రోడ్డు మీద బిక్కుబిక్కుమంటూ కనిపిస్తే కుక్క పిల్ల అని ఇంటికి తెచ్చుకున్నారు.. కట్ చేస్తే 6 నెలల తర్వాత
సూపర్ ఉంది కదా పప్పీ.. పాపం అమ్మ నుంచి తప్పి పోయి ఉంటుందని ఇంటికి తీసుకుచ్చారు. 6 నెలల పాటు ఎంతో ప్రేమగా సాకారు.

మీరెప్పుడైనా రోడ్డుపై వెళ్తున్నప్పుడు.. చిన్న కుక్క పిల్ల కనిపిస్తే.. అరె బుజ్జిది భలే ఉందే.. అని పెంచుకునేందుకు ఇంటికి తెచ్చుకోకండి. కొంతకాలానికి సీన్ రివర్సయ్యే ఛాన్స్ ఉంది. పప్పులో కాలేసి తర్వాత నాలుక కరుచుకోవాల్సి ఉంటుంది. తాజాగా బెంగళూరు కెంగేరిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. మాములుగా ఆ ఫ్యామిలీకి జాగిలాలు అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఇటీవల ఓ కుక్క పిల్ల.. తల్లి లేకుండా కనిపించడంతో.. జాలి పడి ఇంటికి తీసుకువచ్చారు. అప్పట్నుంచి దాన్ని ఎంతో జాగ్రత్తగా సాకుతున్నారు. 6 నెలలుగా తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నారు. బిడ్డ మాదిరిగా దానికి ఎటువంటి లోటు లేకుండా అన్నీ పెడుతున్నారు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది.
వయసు పెరిగే కొద్దీ ఆ కుక్క.. కాస్త వింతైన శబ్ధం చేస్తుంది. ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చి.. అది నక్కలా ఉందని ఆ ఫ్యామిలీకి చెప్పారు. కానీ వారు పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత అది ఊళ వేస్తుండటంతో.. అది నక్కే అన్న అనుమానం కలిగింది. అంతేకాదు.. అది పాలు సరిగ్గా తాగడం లేదు. మాంసం పెడితేనే తింటుంది. మరేం పెట్టినా వాసనా చూసి వెళ్లిపోతుంది. దీంతో అది నక్కే అని వారు ఫిక్స్ అయ్యారు. వెంటనే.. ప్రాణిదయా సంఘం ప్రతినిధులకు చెప్పడంతో వారు వచ్చి అది నక్క అని నిర్ధారించారు. అనంతరం దాన్ని తీసుకువెళ్లి సిటీ శివార్లలోని అడవిలో వదిలిపెట్టారు.
అది నక్క అయినప్పటికీ.. వదిలిపెట్టేందుకు బాధ వేసిందని సదరు కుటుంబ సభ్యులు తెలిపారు. 6 నెలల పాటు ఎంతో ప్రేమగా సాకామన్నారు. ఇతరులకు హాని చేస్తుందని అందరూ చెప్పడంతోనే దాన్ని ఇచ్చేసినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం