి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ కోనేరు నుంచి తెచ్చిన నీటితో పెళ్లికొడుకు మంగళ స్నానం చేసి ఇంటి ముందు పీటపై కూర్చుంటాడు. తర్వాత వధూవరులు ఆకువక్కలతో.. ఇంటింటికి వెళ్లి.. బంధువులు, స్నేహితులను పెళ్లికి ఆహ్వానిస్తారు.

పెళ్లికి కూడా చాలా ప్రత్యేకంగా ముస్తాబవుతారు. కట్నకానుకలు లేకుండా.. కేవలం అత్తారింటి వారిచ్చిన బట్టలు, స్నేహితులు, బంధువులు ఇచ్చిన కరెన్సీ నోట్లను దండగా మెడలో వేసుకొని.. పెళ్లి పీటలపై కూర్చుంటాడు పెళ్లి కొడుకు. అంతేకాదు.. హిందూ వివాహ పద్ధతిలో.. వరుడు.. వధువు మెడలో తాళి కడతాడు. తర్వాత.. వధువు కూడా వరుడికి బంగారంతో తయారు చేసిన ఆభరణాన్ని తాళిగా కడుతుంది. దీనిని.. దురుసం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఒకరి మెడలో ఒకరు తాళి కట్టడం అంటే సంసార జీవితంలో ఇద్దరు సమాన భాగస్వాములుగా సమాన బాధ్యతలతో జీవితాన్ని కొనసాగిస్తామని చెప్పడం.  పెళ్ళికూతురు  పెళ్ళికొడుకుకు కట్టిన తాళిని 18 రోజుల తర్వాత తీసి తన శతమానంలో కట్టుకుంటుంది పెండ్లి కుమార్తె.

ఎవ్వరైనా ఊళ్లో వాళ్లనే పెళ్లి చేసుకోవాలి

ఎవ్వరైనా ఊళ్లో వాళ్లనే పెళ్లి చేసుకోవాలి

మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ సామూహిక వివాహాల కోసం.. చిన్నా, పెద్దా అంతా కలిసి వస్తారు. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వలసెళ్లిన వాళ్లంతా.. గ్రామానికి చేరుకుంటారు. ఈ ఏడాది గ్రామంలో  62 సామూహిక వివాహాలు జరిగాయి. దీంతో దాదాపుగా ప్రతి వీధిలో బాజా భజంత్రీల సందడి నెలకొంది.

ఒకేసారి 60-70 జంటలకు పెళ్లిళ్లు

ఒకేసారి 60-70 జంటలకు పెళ్లిళ్లు

కొన్ని శతాబ్దాల క్రితం మొదలైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు.. కొత్త తరాలు కూడా సై అంటున్నాయ్. తరాలు మారినా, తమ సంస్కృతీ సంప్రదాయాలు చెరగవంటున్నారు గ్రామస్తులు.

కుటుంబాలపై భారం పడకూడదనే ఈ ఆచారం

కుటుంబాలపై భారం పడకూడదనే ఈ ఆచారం

ముంబైలోనూ ఇలాంటి పెళ్లి ఇలా .. అమ్మాయే అబ్బాయి మెడలో తాళి కట్టిన పెళ్లి ఓ నాలుగేళ్ల క్రితం ముంబై మహానగరంలో కూడా జరిగింది. తనకు తాను స్త్రీవాదిగా చెప్పుకునే శార్దూల్ కదమ్ అనే యువకుడు 2020 డిసెంబర్లో హ్యూమన్స్ ఆఫ్ బొంబే ఫేస్ బుక్ గ్రూపులో తన స్టోరీని చెప్పుకున్నారు. నాలుగేళ్లుగా పరిచయం ఉన్న తన స్నేహితురాలు తనుజా పాటిల్‌ను పెళ్లి చేసుకునే సమయంలో ఇద్దరూ ఒకరికొకరు తాళి కట్టుకట్టున్నారు. ఇదే విషయాన్ని శార్దూల్ తల్లిదండ్రులు, బంధువులు అడిగినప్పుడు వివాహం అనే బంధంలో ఇద్దరూ సమానమేనని.. అందుకు గుర్తుగానే తాను కూడా తాళి కట్టించుకుంటున్నానని సమాధానం చెప్పారు శార్దూల్. అంతే కాదు… తన భార్య ఎలాగైతే ఎల్లప్పుడూ తాళిని తన మెడలో ఉంచుకుంటారో.. అలాగే తాను కూడా నిత్యం తన మెడలో తాళి బొట్టును ఉంచుకుంటానని కూడా శార్దూల్ స్పష్టం చేశారు. అయితే అప్పట్లో ఈ వార్త మీడియాలో వచ్చినప్పుడు శార్దూల్, తనూజా ఇద్దరూ చాలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే వాటిని వాళ్లిద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. జీవితాంతం కలిసి బతకాల్సిన తాము ఒకరికొకరం అర్థం చేసుకున్నప్పుడు తమను వేలెత్తి చూపించే ఈ ప్రపంచంతో మాకు పనేంటన్నది శార్దూల్-తనూజాల మాట.

అంటే.. ఇప్పుడు ఇంత నాగరికత సాధించి..స్త్రీ-పురుషుల్ని సమానంగా చూస్తున్నామని చెప్పుకుంటున్న ఈ సో కాల్డ్ సమాజంలో .. ఒక పురుషుడు సమానత్వం పేరుతో కాస్త భిన్నంగా ఆలోచించేసరికి చుట్టూ ఉన్న వారి నుంచి వెక్కిరింతలు, ఈసడింపులు. కానీ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో ఓ మారు మూల సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఓ చిన్న పల్లెటూళ్లో వందల ఏళ్ల క్రితం స్త్రీ-పురుష సమానత్వానికి ప్రతీకగా నిలిచే పెళ్లి పద్ధతుల్ని ప్రవేశపెట్టడం… వాటిని ఇప్పటికీ ఊరు ఊరంతా పాటిస్తూ ఉండటం.. నిజంగా విశేషం. కాదంటారా…?

మరిన్ని ప్రీమియం వార్తల కోసం

Latest Articles