భార్య గర్భవతిగా ఉన్నప్పుడు.. భర్త ఈ పనులు చేయొద్దా?
హిందూ ధర్మంలో ఎన్నో ఆచారాలు పాటిస్తారు. వివిధ సందర్భాల్లో అవి వివిధ రకాలుగా ఉంటాయి. అలాగే భార్య గర్భం దాల్చినప్పుడు భర్త ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే పట్టింపులు కూడా ఉంటాయి. ఈ ఆచారాలను పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని విశ్వసిస్తారు. అవెంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం పదండి...
హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే భార్య సంతోషంగా ఉంటుందని, ఫలితంగా పుట్టబోయే బిడ్డ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాడని విశ్వసిస్తారు. అలాగే గర్భిణిగా ఉన్న భార్య కోర్కెలు తీర్చడం వల్ల పుట్టిన బిడ్డకు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఇది భర్త ప్రధాన కర్తవ్యమని పెద్దలు చెబుతుంటారు. హిందూ ఆచారాల ప్రకారం భార్య గర్భవతి అయినప్పుడు భర్త చేయకూడని కొన్ని పనుల గురించి తెలుసుకుందాం.
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు
- భార్య గర్భవతి అయినప్పటి నుంచి సముద్రయానం చేయకూడదు. అంతేకాదు సముద్రంలో స్నానం కూడా చేయకూడదు.
- కట్టెలు కొట్టకూడదు. చెట్లను సైతం నరకకూడదు.
- భార్య గర్భవతి అయిన నాటి నుంచి భర్త కటింగ్ చేసుకోకూడదు. 8 నెలలకు చేరుకున్నప్పటి నుంచి షేవింగ్ కూడా చేసుకోకూడదు.
- గర్భిణి స్త్రీల భర్తలు మృతదేహాన్ని మోయకూడదు. కనీసం మరణించినవారి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా వారిని అనుసరించకూడదు. దీన్ని ఇప్పటికీ గ్రామాల్లో కచ్చితంగా పాటిస్తున్నారు.
- గర్భం దాల్చిన మహిళ విదేశీ పర్యటనలు చేయవద్దు. భార్యను విడిచిపెట్టే భర్త కూడా దూర ప్రయాణాలు చేయకూడదు.
- గర్భం దాల్చి 7 నెలలు దాటాక తీర్థయాత్రలకు వెళ్లడం, అక్కడ తలనీలాలు అర్పించడం చేయరాదు.
- ఇంటికి వాస్తు కర్మలు, లేదా ఇతర క్రతువులు మానుకోవాలి.
- పూర్తిగా పండని పండ్లు, పూర్తిగా పరిపక్వం చెందని పూలు కోయరాదు.
ఇవి పాటిస్తే భార్యాభర్తల మధ్య బంధం మరింత దృఢం!
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ఆచారాలన్నీ భర్త తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. గ్రామాల్లో ఇప్పటికీ ఈ ఆచారాలు కొనసాగుతున్నాయి. భార్యభర్తల మధ్య బంధం దృఢంగా ఉండేందుకు ఇది మంచి మార్గమని అంటారు. అంతేకాదు, గర్భవతిగా భార్యకు కొన్ని ఆహార పదార్థాలు, పండ్లు తినాలనిపిస్తుంది. ఆహారం కూడా ఎక్కువగా తింటారు. కొన్ని సార్లు ఎక్కువగా వాంతులు చేసుకుంటే మాత్రం ఎక్కువగా ఆహారం తీసుకోరు. ఇలాంటి సమయాల్లో భర్త తన భార్య పరిస్థితి అనుగుణంగా నడుచుకోవాలి. అప్పుడే గర్భిణి ఆరోగ్యంగా ఉంటుందని ఆచారాలు చెబుతున్నాయి.