Planetary Parade: ఆకాశంలో మహాద్భుత దృశ్యం.. ఇవాళ ఒకే సరళ రేఖపై 7 గ్రహాలు.. ఏ టైమ్‌లో చూడొచ్చంటే?
శుక్రవారం (ఫిబ్రవరి 28)అంతరిక్షంలో అద్భుతం జరగబోతోంది. ఆకాశంలో సప్తగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వచ్చే... ప్లానెట్ పరేడ్ కనువిందు చేయనుంది. ఇది ఇవాళ ఎన్నింటికి కనిపిస్తుంది? దీన్ని మనం నేరుగా చూడొచ్చా? తదితర విషయాలు తెలుసుకుందాం రండి.

ఆకాశంలో ఇవాళ రాత్రి ఓ మహాద్భుతం సాక్షాత్కారం కానుంది. సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు సూర్యుడికి ఒక వైపునకు వచ్చి, ఒకే సరళరేఖపై దర్శనం ఇవ్వనున్నాయి. ఖగోళ శాస్త్రంలో దీన్ని ప్లానెట్ పరేడ్‌గా పిలుస్తారు. మహాశివరాత్రి తర్వాత అంతరిక్షంలో గ్రహాలు కనువిందు చేయనుండడంతో, ఇది మరింత విశిష్టత సంతరించుకుంది. మన రిపబ్లిక్ డే పరేడ్ లాగానే…ఆకాశంలో గ్రహాలు కవాతు చేయనున్నాయి. ఆ సమయంలో శని, బృహస్పతి, అంగారకుడు, శుక్ర గ్రహాలను ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండానే మన కళ్లతో స్పష్టంగా చూడొచ్చు. అయితే వీటిలో నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడడం మాత్రం టెలిస్కోప్ ద్వారానే సాధ్యమవుతుంది.
ఈ ఏడాది జనవరి 21వ తేదీన అంతరిక్షంలో 6 గ్రహాల పరేడ్ దర్శనమిచ్చింది. అయితే ఈసారి ఏకంగా ఏడు గ్రహాలు ఒకే లైన్‌లోకి వచ్చి కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే సూర్య కుటుంబంలోని ఆరు గ్రహాలు శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ ఒకే వరుసలోకి వచ్చి చేరగా.. ఇప్పుడు ఈ లైన్‌లోకి కొత్తగా బుధుడు వచ్చి చేరుతున్నాడు. ఈ ఖగోళ అద్భుతం ఇవాళ మనకు దర్శనం ఇవ్వనుంది.
ఇక ఈ ప్లానెట్ పరేడ్ మన దేశంలో కూడా కనిపిస్తుంది. ఇవాళ రాత్రి 8:30 గంటలకు సప్త గ్రహ కూటమి దర్శనం ఇస్తుంది. ఆకాశం మేఘావృతం కాకుంటే, కాలుష్యం తక్కువగా ఉంటే, ప్లానెట్ పరేడ్ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని కొన్ని యాప్‌ల ద్వారా కూడా చూడొచ్చంటున్నారు నిపుణులు. స్టార్ వాక్-2, స్టెల్లారియం యాప్‌లలో 7 గ్రహాల కవాతును చూడొచ్చంటున్నారు వాళ్లు . అయితే ఆకాశంలో సప్త గ్రహ కూటమి వల్ల ప్రకృతి విపత్తులు తప్పవంటున్నారు జ్యోతిష్యులు. కొన్ని రాశుల వారికి ఇది మంచిది కాదంటున్నారు జ్యోతిష్య పండితుడు రాజన్ గురూజీ,
మరోవైపు ఇది ఖగోళంలో అరుదుగా సంభవించే వింత మాత్రమే అని, దీని వల్ల ఎలాంటి ఉత్పాతాలు జరగవంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. మొత్తానికి సప్త గ్రహ కూటమి కవాతును ఈసారి మిస్ అయితే, మళ్లీ 2040 వరకు ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడలేమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








