AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ సమస్య.. స్పేస్‌లో చక్కర్లు కొడుతున్న 12,930 ఉపగ్రహాలు

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాలు 2 వేల 917. 1957 నుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే.. ఒక్క 2023లో ఎక్కుపెట్టిన ఉపగ్రహాల సంఖ్యే ఎక్కువ. ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12 వేల 930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయ్.

అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ సమస్య.. స్పేస్‌లో చక్కర్లు కొడుతున్న 12,930 ఉపగ్రహాలు
Space
Ram Naramaneni
|

Updated on: Feb 05, 2024 | 6:17 PM

Share

మహానగరాల్లో రోజురోజుకూ జనాభా పెరగడం.. దాంతో పాటు వాహనాల సంఖ్య కోట్లలోకి చేరడం.. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో నగరం నరకప్రాయంగా మారడం చూస్తూనే ఉన్నాం. నేల మీదే కాదు.. నింగిలో కూడా ఇదే సమస్య. కాకపోతే ఇక్కడ వాహనాలు.. అక్కడ శాటిలైట్ వ్యర్థాలు. అంతరిక్షంలో ట్రాఫిక్ జాం… స్పేస్ ఇండస్ట్రీని పీడిస్తున్న పెను సంక్షోభం ఇది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆకాశమే హద్దు అంటూ అంతరిక్ష ప్రయోగాల్లో పోటీ పడుతున్నాయి. స్పేస్‌ఎక్స్ లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఎడాపెడా ప్రయోగాలు చేస్తూ నింగి వైపే చూస్తున్నాయి. దాని ఫలితంగా వినువీధిలో ఉపగ్రహ వ్యర్థాల పరిమాణం పెరిగిపోతోంది. రోదసీలో భారీ సంఖ్యలో వ్యర్థాలు పేరుకుపోయి శిథిలాల కుప్పగా మారబోతోంది అంతరిక్షం. స్పేస్ కంపెనీలతో పాటు స్పేస్ సైంటిస్టుల్ని కూడా కలవరపెడుతున్న అంశమిది.

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాలు 2 వేల 917. 1957 నుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే.. ఒక్క 2023లో ఎక్కుపెట్టిన ఉపగ్రహాల సంఖ్యే ఎక్కువ. ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12 వేల 930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయ్. వీటికి తోడు స్పేస్‌లోకి చేరాక విఫలమైనవి, కొంతకాలం పని చేసి చేతులెత్తేసినవి… కాలపరిమితి ముగిసి భూమితో లింకులు తెగిపోయినవి మరో పాతిక వేలు. ఇవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.

మొత్తమ్మీద 2023 చివరికల్లా అంతరిక్షంలో 8 వేల టన్నుల శాటిలైట్ వ్యర్థాలు అంతరిక్షంలో పోగైనట్టు తేలింది. దీన్నిబట్టి అర్థం చేసుకోండి స్పేస్‌లో ఎంత రద్దీ ఏర్పడిందో. అంతరిక్ష వ్యర్థాలతో లెక్కలేనన్ని ప్రమాదాలు పొంచిఉన్నాయి. స్పేస్ ఇండస్ట్రీకి చుక్కలు కనిపిస్తున్నాయి. భూ కక్ష్యలో తిరుగుతున్న యాక్టివ్‌ ఉపగ్రహాలను ఈ వ్యర్థాలు ఢీకొంటే.. ఎంతో శ్రమకోర్చి ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా ఆగిపోతుంది. 1981లో కాస్మోస్‌-1275 ఉపగ్రహం ఇలాగే పేలిపోయింది.

2006లో ఎక్స్‌ప్రెస్‌ అనే రష్యన్ శాటిలైట్… గుర్తు తెలియని శకలం దెబ్బకు అడ్రస్ లేకుండా పోయింది. 2009లో టెరా, 2010లో ఆరా 2013లో జియోస్‌.. ఇవన్నీ కూడా స్పేస్‌లో ట్రాఫిక్ వల్లే నాశనమయ్యాయి. 2009లో 950 కిలోల బరువున్న కాస్మోస్‌, 560 కిలోల ఇరీడియం ఉపగ్రహాలు ఒకదాన్నొకటి ఢీకొని అంతరిక్షంలోనే పేలిపోయాయి. వినువీధిలో రెండు భారీ ఉపగ్రహాలు పరస్పరం ఢీకొట్టడం అదే తొలిసారి! ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి సైతం ఈ వ్యర్థాలతో ముప్పు తప్పేలా లేదు.

నింగిలో 27 వేల అంతరిక్ష వస్తువులుంటే వీటిలో 80 శాతం వ్యర్థాలే. వీటికితోడు అమెరికా, రష్యా, భారత్‌, చైనా యాంటీ శాటిలైట్‌ పరీక్షలు నిర్వహించడం రోదసీకి ముప్పు కలిగిస్తోంది. అంతరిక్షంలో ఏర్పడే ట్రాఫిక్‌ జామ్‌కి ఇస్రో కూడా బాధితురాలే. అంతరిక్షంలో పేరుకున్న వ్యర్థాల వల్లే శ్రీహరికోట నుంచి చేసిన PSLV ప్రయోగం నిమిషం పాటు ఆలస్యమైంది. ఆ తర్వాత వసుధైక కుటుంబం స్ఫూర్తితో స్వచ్ఛందంగా స్పేస్‌ను తన వంతుగా ఖాళీ చేసింది ఇస్రో. ఆర్బిట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అనే ప్రక్రియతో స్పేస్‌లో రద్దీని నియంత్రించే ప్రయత్నం కూడా జరుగుతోంది. కానీ.. శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తూనే ఉంది స్పేస్‌లో ట్రాఫిక్ సమస్య.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..