Pregnancy: ఈ లక్షణాలతో పుట్టబోయేది ఎవరో తెలుసుకోవచ్చా.? ఇందులో నిజమెంత..
గర్భిణీల్లో ఎన్నో రకాల అపోహలు ఉంటాయి. ముఖ్యంగా కడుపులో ఉంది ఎవరనే విషయంలో ఆతృతగా ఉంటారు. అయితే కొన్ని సింప్టమ్స్ ఆధారంగా కడుపులో ఉంది ఆడా, మగా తెలుసుకోవచ్చని కొందరు భావిస్తుంటారు. ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? ఇవన్నీ అపోహలేనా.? ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతీ మహిళ జీవితంలో గర్భదారణ ఎంతో కీలకమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. హార్మోన్లలో మార్పులు, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా గర్భిణీల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయి. ఇక గర్బందాల్చిన మొదటి రోజు నుంచి ఎన్నో అపోహలు ఉంటాయి. ముఖ్యంగా పెట్టబోయేది అమ్మాయా.? అబ్బాయా.? అన్న విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో ఉంటుంది.
సాధారణంగా పుట్టబోయేది ఎవరో తెలుసుకునేందుకు వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్షను నిర్వహిస్తారు. అయితే భారతదేశంలో లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం. అందుకే వైద్యులు కడుపులో ఉంది ఎవరో అస్సలు చెప్పరు. కొన్ని దేశాల్లో మాత్రం వైద్యులు ముందుగానే చెప్పేస్తారు. అయితే మనలో చాలా మంది కొన్నింటిని నమ్ముతుంటారు. కొన్ని లక్షణాల ద్వారా కడుపులో ఉందో ఎవరనే విషయం తెలుసుకోవచ్చని విశ్వసిస్తుంటారు. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.
పొట్ట గుండ్రంగా ఉంటే అబ్బాయని, పొడవుగా కనిపిస్తే అమ్మాయి అని పెద్దలు అంటుంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఆకారానికి, లింగానికి ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ అపోహ మాత్రమే అని తేల్చి చెబుతున్నారు. అలాగే కడుపులో బిడ్డ పైకి ఉన్నట్లు అనిపిస్తే పుట్టబోయేది ఆడబిడ్డ అని, అదే కింది వైపు ఉంటే అబ్బాయి అని విశ్వసిస్తుంటారు. అయితే ఇందులో కూడా ఎలాంటి నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. బిడ్డ బరువు ఆధారంగానే పైకి లేదా కిందికి ఉంటుంది. అంతేకాని లింగ నిర్ధారణకు ఎలాంటి సంబంధం ఉండదు.
ఉదయాన్నే నిద్రలేవగానే సిక్నెస్ ఎక్కువగా ఉంటే ఆడపిల్ల పుట్టబోతందనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంది. అయితే ఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు. మార్నింగ్ సిక్నెస్ అనేది కేవలం హార్మోన్లలో మార్పులపై ఆధారపడి ఉంటుంది. కడుపులో ఉన్న శిశువు ఎవరనేది తెలుసుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉండవని గుర్తు పెట్టుకోవాలి. కేవలం 20 వారాల తర్వాత తీసే అల్ట్రా సౌండ్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న కొంత సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి. అలాగే పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకోవడం భారత చట్టాల ప్రకారం నేరం. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే శిక్షార్హులనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..