Swami Vivekananda Jayanti: మంద‌లో ఒక‌రిగా ఉండ‌కు…వంద‌లో ఒక‌రిగా ఉండ‌డానికి ప్రయత్నించు

Swami Vivekananda Jayanti:  స్వామి వివేకానంద పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది 125 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత మహాసభ...

Swami Vivekananda Jayanti: మంద‌లో ఒక‌రిగా ఉండ‌కు...వంద‌లో ఒక‌రిగా ఉండ‌డానికి ప్రయత్నించు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2021 | 10:11 PM

Swami Vivekananda Jayanti:  స్వామి వివేకానంద పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది 125 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత మహాసభ. ఈ సభలో ఆంగ్లంలో ఆయన చేసిన అనితరసాధ్యమైన ప్రసంగం. ముందుగా ప్రిపేర్ చేసిన ప్రసంగపాఠం కూడా లేకుండా…అమెరికా దేశపు ప్రియ సహోదరులారా…అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ దద్దరిల్లిపోయిన ఘట్టం చిరస్మరణీయం. ఆంగ్ల భాషలో ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పట్టింది. నేడు స్వామి వివేకానంద జయంతి.

బలమే జీవనము.. బలహీనతే మరణం

‘బలమే జీవనము బలహీనతే మరణం’ అన్న స్వామి వివేకానంద.. ప్రవచనం జగద్విఖ్యాత. యువతకు స్పూర్తిగా చైతన్య దీప్తిగా భాసిల్లిన వివేకానంద స్వామి విలక్షణ జీవనశైలి. ఆయన సేవలు సింహావలోకనం చేసుకోవటం ఎంతైన అవసరము. 1863 జనవరి 12 న కలకత్తాలో విశ్వనాధ దత్తా, భువనేశ్వరి దంపతులకు వివేకానందుడు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు నరేంద్రుడు అని పేరు పెట్టారు. బాల్యం నుంచి ఆయనలో ధైర్య సాహసాలు, అద్భతమైన తేలివి తేటలు ఒంట బట్టించుకున్నారు. కళాశాలలో చదువుతుండగా తండ్రి విశ్వనాధ దత్త మరణించడంతో కుటుంబ భారం వివేకానందపై పడింది. చిన్నప్పటి నుంచి నరేంద్రుడి కలల్లో ఒక దివ్య శక్తి వెలుగు రూపంలో గోచరించేది. ఈ తరుణం లో దక్షిణేశ్వరంలో ఉన్న రామకృష్ణ పరమహంసతో పరిచయం ఏర్పడింది. తొలి సారి రామకృష్ణ పరమహంసను కలువగానే ‘ఏంత కాలమునకు వచ్చితివోయి? ఇంతకాలము నాపై నీకింత నిర్దాక్షిణ్యమేలనయ్యా?’ ప్రపంచ ప్రసంగాలతో నా చెవులు చిల్లులు పడుచున్నవి నాయనా! నీవు నరుడను సనాతన ఋషివి. ఇప్పుడు మానవ కోటి బాధలను రూపుమాపుటకై అవతరించిన నారాయణుడవు’ అంటూ సంతోషంతో ఆలింగనము చేసుకున్నారు. అనతి కాలంలోనే నరేంద్రుడు రామకృష్ణుని ముఖ్య శిష్యుడైనాడు.

భారతదేశాన్ని జాగృతము చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఇతను. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. 39 ఏళ్ళ వయసులోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతను జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’ గా1984 లో ప్రకటించింది.

లైట్నింగ్ ఆరేటర్

స్వామి వివేకానంద గొప్ప ఉపన్యాసకుడు. ఆయన ప్రసంగం ఎంతటివారినైన కట్టిపడేసేది. స్వామిని ఆ రోజులలో ‘లైట్నింగ్ ఆరేటర్’ అని పిలిచేవారు. 1893 సెప్టెంబరు లో అమెరికాలోని చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసిన ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచ దేశాలంతట ప్రతి ధ్వనిస్తుంది. ఈ సభలో హిందూ వేదాంత భేరిని మ్రోగించిన వివేకానంద ఇలా చెప్పారు. ఎన్నటికైన విశ్వమానవ మతమనేది ఒకటి వెలసినది అంటే, అది తాను ప్రకటించిన భగవంతునిలా దేశకాలాతీతమై, అనంతమై ఉండాలి. కృష్ణుని అనుసరించే వారి మీద, సాధు పురుషుల మీద, పాపాత్ముల మీద అందరిమీద తదీయ భాను దీప్తి ప్రసరించాలి. అది బ్రాహ్మణ మతంగా కాని, మహమ్మదీయ మతంగా కానీ ఉండక, వీటన్నింటిని తనలో ఇముడ్చుకొని ఇంకా వికాసం పొందటానికి అనంతమైన అవకాశం కల్గి ఉండాలి అన్నారు. దీంతో స్వామి మేధా సంపత్తికి అందరూ ముగ్దులయ్యారు. చికాగో నగర వీధులలో వివేకానందుని నిలువెత్తు చిత్రపటాలు వెలిశాయి. నాలుగు సంవత్సరాల పాటు అమెరికా, ఐరోపా ఖండాలలో పర్యటించి, అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చి, వేదాంత కేంద్రాలు నెలకొల్పి, అనేకులను శిష్యులుగా స్వీకరించి 1897 లో స్వదేశానికి తిరిగి వచ్చారు.

దీంతో భారతదేశంలో నూతన శకం ప్రారంభమైనది. వెను వెంటనే స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించారు. వివేకానందుడు గొప్ప దేశభక్తుడు. భారతదేశ ఘనతను వర్ణిస్తూ ఆయన ఇక్కడనే ఈ ఒక్క దేశంలోనే మానవ హృదయం అతి విశాలమై అనంత విస్తృతిని పొందాడు. అలాగే దైవ విశ్వాసం కంటే మానవ విశ్వాసం ముఖ్యమని బోధిస్తూ మూడు వందల ముఫై కోట్ల దేవతలలోనూ నమ్మకమున్నా నీలో నీకే విశ్వాసం లేకపోతే నీకు ముక్తి లేదు. దేశ ప్రజలందరికి ఆత్మవిశ్వాసం క్రియా శూరత్వము కావాలి. ఈ అవసరము నాకు స్పష్టంగా కనిపిస్తుంది అని నొక్కి చెప్పారు స్వామి వివేకానంద. అంతేకాక మనం సోమరులము, ఏ పని చేయలేము ముందు మనమంతా సోమరితనాన్ని  వదిలి కష్టించి పని చేయటం అలవర్చుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది అంటూ యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద.

స్వామి వివేకానంద సూక్తుల్లో కొన్ని..

1. మిమ్ములను బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి. 2.ప్రతి రోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. 3. నీ వెనుకాల ఏముంది.. ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. 4. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే.. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. 5. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. 6. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు. 7. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి. 8. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. 9. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనలకంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. 10. మందలో ఒకరిగా ఉండకు. వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు.

Also Read: 11th Instalment GST Released: 11వ విడత 6వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం ప్రభుత్వం