National Science Day: నేడు నేషనల్ సైన్స్ డే.. ఎందుకు.. ఎప్పటినుంచి నిర్వహిస్తున్నారో తెలుసా..?
National Science Day 2021: సైన్స్.. మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేము. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది..
National Science Day 2021: సైన్స్.. మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేము. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది.. సైన్స్ మాత్రమేనన్న విషయం అందరికీ తెలిసిందే. భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా.. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే (February 28 National Science Day) నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. సైన్స్ డే నిర్వహించుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే.. భారత శాస్త్రవేత్త సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. ఆ రోజును పురస్కరించుకొని దేశంలో జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు.
ఉద్దేశ్యం..
జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం ఎంటంటే.. ముఖ్యంగా రోజువారీ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత.. దాని ఉపయోగాలను ప్రజలలో వ్యాప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాంకేతిక విద్య, నైపుణ్యాల వృద్ధి, భవిష్యత్‌లో సైన్స్ పరంగా సాధించాల్సిన ప్రగతి పరంగా విద్యార్థులు, యువతను ప్రోత్సహించడం. అలాగే సర్ సీవీ రామన్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జాతీయ సైన్స్ డే ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఎప్పటినుంచంటే..?
సీవీరామన్ భౌతిక శాస్త్రంలో చేసిన సేవలకు గుర్తుగా.. రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును జాతీయ సైన్స్ డేగా నిర్వహించాలని 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిలో భాగంగా రామన్ సేవలకు గుర్తుగా ఫిబ్రవరి 28, 1987 నుంచి జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
రామన్ విద్యాభ్యాసం..
సర్ సీవీ రామన్.. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు 1888 నవంబరు 7న జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన రామన్.. చిన్నప్పటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై ఆసక్తిని చూపేవారు. రామన్ తండ్రి కూడా భౌతికశాస్త్ర టీచర్ కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకొని తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్(Physics)లో గోల్డ్‌మెడల్(Gold Medal) సాధించారు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి.. ఆ సబ్జెక్టులో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు.
నోబెల్ సహా.. ఎన్నో అవార్డులు..
1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించడంతో.. బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో రామన్‌ను గౌరవించింది. ఈ పరిశోధనకు 1930లో రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రధానం చేసింది. దీంతోపాటు భారత ప్రభుత్వం 1954లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. చివరి వరకు సైన్స్ అభివృద్ధికి పాటుపడ్డ సీవీ రామన్ 1970 నవంబర్ 21న కన్నుమాశారు.
Also Read: