Tribal woman: గిరిజన మహిళల ప్రసవ కష్టాలు.. ఏజెన్సీ ఏరియాల్లో వాగులు దాటలేక గంటలపాటు నరకయాతన
గిరిజన బాలింతలకు పురుటి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు వీలులేక,
Pregnant tribal woman: గిరిజన బాలింతలకు పురుటి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు వీలులేక, ఆస్పత్రులకు వెళ్లేందుకు మార్గం లేక గంటల తరబడి ప్రసవవేదనలు అనుభవిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మానిపెళ్ళి సుభద్ర అనే గర్భిణీ ఏకంగా మూడు గంటల పాటు ప్రసవ వేదన అనుభవించింది.
ఉదయం కురిసిన భారీ వర్షానికి నక్కలపల్లి వాగు ఉప్పొంగింది. వాగు దాటే మార్గం లేక నాలుగు గంటలు నరకయాతన అనుభవించింది సుభద్ర. ప్రసవ వేదన తీవ్రం అవుతుందటంతో సాహసం చేసి వాగు దాటించారు 108 సిబ్బంది.. నక్కలపల్లి స్థానికులు. వాగు దాటి అంబులెన్స్ లోకి చేర్చగానే పండంటి బాబుకి జన్మనిచ్చింది సుభద్ర.
అటు, నిర్మల్ జిల్లా కడెం మండలంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దత్తోజీపేట గ్రామానికి చెందిన రొడ్డె ఎల్లవ్వకు అర్ధరాత్రి దాటిన తర్వాత పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉదయం కడెం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. బొలెరో వాహనంలో ఎల్లవ్వను తరలిస్తుండగా లద్దివాగు వద్దకు వచ్చేసరికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
వాహనం అదుపు తప్పకుండా ట్రాక్టర్‌కు తాడు కట్టి వాగు దాటించారు. అయితే వాగు దాటే క్రమంలోనే ఆమెకు పురిటినొప్పులు మరింత పెరిగాయి. వాగు దాటిన వెంటనే ఎల్లవ్వ వాహనంలోనే ఆడశిశువుకు జన్మనిచ్చింది.