ఎముకలు, అస్థిపజరం ఆధారంగా చనిపోయిన వారి వివరాలు ఎలా గుర్తిస్తారో తెలుసా..
ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఒక మనిషిని హత్య చేసిన తర్వాత ఆనవాళ్లు దొరక్కుండా చేస్తున్నారు నిందితులు. కొన్ని సందర్భాల్లో మృతదేహం చాలా సంవత్సరాలుగా దొరక్కపోవడంతో అస్తిపంజరంగా మారుతుంది. ఏవైనా పరిశ్రమంలో భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు శరీరాలు పూర్తిగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగులుతుంటాయి. అలాంటి సందర్భంలో ఆ ఎముకల నుంచి కానీ లేకపోతే అస్తిపంజరం నుంచి కానీ ఎలాంటి వివరాలు సేకరిస్తారు. అది ఆడ లేక మగ, ఆ చనిపోయిన వారి వయసు ఎంత ఉంటుంది అనే వివరాలు ఫోరనిక్స్ నిపుణులు ఎలా తెలుసుకుంటారో తెలుసా.. అయితే తెలుసుకుందాం పదండి.

నగరంలో ఎక్కువగా అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. డీబీఆర్ మిల్స్ ప్రాంగణంలోని పాత భవనం వాటర్ ట్యాంక్ లో, ఆ తరువాత ముర్గీ చౌక్ లోని పాడుబడిన ఇంట్లో… ఇలా తరచూ అస్థిపంజరాలు లభిస్తూనే ఉన్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో వీటిని అధ్యయనం చేసి పోలీసులు మృతుల లింగ నిర్ధారణ చేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. అస్థిపంజరాలన్నీ చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ వీటిని ఫోరెన్సిక్ కోణంలో అధ్యయనం చేసి అనేక వివరాలు తెలుసుకుంటారు. దీన్నే సాంకేతిక పరిభాషలో ఫోరెన్సిక్ ఆస్టియాలజీ అంటారు. ఈ శాస్త్రం ఆధారంగా అస్థిపంజరాల లింగం, వయస్సు తదితరాలను గుర్తిస్తుంటారు.
ఆడ, మగ అస్తిపంజరాలను ఎలా గుర్తిస్తారు?
ఎక్కడైనా గుర్తుతెలియని అస్థిపంజరం దొరికినప్పుడు అది పురుషుడిదా..? స్త్రీదా..? అనేది నిర్ధారించడంలో పెల్విక్ బోన్ కీలకపాత్ర పోషిస్తుంది. తొడ ఎముకలు, వెన్నుముకను కలుపుతూ ఉండే ప్రాంతంలో గుండ్రంగా ఉండే దాన్నే పెల్విక్ బోన్ అంటారు. ఇది స్త్రీలకు వెడల్పుగా, పురుషులకు కుంచించుకుని ఉంటుంది. దీని వల్లే తొడ ఎముక యాంగిల్ (వంపు) నిర్మాణంలోనూ తేడాలు వస్తాయి. పురుషుల తొడ ఎముక యాంగిల్ తక్కువగా, స్త్రీలకు ఎక్కువగా నిర్మాణమై ఉంటాయి. లింగ నిర్ధారణకు ఇది ప్రాథమికమైన అంశం. పుర్రె సైతం దీని గుర్తింపునకు పనికి వస్తుంది. పుర్రె స్త్రీలకు చిన్నదిగా, పురుషులకు పెద్దదిగా ఉంటుంది. ఫీమర్ బోన్గా పిలిచే తొడ ఎముకను బట్టి గుర్తించవచ్చు. సాధారణంగా స్త్రీల తొడ ఎముక సున్నితంగా ఉంటుంది. పురుషుల ఎముకకు కండ పట్టి రఫ్‌గా తయారవుతుంది.
అస్థిపంజరం ఏ వయస్సు వారిదో ఎలా గుర్తిస్తారు?
అస్థిపంజరం ఏ వయస్సు వారిదో నిర్ధారించడానికి పుర్రె ఉపయోగపడుతుంది. శిశువు గర్భంలో ఉండగా పుర్రె ఏడు భాగాలుగా ఉంటుంది. ప్రసవం సమయానికి అవి అతుక్కుని ఒకటిగా మారతాయి. ఈ అతుకులనే సూచర్స్ అని అంటారు. వయస్సు పెరిగే కొద్దీ ఈ అతుకులు తొలగిపోతుంటాయి. అందుకే పసి వాళ్ల తలపై నడినెత్తి భాగం చాలా మెత్తగా ఉంటుంది. కొన్ని నెలలకు అది గట్టిగా తయారవుతుంది. సూచర్స్ ఉన్న స్థితిని బట్టి వయస్సు నిర్ధారిస్తారు. పుర్రెలో ఉన్న పళ్లు కూడా వయస్సు గుర్తించడానికి ఉపయోగపడతాయి. దీన్ని ఫోరెన్సిక్ ఒడెంటాలజీ అంటారు. జ్ఞానదంతం రాకపోతే 18 ఏళ్ల లోపుగా అంచనా వేస్తారు. మిగిలిన పళ్ల తీరు తెన్నులు, ఎముకల నిర్మాణం, వాటి పటుత్వం, ఎత్తు కూడా అస్థిపంజరం ఏ వయస్సు వారిదో గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
అస్థిపంజరం పూర్తి స్థాయిలో లభించనప్పుడు ఏం చేస్తారు?
అస్థిపంజరం లభించకుండా కేవలం కొన్ని ఎముకలే దొరికి, అవి కూడా పూర్తి స్థాయిలో లేకపోతే గుర్తించడం కష్టంగా మారుతుంది. అప్పుడు ఉన్న అవశేషాలను ఫోరెన్సిక్ లాబ్ కు పంపడం ద్వారా డీఎన్ఏ పరీక్షలు నిర్వహింస్తారు. ఈ పరీక్షల్లోనే లింగం, వయస్సు తదితర వివరాలు బయపడతాయి. అస్తిపంజరం ఎవరిదనేది గుర్తించి, అధికారికంగా తెలియాలంటే డీఎన్ఏ పరీక్షలు తప్పనిసరి. అనుమానితులుగా ఉన్న సంబంధీకుల నుంచి రక్తనమూనాల తీసుకోవడం లేదా వారి మెడికల్ రికార్డుల ఆధారంగా ఈ పరీక్షలు చేస్తారు. అలా పోలీసులు తమకు లభించిన పుర్రెలు, ఎముకలకు డీఎన్ఏ టెస్టు పంపించి అవి ఎవరివోఓ ఒక అవగాహనకు వస్తారు. కేసుల దర్యాప్తు, అనుమానితులు, నిందితుల గుర్తింపులో ఈ విధానాలన్నీ ఎంతో ముఖ్య భూమిక పోషిస్తాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
