Healthy Relationship: ఎప్పుడూ గొడవలేనా..? రోజుకు 20 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోండి..!
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం సహజం. అయితే అవి తరచుగా జరిగితే.. బంధం దూరం కావచ్చు. ఒకరి తప్పుల గురించి ఆలోచించకుండా.. సమస్యల గురించి కలిసి మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మనం బంధాన్ని బలోపేతం చేసే 7 మార్గాల గురించి తెలుసుకుందాం.

ఇంట్లో పనులు, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ అవసరాలు వేరు. కానీ భార్యాభర్తలు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి సమయం కేటాయించాలి. ఒకరి భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకోవడానికి.. రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుతుంది.
ఇంట్లో నిత్యం ఉండే వాతావరణం కొన్నిసార్లు ఒత్తిడిని పెంచవచ్చు. ఇది భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం అవుతుంది. అప్పుడప్పుడు బయట వాతావరణాన్ని మార్చుకోండి. ఒక మంచి కేఫ్ కి వెళ్లండి, దగ్గరలోని పార్క్ కి వెళ్ళండి లేక సినిమాకైనా వెళ్ళండి. ఇది మనసుకు శాంతిని ఇస్తుంది. ప్రశాంత వాతావరణంలో మాట్లాడుకోవడం వల్ల గొడవలు తగ్గుతాయి.
మీ జీవిత భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు మీరు మొబైల్ చూస్తూనో, టీవీ చూస్తూనో ఉండకూడదు. వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినడం అంటే మీరు వాళ్లను గౌరవిస్తున్నారని అర్థం. ఇది వాళ్లకు మానసిక భద్రతను ఇస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వారిని గమనించడం వల్ల అనవసర గొడవలు తగ్గుతాయి.
ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లే కాలం. ఇంటి పనులు, వంట, పిల్లలను చూసుకోవడం భార్యలకు ఒత్తిడిగా మారవచ్చు. ఈ సమయంలో భర్త కాస్త సహాయం చేస్తే ఆ పంచుకుంటున్న అనుభూతి భార్య మనసుకు దగ్గరవుతుంది. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది.
మీ భాగస్వామి ఎప్పుడైనా మీతో ఏదైనా పంచుకోవాలని అనుకుంటే.. మీరు వారిని పట్టించుకోకపోతే వాళ్ళు నిరాశ చెందుతారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు బిజీగా ఉన్నా కొంత సమయం కేటాయించి వారి మాటలను వినాలి. ఇది మీ ప్రేమను సూచిస్తుంది.
మీ జీవిత భాగస్వామి చిన్న పనులు చేసినా.. వాటిని గుర్తించి వారిని అభినందించండి. ఉదాహరణకు భర్త ఒక్కరోజు వంటలో సహాయం చేసినా.. లేక భార్య ఒక చిన్న గిఫ్ట్ తెచ్చినా వారిని మెచ్చుకోండి. ఇది వారి మనసులో గౌరవాన్ని పెంచుతుంది. వాళ్ళు నన్ను గుర్తించారు అనే భావన పెరుగుతుంది.
పైన చెప్పిన సూచనలు క్రమంగా పాటిస్తే భార్యాభర్తల మధ్య అపార్థాలు మెల్లగా తగ్గిపోతాయి. చిన్న చిన్న మార్పులతో పెద్ద సమస్యలను ఎదుర్కొని ప్రేమతో నిండిన జీవితం గడపవచ్చు.
