E-Bike: ఎలక్ట్రికల్ బైక్ తయారు చేసిన ఖమ్మం కుర్రోడు.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం
సంకల్పం ఉంటే చాలు అద్భుతాలు ఆవిష్కరించవచ్చని నిరూపించాడు ఖమ్మంకు చెందిన రాకేష్. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ద్విచక్రవాహనం కనీస అవసరమైంది.
సంకల్పం ఉంటే చాలు అద్భుతాలు ఆవిష్కరించవచ్చని నిరూపించాడు ఖమ్మంకు చెందిన రాకేష్. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ద్విచక్రవాహనం కనీస అవసరమైంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులను హడలెత్తిస్తున్నాయి.. వాహనదారులు ఎలక్ట్రికల్ బైకుల వైపు చూస్తున్నారు.. ఖమ్మం కుర్రోడు స్వయంగా ఎలక్ట్రికల్ బైక్ తయారు చేశాడు. తక్కువ ఖర్చుతో, ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి బైక్ నడుస్తున్నప్పుడే ముందు చక్రం ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అయ్యేవిధంగా టెక్నాలజీ రూపొందించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పెట్రోల్,డీజిల్ రెట్లు పెరుగుతుండడం వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితుల్లో ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర్ కు చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు గార్లపాటి రాకేష్ తన ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా ఎలక్ట్రికల్ బైక్ తయారు చేసి ఔరా అనిపించారు.
రాకేష్ తండ్రి టైలర్, తల్లి గృహిణి రాకేష్ నగరం లోని కిట్స్ కాలేజిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్నాడు. చిన్నప్పటి నుండి బైక్ లు అంటే రాకేష్ కు ఇష్టం. తన స్నేహితుల సహాయంతో ఎక్కువ సేపు నడిచే బ్యాటరీని తయారు చేశారు. వివిధ వాహనాల విడిభాగాలు సేకరించి తన ఆవిష్కరణకు అనుకూలమైన విధంగా ద్విచక్ర వాహనం తయారు చేసి దానికి అధిక శక్తి ఇచ్చే విధంగా బ్యాటరీ తయారు చేశాడు. దాన్ని ప్రస్తుతం తాను నడుపుతూ వాహన పనితనాన్ని పరిశీలిస్తున్నాడు రాకేష్. నగరంలో ఆ బండి గురించి తెలిసిన ప్రజలు ఆసక్తిగా వచ్చి చూస్తున్నారు. రాకేష్ తండ్రి మాట్లాడుతూ రాకేష్ చిన్నప్పటి నుంచి కూడా ఎలక్ట్రికల్ వస్తువుల మీద ఆసక్తి చూపేవాడు.. ఏదో సాధించాలి అన్న తపన ఎప్పుడూ రాకేష్ లో ఉండేదని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తన స్నేహితులతో ఆలోచించి ఈ బైక్ రూపొందించినట్లు రాకేష్ తెలిపాడు. అధిక శక్తి ఉన్న బ్యాటరీలు తెప్పించి ద్విచక్ర వాహనంకు అమర్చడం వల్ల 200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని వివరించాడు. దానికి డైనమో అమర్చడం వల్ల బ్యాటరీ సామర్థ్యం పెరిగి 300 కిలోమీటర్ల వరకు వెళ్తుందని రాకేష్ తెలిపాడు. అంతే కాదు తాయారు చేసిన ఈ ఎలక్ట్రికల్ వాహనానికి ఆధునిక టెక్నాలజీని అనుసంధానం చేశాడు. మొబైల్ ద్వారా ఈ వాహనాన్ని అన్, ఆప్ చేయవచ్చు. మొబైల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఈ వాహనానికి ఏర్పాటు చేశాడు. బ్యాటరీ పవర్ ఇండికేషన్, ఎంతదూరం ప్రయాణం చేయవచ్చు అనే విషయాలు కూడా తెలుసుకునే విధంగా దీన్ని రూపొందించాడు.. డైనమోలను వాహన చక్రాలకు అనుసంధానం చేసి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తూ బ్యాటరీ రీఛార్జ్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశాడు. దానివల్ల వాహనంకు మరికొంత మైలేజ్ కూడా వస్తుంది. అయితే మొత్తం ఈ వాహనం తయారు చేయడానికి లక్షరూపాయల వరకు ఖర్చు వస్తుంది అని రాకేష్ తెలిపాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్ లో ఖమ్మం నగరంలో గ్యారేజ్ పెట్టి ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేస్తా అని రాకేష్ అంటున్నాడు.
Also Read: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి