బాత్రూమ్.. వాష్ రూమ్.. రెస్ట్ రూమ్.. వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసా..?
బాత్రూమ్, వాష్‌రూమ్.. రెస్ట్ రూమ్, టాయిలెట్ ఇవన్నీ ఒకటే అనుకుంటున్నారా..? అస్సలు కాదు.. మనం రోజువారీగా వాడే ఈ నాలుగు పదాలకు మధ్య చాలా తేడా ఉంది. ఏ గదిలో ఏ సౌకర్యం ఉంటుంది? ఏ పదం ఎప్పుడు వాడాలి? చిన్న తేడానే అయినా.. అసలు రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

మన నిత్య జీవితంలో ఇల్లు, ఆఫీసులు మాల్స్, హోటల్స్.. ఎక్కడైనా సరే టాయిలెట్, బాత్రూమ్, వాష్‌రూమ్, రెస్ట్ రూమ్ అనే పదాలను తరచూ ఉపయోగిస్తుంటాం. చాలా మంది వీటినన్నింటినీ ఒకే అర్థంలో వాడుతుంటారు. కానీ వాస్తవానికి ఈ నాలుగు పదాలకు మధ్య తేడా ఉంది. వాటి సౌకర్యాలు, ఉపయోగాలు వేరుగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ ఉపయోగించే ఈ ప్రదేశాల మధ్య ఉన్న అసలు తేడాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాత్రూమ్ అంటే ఏమిటి?
బాత్రూమ్ అంటే ప్రధానంగా స్నానం చేసే గది. ఇక్కడ ముఖ్యంగా షవర్, బాత్ టబ్, వాష్ బేసిన్, సబ్బులు, బకెట్ వంటి స్నానం చేయడానికి సంబంధించిన సౌకర్యాలు ఉంటాయి. ఇది సాధారణంగా బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌కు అనుబంధంగా ఉంటుంది. చాలా ఇళ్లలో స్నానపు గదిలోనే టాయిలెట్ సీటును కూడా ఏర్పాటు చేసుకుంటారు. అందుకే చాలా మంది బాత్రూమ్‌కు వెళ్లి వచ్చాను అని చెబుతారు. కానీ స్నానం చేసే సౌకర్యం ఉన్న గదిని మాత్రమే బాత్రూమ్ అని పిలవడం సరైనది.
వాష్‌రూమ్ – రెస్ట్‌రూమ్
ఈ రెండు పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తాయి. కానీ రెస్ట్‌రూమ్ అనేది అమెరికన్ పదం. వాష్‌రూమ్ అనేది ప్రధానంగా మూత్ర విసర్జన, మల విసర్జన కోసం తయారు చేయబడింది. ఇక్కడ టాయిలెట్ సీటు, వాష్ బేసిన్, అద్దం, కొన్నిసార్లు బట్టలు మార్చుకోవడానికి కొద్దిపాటి స్థలం ఉంటుంది. వాష్‌రూమ్‌లో షవర్ లేదా బాత్‌టబ్ వంటి స్నానపు సౌకర్యాలు ఉండవు. స్నానపు గదిని వేరుగా ఉంచుతూ వాష్‌రూమ్‌లను ఎక్కువగా నిర్మిస్తుంటారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, మాల్స్, ఆసుపత్రులు వంటి బహిరంగ ప్రదేశాలలో వీటిని స్త్రీ, పురుషులకు విడివిడిగా ఏర్పాటు చేస్తారు. రెస్ట్‌రూమ్‌ను కూడా ఇవే ప్రదేశాలలో ఉపయోగిస్తారు.
టాయిలెట్
టాయిలెట్ అనేది అత్యంత ప్రాథమికమైన ప్రదేశం. ఇది కేవలం మూత్ర విసర్జన లేదా మల విసర్జన చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ కేవలం కమోడ్ మాత్రమే ఉంటుంది. కొన్ని చోట్ల చేతులు కడుక్కోవడానికి బేసిన్ కూడా ఉంటుంది. మరికొన్ని చోట్ల అది కూడా ఉండకపోవచ్చు. ఇక్కడ స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం వంటి ఇతర సౌకర్యాలు ఉండవు. ప్రయాణాలలో లేదా రోడ్డు పక్కన కనిపించేవి ఎక్కువగా టాయిలెట్లు మాత్రమే.
ఈ విధంగా చూస్తే ఈ నాలుగు పదాలు ఒకే రకమైన అవసరాన్ని తీరుస్తున్నప్పటికీ, అవి అందించే సౌకర్యాలు, వాటి నిర్మాణ ఉద్దేశాలలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఇకపై బాత్రూమ్, టాయిలెట్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్‌లను సరైన సందర్భంలో ఉపయోగించి, వాటి మధ్య తేడాను గుర్తించండి..
మరిన్న హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
