Andhra Pradesh: మాయదారి చేప.. చెరువుల్లోని చేపలను కబళిస్తోన్న రాకాసి చేప..!
డెవిల్ ఫిష్ ఇతర చేపలను తినడమే కాకుండా రైతులు వేస్తున్న ఫీడ్ కూడా తినేస్తున్నాయని మత్స్య రైతులు తెలిపారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామన్నారు.
ఆయన పేరు కోట రాంబాబు. ఊరు కొల్లిపర మండలం దావులూరు. వ్యవసాయం చేస్తూనే చేపల చెరువులను సాగు చేస్తుంటారు. ఈ ఏడాది సీజన్ లో ఎకరన్నర చెరువులో చేపల సాగు చేపట్టారు. మార్కెట్‌లో మంచి ధర పలికే బొచ్చె, రాగండి, గడ్డి చేపల సీడ్ ను చెరువలో వేశారు. రెండు వేల కౌంట్ చేపల్ సీడ్ వేసిన దగ్గర ఫీడ్ వేస్తున్నారు.
అయితే నాలుగు నెలలు కావస్తుండటంతో చేపల పెంపు ఏ విధంగా ఉందో తెలుసుకుకోవాలన్నారు. వల తీసుకొచ్చి కొన్ని చేపలను పట్టి చూశారు. అయితే తాను తెచ్చిన సీడ్ రాగండి, బొచ్చ చేపల పెరుగుదల సక్రమంగా లేదు. కేజీ పైనే తూగాల్సిన చేపలు పావు కేజీ బరువు ఉండటాన్ని గమనించాడు. దీంతో అనుమానం వచ్చిన రైతు రెండు మూడు శాంపిల్స్ పట్టించాడు. అయినప్పటికీ పెద్దగా తేడా కనిపించలేదు.
అయితే తాను తెచ్చి వేసిన సీడైన బొచ్చ, రాగండి కంటే ఇతర చేపలు ఎక్కువుగా వలకు పడటాన్ని గుర్తించి షాక్ అయ్యాడు చేపల రైతు. అవి ఏం చేపలో తెలుసుకున్నాడు. వెంటనే రైతు గెండె గుభేలయింది. అవి డెవిల్ ఫిష్ అని నిపుణులు తేల్చారు. రాగండి, బొచ్చె కంటే డెవిల్ ఫిష్ ఎక్కువుగా వలకు పడటం, ఇతర చేపలు తక్కువుగా పడటంతో పాటు బరువు తక్కువుగా ఉండటంతో అసలు విషయం అర్ధమైంది.
తాను సాగు చేస్తున్న చెరువులోకి డెవిల్ ఫిష్ చేరడమే కాకుండా బాగా వృద్ది చెందినట్లు గుర్తించారు. ఎక్కడో సముద్రాల్లో, భారీ నదుల్లో పెరగాల్సి డెవిల్స్ చేపలు రైతుల చెరువులోకి ఎట్లా వచ్చిందా అన్న అనుమానం వచ్చింది. అయితే సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు డెవిల్ ఫిష్ వచ్చి చెరువులో కలిసినట్లు భావిస్తున్నారు.
డెవిల్ ఫిష్ ఇతర చేపలను తినడమే కాకుండా రైతులు వేస్తున్న ఫీడ్ కూడా తినేస్తున్నాయని రైతు రాంబాబు తెలిపారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామన్నారు. ఇప్పటికే మంచి సైజ్ రావాల్సిన బొచ్చె, రాగండి పెరుగుదల లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. డెవిల్ పిష్ ను నివారించేందుకు మత్స్యశాఖాధికారులు ముందుకు రావాల్సి అవసరం ఉంది. ఇది ఒక్క రైతు సమస్య మాత్రమే కాదని రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని చెరువుల్లోకి ఈ డెవిల్ ఫిష్ చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అక్వా రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ డెవిల్ ఫిష్ నుండి అక్వా రైతులను కాపాడాల్సిన అవసరం ఉంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..