Worships Bathukamma: మంచం పట్టిన భర్తకు ఏడేళ్లుగా సపర్యలు.. ఆరోగ్యం కోసం బతుకమ్మకు పూజలు చేస్తున్న భార్య
సుఖ సంతోషాలతో ఉండాలని బతుకమ్మ ఆడుతాం. అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆ గౌరమ్మ తల్లిని వేడుకుంటాం.. కానీ సూర్యాపేట జిల్లాలో మంచాన పడి నడవలేని పరిస్థితుల్లో ఉన్న భర్త ఆరోగ్యం కోసం బతుకమ్మను కొలుస్తుంది ఓ భార్య.
Worships Bathukamma: అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బతుకమ్మ ఆడుతాం. అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆ గౌరమ్మ తల్లిని వేడుకుంటాం.. కానీ సూర్యాపేట జిల్లాలో మంచాన పడి నడవలేని పరిస్థితుల్లో ఉన్న భర్త ఆరోగ్యం కోసం బతుకమ్మను కొలుస్తుంది ఓ భార్య..
సూర్యాపేట జిల్లా కాసరబాద గ్రామ పంచాయతీ ఎదుర్లవారిగూడేనికి చెందిన లింగంపల్లి రాజు, యశోద దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. పేద బతుకులే అయినా హాయిగా గడిచిపోయే జీవితాలు. కానీ, అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. ఆ ఇంటి పెద్ద దిక్కును మంచానికి పరిమితం చేసింది. సరిగ్గా ఏడేళ్ల క్రితం బతుకమ్మ పండగ రోజు.. టేకు పూల కోసం వెళ్లిన రాజు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. నడుము భాగంలో తీవ్ర గాయాలు కావడంతో.. హైదరాబాద్ చికిత్స అందించారు. స్థోమత లేకున్నా అప్పు చేసి లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన రాజును.. చిన్నపిల్లాడిలా భావించి యశోద అన్ని సపర్యలు చేస్తోంది. భర్తను సాకుతూ కుటుంబ భారాన్ని మోస్తోంది.
బతుకమ్మను కొలిచే క్రమంలో తెలియక ఏమైనా తప్పు చేసినందువల్లే తన భర్తకు ఇలా జరిగి ఉండొచ్చని ఆ కుటుంబం భావిస్తోంది. అప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి భర్తకు ఆరోగ్యం ప్రసాదించి మళ్లీ బతుకమ్మ వరకు మునుపటిలా నడిచేలా దీవించాలని వేడుకుంటోంది. అందరిలా తన భర్త కూడా మామూలు వ్యక్తి కావాలని కోరుకుంటోంది. అయితే, ఎప్పటికన్న ఒకనాటికి తన భర్త కోలుకుంటాడని ఆశపడుతోంది. ఇదిలావుంటే, రాజుకు నిత్యం మందులు ఇవ్వనిదే పూట గడవదు. ఇందుకోసం చికిత్స అందించే క్రమంలో భారీగా అప్పులు చేశారు. ఇప్పుడు మందులు కూడా కొనలేని స్థితులో ఉన్న తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కుటుంబసభ్యులు.
Read Also… Maoist RK: మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మృతి… లైవ్ వీడియో