TV9 Focus: దర్శకుడిగా కథలు చెప్పాలనుకున్నాడు.. కరోనా కాటుకు తానే కథనంగా మారిపోయాడు..

TV9 Focus: వెండితెర మీద ప్రేక్షకులకు కథలు చెప్పాలనుకున్నాడు. అదే లక్ష్యంతో కష్టపడ్డాడు..సరిగ్గా లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో కరోనా కాటేసింది. అంతే.. అతనే కరోనా కథగా మిగిలిపోయాడు.

  • Publish Date - 3:17 pm, Fri, 11 June 21
TV9 Focus: దర్శకుడిగా కథలు చెప్పాలనుకున్నాడు.. కరోనా కాటుకు తానే కథనంగా మారిపోయాడు..
Tv9 Focus


TV9 Focus: వెండితెర మీద ప్రేక్షకులకు కథలు చెప్పాలనుకున్నాడు. అదే లక్ష్యంతో కష్టపడ్డాడు..సరిగ్గా లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో కరోనా కాటేసింది. అంతే.. అతనే కరోనా కథగా మిగిలిపోయాడు. ఇద్దరు చిన్నారులతో అతని భార్య ఇప్పుడు మాకు దిక్కేది అంటూ రోదిస్తోంది. ఆమె కన్నీటి వ్యధను ఆపగలిగేది ఎవరు? ఆ చిన్నారులకు భవిష్యత్ ఇచ్చే దారి ఎక్కడ దొరుకుతుంది. ఇది కరోనా మహమ్మారి ఓ ముచ్చటైన కుటుంబం పై వేసిన విషపు దెబ్బ. ఎన్నో కలలతొ హైదరాబాద్ లో వెండితెరపై దర్శకుడిగా వెలిగిపోవాలని వచ్చి కరోనాకు బలైపోయిన ఆ యువకుడి గురించి వింటే ఎవరి కళ్ళయినా చెమర్చక మానవు. టీవీ9 ఇటువంటి కరోనా కన్నీటి కథల్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. బంధాలను తెంపేస్తున్న కరోనా కాటుతో వీధిన పడిన బ్రతుకు చిత్రాలను లోకానికి అందిస్తోంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారికి అండగా ఒక్కరైనా ఈ కథనాలకు స్పందిస్తారనేది టీవీ9 ఆశ. మానవత్వాన్ని మేలుకోలపడమే లక్ష్యంగా..టీవీ9 చేస్తున్న చిరుప్రయత్నమీ కరోనా కన్నీటి కథనాలు. ప్రస్తుతం మీకు అందిస్తున్న ఈ కథనం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లునావత్ గ్రామానికి చెందిన శ్రీనివాస నాయక్ అనే యువకుడిది.

శ్రీనివాస నాయక్ మారుమూల గ్రామం నుంచి మంచి చదువుతో జీవిత ప్రయాణం మొదలు పెట్టారు. ఆయనకు పదేళ్ళ క్రితం పెళ్లి అయింది. పెళ్ళయిన సమయానికి శ్రీనివాస నాయక్ వరంగల్ పట్టణంలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ళు వరంగల్ లో లెక్చరర్ గా చేసిన శ్రీనివాస్ కు సినిమాలంటే అంతులేని పిచ్చి. సినిమా దర్శకుడు కావాలని విపరీతమైన కోరిక. దీంతో తన భార్యను ఒప్పించి తన కలలు నిజం చేసుకోవాలని మూడేళ్ళ క్రితం హైదరాబాద్ చేరారు. దాదాపు ఏడాదిన్నర ఇద్దరు చిన్నపిల్లలతో హైదరాబాద్ లో సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం కోసం ప్రయత్నాలు చేశారు. ఎన్నో కష్టాలు పడ్డారు.

అన్నిటిలోనూ ఆయన భార్య వనజ శీనివాస్ వెనుక నిలిచారు. మొత్తానికి సరిగ్గా ఏడాదిన్నర క్రితం శ్రీనివాస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదటి అవకాశం వచ్చింది.. తరువాత మరో రెండు సినిమాలకు పనిచేశారు. ప్రస్తుతం ఒక పెద్ద దర్శకుడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. అక్కడకు వెళ్ళిన కొద్దికాలంలోనే కరోనా మహమ్మారి విరుచుకుపడింది. అది శ్రీనివాస్ నాయక్ నూ కాటేసింది. ఊపిరి తిత్తుల్లో ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. లక్షలు ఖర్చు అయ్యాయి. కానీ.. శ్రీనివాస నాయక్ కరోనాతో చేసిన యుద్ధం విషాదాంతం అయింది. పోరాడుతూనే ఆయన చనిపోయారు. ఇప్పడు ఇద్దరు చిన్నారులతో ఒంటరిగా మిగిలిపోయారు వనజ. చేతిలో ఉన్న డబ్బుకు తోడుగా అప్పు చేసి వైద్యానికి ఖర్చు చేశేశారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రేమించిన భర్త లేడు. ఇద్దరు చిన్నారులకు ఊహ తేలీని వయసు. ఇదీ కరోనా చిదిమేసిన ఒక అందమైన జీవితం. ఇప్పుడు ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆమె కోరుతోంది. ఈ కన్నీటి కథకు ఎవరైనా స్పందించి ఆ చిన్నారుల జీవితానికి.. వెలుగు తేవాలని టీవీ9 కోరుకుంటోంది.

శ్రీనివాస్ నాయక్ కన్నీటి కథనం ఇక్కడ మీకోసం అందిస్తున్నాం..