Father’s Day: నాన్నకు వందనం.. గుండెలపై తన్నినా.. గుండె నిండా ప్రేమ పెంచుకునే మంచి వ్యక్తిత్వం నాన్నది

Father's Day: ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివెళ్లే ‘నాన్న’...ఇంటిపట్టున ఉండలేడు...కంటి నిండా నిద్రపోలేడు. ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదనంతా..

Father's Day: నాన్నకు వందనం.. గుండెలపై తన్నినా.. గుండె నిండా ప్రేమ పెంచుకునే మంచి వ్యక్తిత్వం నాన్నది
Fathers Day
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 20, 2021 | 7:54 PM

Happy Father’s Day 2021:  ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివెళ్లే ‘నాన్న’…ఇంటిపట్టున ఉండలేడు…కంటి నిండా నిద్రపోలేడు. ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు. పిల్లల భవిష్యత్తు నిరంతరం తాపత్రయ పడతాడు. అటువంటి నాన్నకు కూడా అమ్మతో సమానమైన గుర్తింపు ఉండాలనే తలంపుతో 1910 జూన్‌లో మూడో ఆదివారం తొలిసారిగా ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్స్‌ డే ఎలా వచ్చిందో తెలుసుకుందాం..!

ఒక అమ్మాయికి వచ్చిన ఆలోచనతోనే ‘ఫాద‌ర్స్ డే’

పిల్లల్ని కనిపెంచి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పటికీ తల్లికి లభించిన గుర్తింపు తండ్రికి లభించడం లేదని భావించి.. తండ్రి పాత్రకు తగిన గుర్తింపు కోసం ఒక కూతురు పడిన తపన నుంచి పుట్టిందే ఈ ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం). దీన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలన్న అవసరాన్ని తొలిసారిగా గుర్తించి.. ఆ దిశగా ప్రయత్నాలు చేసింది వాషింగ్టన్‌కు చెందిన ‘సొనారా’. ఈ విషయంలో ఆమె ఎంతగానో పోరాడి ఫాదర్స్‌ డే ఏర్పాటయ్యేలా చేసింది. ఈ ఉత్సవాలను మొదలుపెట్టింది అమెరికా అయినప్పటికీ కాలక్రమేణా అన్ని దేశాలకు పాకింది.

సొనారా కుటుంబం..

హెన్నీ జాక్సన్ స్మార్ట్, విలియమ్ స్మార్ట్ దంపతులు వాషింగ్టన్‌లోని ‘స్పొకనే’ అనే గ్రామంలో నివాసముండేవారు. వారికి ఆరుగురు సంతానం. అందులో చివరి సంతానం సొనారా. సొనారాకి 6 నెలల వయసున్నప్పుడే తల్లి మరణించింది. అందరికన్నా పెద్ద కూతురు వయసు 12 ఏళ్లు. ఇదీ అప్పటి (1895) పరిస్థితి. అప్పుడు కూడా పురుషుడుగా విలియమ్‌కు మరో భార్యను తెచ్చుకునే హక్కు, అవకాశం సమాజంలో ఉన్నాయి. కానీ తన సుఖం కన్నా తండ్రిగా తన పాత్రకు న్యాయం చేయడానికే ఆయన మక్కువ చూపారు. వ్యవసాయం చేస్తూ తన బిడ్డలకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచారు. ముఖ్యంగా చిన్నదైన ఆరు నెలల సొనారాకు ఆయనే తల్లి, తండ్రి. ఆరు నెలల పసిపాపకు పాలు పట్టడం, స్నానం చేయించడం, జోలపాడి నిద్రపుచ్చడం.. ఇలా అన్నీ విలియం చేశారు. తల్లి ఉంటుందని కూడా ఆ చిన్న వయసులో సొనారాకి తెలియదు. ఆమెకు తెలిసింది కంటికి రెప్పలా చూసుకునే తండ్రి మాత్రమే.

ఆలోచన మొదలైందిలా..

ఇదంతా చూస్తూ పెరిగిన సొనారాకి 27 ఏళ్ల వయసులో ఒక ఆలోచన వచ్చింది. తండ్రులందరిలో తన తండ్రే అత్యుత్తముడని భావించి ఆయన పుట్టిన రోజునే తండ్రులందని జన్మదినంగా జరపాలని ఆమె భావించింది. అయితే తన తండ్రి జన్మించింది జూన్‌లో అని తెలుసుగానీ, ఏ రోజునో సొనారాకి తెలియదు. దీంతో తన తండ్రి జన్మించిన జూన్‌లో ఏదో ఒక రోజు ఈ వేడుకలను జరపాలని భావించింది. అనుకున్నట్టు ఆ నెలలో ఒక రోజు ఆ ఊరిలో వారందరినీ ఆహ్వానించింది. ఇది కేవలం తన తండ్రి పుట్టినరోజు కాదనీ.. తండ్రులు పోషించే పాత్రను మొత్తం సమాజానికి, ఇతర పిల్లలకు తెలియ చేప్పే రోజని అందుకే ఈ రోజును ఫాదర్స్‌ డేగా జరుపుకొందామ‌ని సొనారా ప్రకటించింది. ఆ ఆలోచన గ్రామస్తులకు కూడా నచ్చడంతో అప్పటి నుంచి వారు ఆ గ్రామంలో ఈ వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు. తర్వాత ఇది పక్క గ్రామాలకు కూడా పాకింది.

పోరాట ఫలితంగానే ఫాద‌ర్స్ డే

తల్లుల కోసం ఒక రోజు కేటాయించినప్పుడు.. తండ్రుల కోసం ఎందుకు కేటాయించకూడదని ఆమె తన పోరాటాన్ని ప్రారంభించారు. ఈ పోరాట ఫలితంగా 1910 జూన్ 19న ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో ఫాదర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. నిజానికి ఆమె జూన్ 5న ఈ వేడుకలను నిర్వహించాలని అనుకున్నా.. అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవడంతో చివరికి జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌ డేగా నిశ్చయించారు. 1916లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ దీన్ని అధికారికంగా ఆమోదించారు. 1966లో జూన్ మూడో ఆదివారం ఫాదర్స్‌ డే జరుపుకోవాలంటూ దీనికి సంబంధించిన తీర్మానంపై అధ్యక్షుడు ‘లిండన్ జాన్సన్’ సంతకాలు చేశారు. తర్వాత దీన్ని నిర్వహించేందుకు శాశ్వత జాతీయ ప్రతిపత్తిని రిచర్డ్ నిక్సన్ కల్పించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫాదర్స్‌ డే ప్రసిద్ధి చెందింది.

ఇవీ కూడా చదవండి

Israel’s Defence: ఇజ్రాయిల్ ఆర్మీలో భారతీయ సంతతికి చెందిన 20 ఏళ్ల యువతి.. గాజా దాడుల్లో పాల్గొన్న నిత్షా

Inspiring Story: రైళ్లలో బిచ్చమెత్తుకునే ఓ హిజ్రా.. ఫోటో జర్నలిస్టుగా ఎదిగిన వైనం.. స్ఫూర్తివంతం