Nap at Office: ఆఫీసులో ఉద్యోగులు మధ్యాహ్నం ఓ అరగంటపాటు ఓ కునుకు తీయొచ్చు.. ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న నిర్ణయం..
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చాలామందికి నిద్ర ముంచుకొస్తుంది. కొద్దిసేపు కునుకు తీయాలనుకుంటారు. ఇలా మధ్యాహ్నం కనీసం ఓ అర గంట పాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలామంచిదంటున్నారు నిపుణులు
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చాలామందికి నిద్ర ముంచుకొస్తుంది. కొద్దిసేపు కునుకు తీయాలనుకుంటారు. ఇలా మధ్యాహ్నం కనీసం ఓ అర గంట పాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలామంచిదంటున్నారు నిపుణులు. కాసేపు కునుకు తీయడం వల్ల పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని, మానసిక ఆందోళన దూరమవుతుందని వారు సూచిస్తున్నారు. ఈక్రమంలో చాలా సంస్థలు కూడా తమ ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం పూట ఓ అరగంట పాటు కునుకు తీసేందుకు అనుమతినిస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ (WakeFit) అనే సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది. పరుపులు, సోఫాల తయారీ వ్యాపారంలో ఉన్న ఈ సంస్థలో సుమారు 677 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఓ అరగంట పాటు ఈ ఉద్యోగులందరూ విశ్రాంతి తీసుకునేలా అధికారిక న్యాప్ టైం అవర్ (Nap Time Hour) ను తీసుకొచ్చింది వేక్‌ఫిట్ యాజమాన్యం. దీనికి సంబంధించి ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగెగౌడ తమ ఉద్యోగులందరికీ ఓ ఈ-మెయిల్ సమాచారమందించారు. దీనిని చూడగానే వేక్‌ఫిట్ ఉద్యోగులంతా ఆనందంలో మునిగిపోయారు.
నిద్ర పోయేందుకు కూడా శాలరీ ..
‘మధ్యాహ్నం సమయంలో కొంత సేపు నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే దాన్ని మనం ఎప్పుడూ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మధ్యాహ్నం 26 నిమిషాల నిద్రతో ఉద్యోగంలో మన ఫర్ఫామెన్స్ 33 శాతం పెరుగుతందని నాసా అధ్యయనంలో తేలింది. ఈ కాసేపు కునుకు ఒత్తిడిని తగ్గిస్తుందని హార్వర్డ్ అధ్యయనం కూడా తేల్చి చెప్పింది. వీటిని దష్టిలో ఉంచుకుని మన కంపెనీలో ఉద్యోగులందరికీ మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు అధికారిక న్యాప్ టైం ఇవ్వాలని నిర్ణయించాం. ఇక నుంచి మధ్యాహ్నం నిద్ర పోయే హక్కును మీరందరూ పొందుతారు. అందుకు తగినట్లుగా వర్కింగ్ క్యాలెండర్‌లో మార్పులు కూడా చేశాం. ఇందుకోసం ఆఫీసులో న్యాప్ ప్యాడ్స్, ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేయనున్నాం’ అని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు చైతన్య. కాగా ఈ మెయిల్ స్క్రీన్‌షాట్‌ను వేక్‌ఫిట్ బ్రాండ్ హెడ్ ప్రతీక్ మల్పని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. ‘నిద్ర పోయేందుకు కూడా శాలరీ పొందుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది’ అని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మెయిల్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సంస్థ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మిగిలిన కంపెనీలు కూడా దీనిపై ఆలోచించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: