Atlas Cycles Story: చిన్న షెడ్ నుంచి 50 దేశాలకు విస్తరించిన అట్లాస్ కంపెనీ.. కానీ అన్నదమ్ముల గొడవలతో మూతపడిన సంస్థ

ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లను రవాణా సాధనంగా వినియోగించే ఆ యుగంలో సైకిల్ అడుగు పెట్టింది. జాంకీ దాస్ కపూర్' టూ వీలర్ రైడ్ 'సైకిల్'తో సామాన్య ప్రజలకు జీవితాన్ని సులభతరం చేసింది. ఆ కంపెనీ పేరు అట్లాస్.

Atlas Cycles Story: చిన్న షెడ్ నుంచి 50 దేశాలకు విస్తరించిన అట్లాస్ కంపెనీ.. కానీ అన్నదమ్ముల గొడవలతో మూతపడిన సంస్థ
Atlas Cycles Story
Follow us
Surya Kala

|

Updated on: Dec 03, 2022 | 1:46 PM

ఐరోపాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఒక రేంజ్ లో వెలుగువెలిగిన సైకిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత దేశంలో పల్లెల నుంచి నగరాల వరకు ఒకప్పుడు సైకిల్‌ ఒక ప్రెస్టీజ్ సింబల్. సైకిల్ ముఖ్య రవాణా సాధనం. పెట్రోల్-డీజిల్, సర్వీసింగ్ వంటి ఖర్చులు లేకుండా సైకిల్ ని ఉపయోగించేవారు. ఇది ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగించబడుతున్నా.. ప్రస్తుతం ప్రపంచంలో చైనాలో అత్యధికంగా సైకిల్ ని ఉపయోగిస్తున్నారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. భారత నేడు ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించబడ్డాయి, కానీ స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో నగరాల్లో రోడ్లు కూడా సరిగ్గా లేవు. అంతేకాదు అప్పుడు ప్రజల వద్ద కూడా పెద్దగా డబ్బు ఉండేవి కావు. అప్పుడు సైకిల్ మాత్రమే తోడుగా ఉండేది.

ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లను రవాణా సాధనంగా వినియోగించే ఆ యుగంలో సైకిల్ అడుగు పెట్టింది. జాంకీ దాస్ కపూర్’ టూ వీలర్ రైడ్ ‘సైకిల్’తో సామాన్య ప్రజలకు జీవితాన్ని సులభతరం చేసింది. ఆ కంపెనీ పేరు అట్లాస్. సైకిల్ అంటే అట్లాస్.. అట్లాస్ అంటే సైకిల్ అనే స్టేజ్ కు పేరు వచ్చింది.  ఆకాశం అంత ఎత్తుకెళ్లిన అట్లాస్ కంపెనీ  70 ఏళ్లలో అధ్యయనం ముగించుకుని చరిత్ర పుటల్లో నిలిచింది. ఈరోజు ‘అట్లాస్’ సైకిల్ ప్రయాణం గురించి తెలుసుకుందాం..

కంపెనీకి పునాది ఎలా పడిందంటే..  1951లో జాంకీ దాస్ కపూర్ అట్లాస్ సైకిల్ కంపెనీని ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా బడ్జెట్‌లో ఇవ్వగలిగిన  సైకిల్‌ను తయారు చేయాలని ఆయన కలలు కన్నారు. అలా అట్లాస్ సైకిల్ ఇండస్ట్రీస్‌కు పునాది పడింది. 1952లో కంపెనీ మొదటి సైకిల్‌ను తయారు చేసింది. అదే ఏడాది ఫ్యాక్టరీ విస్తరించి 25 ఎకరాల్లో పనులు ప్రారంభించారు. మొదటి సంవత్సరంలో 12000 సైకిల్స్ ఉత్పత్తి చేయబడ్డాయి. ప్రజలకు అట్లాస్ సైకిల్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

1958లో.. అట్లాస్ అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మయన్మార్, మధ్యప్రాచ్య దేశాల నుండి దక్షిణాఫ్రికాకు సైకిళ్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది. 1961లో కంపెనీ ఒక మిలియన్ సైకిళ్లను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. 1965 నాటికి దేశంలోనే అతిపెద్ద సైకిల్ తయారీ కంపెనీగా అవతరించింది. 2004 నాటికి.. అట్లాస్ సైకిల్స్ 50 దేశాలకు ఎగుమతి చేసేది.

ఉన్నత స్థాయికి చేరుకున్న సంస్థ: డిటర్జెంట్ అంటే సర్ఫ్ అని, టూత్ పేస్ట్ అంటే కోల్గేట్ అని, సైకిల్ అంటే అట్లాస్ అనే విధంగా అట్లాస్ కు ఆదరణ పెరిగింది. ప్రారంభంలో.. బేసిక్ మోడళ్లను తయారు చేసే కంపెనీ .. పేరు సంపాదించిన తర్వాత మార్కెట్లో రెబెల్ సైకిల్‌ను విడుదల చేసింది. ఇది అడ్వెంచర్ బైక్‌గా మార్కెట్ చేయబడింది.

అనంతరం కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా సైకిల్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. తర్వాత గేర్ సైకిల్ యుగం వచ్చింది. అట్లాస్ కంపెనీ 10-గేర్డ్ అట్లాస్ కాంకోర్డ్‌ను కూడా విడుదల చేసింది. 1978లో అట్లాస్ భారతదేశపు మొట్టమొదటి రేసింగ్ సైకిల్‌ను రిలీజ్ చేసింది. ఇది కంపెనీని 1982 ఢిల్లీ ఆసియా క్రీడలకు అధికారిక సరఫరాదారుగా మారింది. భారతదేశంలో ట్విన్ సస్పెన్షన్ డబుల్ షాకర్ బైక్, పవర్ బ్రేక్‌లను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీగా అట్లాస్ చరిత్రకెక్కింది.

కంపెనీ వ్యవస్థాపకుడు జాంకీ దాస్ కపూర్ జనవరి 1967లో మరణించారు, ఆ తర్వాత అతని ముగ్గురు కుమారులు వ్యాపారాన్ని నిర్వహనను చేపట్టారు. ఆ తర్వాత 2000వ దశకంలో ఆ ముగ్గురు సోదరులు .. వారి కుమారుల మధ్య రియల్ ఎస్టేట్ విషయంలో వివాదం మొదలైంది. ఈ విధంగా అట్లాస్ సైకిల్ కంపెనీని మూడు విభాగాలుగా విభజించారు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడం ప్రారంభించింది.

నష్టాల్లోకి వెళ్లడం వెనుక మరో కారణం ప్రజల కొనుగోలు సామర్థ్యం పెరగడం. సైక్లిస్టులు మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో మార్కెట్‌లో పోటీ కూడా పెరిగింది. ఈ విధంగా కంపెనీ పరిస్థితి దిగజారుతూనే ఉంది.

కంపెనీ నిరంతరం నష్టాలను చవిచూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 2014లో మధ్యప్రదేశ్‌లోని మలన్‌పూర్‌లోని అట్లాస్ ఫ్యాక్టరీ మూతపడింది. అనంతరం దాని ఫ్యాక్టరీలన్నీ ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. 2020 జూన్ 3న, దేశంలో కంపెనీకి అతిపెద్ద ప్లాంట్‌గా ఉన్న ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని సాహిబాబాద్‌లో ఉన్న చివరి ఫ్యాక్టరీని కూడా కంపెనీ మూసివేసింది. కంపెనీ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అయితే అట్లాస్ కంపెనీతో అనుబంధం ఉన్న వ్యక్తులు, కస్టమర్ కుటుంబాలు తమ ఆశాభావాన్ని వీడలేదు..  సంస్థ మళ్ళీ పునర్జీవం పోసుకుంటుందని.. మరోసారి నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..